జోకర్లా కేటీఆర్: భట్టి
టీఆర్‌ఎస్ వల్లే ప్రాంతీయ విద్వేషాలు
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ మంత్రిగా సీరియస్‌గా పని చేయకుండా జోకర్‌లా, తుపాకి రామునిలా, పిట్టలదొరలా కేటీఆర్ మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. నోరుంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని కేటీఆర్‌ను హెచ్చరించారు.
‘‘ఇప్పటిదాకా సీమాంధ్రులను నోటికొచ్చినట్టు తిట్టిన నోటితోనే కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.సీమాంధ్ర నేతల పేరు ఉచ్ఛరించడానికే అసహ్యించుకున్న కేసీఆర్ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌వి అవకాశవాద, దుష్ట రాజకీయాలు. ఇతర పార్టీల నేతలను బెదిరించడం, ప్రలోభపెట్టడం వంటివాటితో రాజకీయ ఉగ్రవాదానికి టీఆర్‌ఎస్ నేతలు తెర తీశారు. టీఆర్‌ఎస్ గెలిస్తే భయభ్రాంతులు సృష్టిస్తారు. జాగో-బాగో నినాదాలతో తమ నిజ స్వరూపాన్ని నెలరోజుల్లోనే చూపిస్తారు’’ అన్నారు. కాంగ్రెస్ హయాంలో నగరానికి తెచ్చిన గోదావరి నీళ్లను నెత్తిన చల్లుకుని, వాటిని తామే తెచ్చినట్టు చెప్పుకోవడం కేటీఆర్‌కు సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అంతరించిపోతున్న టీడీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ‘ఉత్త రెడ్డి’ అని, తనను ‘వట్టి’ విక్రమార్క అని మాట్లాడటంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్త రెడ్డి, వట్టి విక్రమార్కల సంగతేమిటో 2019లో చూపిస్తామన్నారు.
బీజేపీ-ఎంఐఎం వంటి మతతత్వ పార్టీలను తిరస్కరించాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ అన్నీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకుంటే, బీజేపీకి ఎక్కడ కోపమొస్తుందోననే భయంతోనే అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని ఆరోపించారు. ఐజేయూ సీనియర్ నేత కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్‌యూజే అధ్యక్షుడు టి.కోటిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.