
బతుకమ్మ వేడుక విభజన జోష్
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యలో.. అంటూ పెత్రమాస (పితృ అమావాస్య) రోజైన శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో ఎంగిలిపూల సంబురం మొదలైంది.
బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యలో.. అంటూ పెత్రమాస (పితృ అమావాస్య) రోజైన శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో ఎంగిలిపూల సంబురం మొదలైంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా తొమ్మిది రోజులపాటు మహిళలు ఉత్సాహంగా ఆడిపాడే బతుకమ్మ పండుగ తొలిరోజు ఘనంగా జరుపుకొన్నారు. తంగేడు, గునుగు, బీర, గుమ్మడి, బంతిపూలతో బతుకమ్మలు పేర్చిన మహిళలు ఆలయాల్లోకి తీసుకెళ్లి ఆడిపాడారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని వేరుుస్తంభాల ఆలయంలో మహిళలు వేలాదిగా పాల్గొని బతుకమ్మ ఆడారు. తెలంగాణవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు.
బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ రాష్ట్ర పండుగగా గుర్తించిందని, అందుకే నాలుగేళ్ళుగా అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి డీకే అరుణ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రితో పాటు కలెక్టర్, ఎమ్మెల్యేల సతీమణులు అన్నపూర్ణమ్మ, ప్రసన్న బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మలు కొడుతూ మహిళలకు స్ఫూర్తినిచ్చారు. తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసిన అనంతరం విమలక్క దీనిని ప్రారంభించారు. అనంతరం, తొలి రోజు కార్యక్రమం నిర్వహించాల్సిన మెదక్ జిల్లాకు తరలివెళ్లారు. తెలంగాణలోని 10 జిల్లాల్లో ఈ బహుజన బతుకమ్మ జరగనుంది.
మిఠాయిలు... టపాసులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో శుక్రవారం తెలంగాణలోని పది జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి. తెలంగాణవాదులు, రాజకీయ పక్షాలు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు మిఠాయిలు పంపిణీ చేసి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళలర్పించి, జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. పెత్రామాస రోజే పెద్ద పండుగ వచ్చిందంటూ తెలంగాణవాదులు సంబురాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత టి.హరీష్‌రావు ఆధ్వర్యంలో 1200 మంది తెలంగాణ అమరులకు పెత్రమాస బియ్యం ఇచ్చారు.
- న్యూస్‌లైన్ నెట్‌వర్‌క