ఉద్వేగ క్షణాలు! | Beas accident | Sakshi
Sakshi News home page

ఉద్వేగ క్షణాలు!

Published Fri, Sep 4 2015 3:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

ఉద్వేగ క్షణాలు! - Sakshi

ఉద్వేగ క్షణాలు!

సాక్షి, సిటీబ్యూరో :  ఓ వైపు తమ బిడ్డలు కళ్ల ముందు లేరనే ఆవేదన. మరోవైపు తమ పిల్లలతో పాటే చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్న ఆనందం. మృత్యువు పంజా విసరకుండా ఉంటే.. ఈ క్షణం తమ ఇళ్లలోనూ సంతోషంతో సంబరాలు జరుపుకునే వాళ్లం కదా అనే భావన... ఇదీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి. ఈ సంఘటన చోటుచేసుకొని 14 నెలలు దాటుతోంది. అయినా.. ఆ కుటుంబాలను విషాదఛాయలు వీడలేదు. ఆ విద్యార్థులంతా ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారే.

గల్లంతైన వారితో పాటే వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులు ఇటీవల ప్రాంగణ నియామకాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. రూ.వేలల్లో వేతనాలతో ఐటీ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించి... కన్నవారి ఆశలను నెరవేర్చారు. ఇప్పుడు వారిళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఒకే కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులను తమ మిత్రులు జలరక్కసికి బలయ్యారన్న విషాదం నేటికీ తొలిచివేస్తూనే ఉంది. వారి స్ఫూర్తితోనే ముందుకెళతామని చెబుతున్నారు. మరోవైపు తమ పిల్లలతో పాటుచదువుకున్న వారుమంచి ఉద్యోగాలు సాధించడం పట్ల గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డలు ఉండి ఉంటే... తమకూ ఆనందాన్ని పంచేవారని కన్నీటిపర్యంతమవుతున్నారు.

 అంతులేని విషాదం...
 వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో అడుగిడిన తొలినాళ్లలో..అంటే జూన్ 8, 2014న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్రేషన్ ఇంజినీరింగ్ చదువుతున్న 48 మంది విద్యార్థులు స్టడీటూర్‌కు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అక్కడి బియాస్ నదిపై నిర్మించిన లార్జీడ్యామ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు. విద్యార్థులు నీళ్లలో దిగిన సమయంలో లార్జీ డ్యామ్ అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లను ఒక్కసారిగా ఎత్తి వేయడంతో ప్రవాహం పెరిగింది. 24 మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగువారందరినీ కలచివేసింది. 14 నెలలు గడిచినా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు.  

 తోటి విద్యార్థులందరికీ ఉద్యోగాలు
 గల్లంతైన వారితో పాటు చదువుకున్న మిగతా 24 మంది విద్యార్థులు ప్రస్తుతం అదే కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో వారంతా అత్యున్నత ఉద్యోగాలు సాధించారు. తాము ఉద్యోగాలు సాధించామనే ఆనందం కంటే...మిత్రులు తమతో లేకపోవడమే ఎక్కువ బాధ కలిగిస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.

 కమిటీ నివేదిక ఏమైందో?
 బియాస్ దుర్ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నియమించిన శైలజా రామయ్యర్ కమిటీ నేటికీ ఎలాంటి నివేదిక సమర్పించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులను మరింత బాధ పెడుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేసేందుకు కమిటీ కట్టుదిట్టమైన సిఫారసులు చేస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా... లార్జీ డ్యామ్ గేట్లను నిర్లక్ష్యంగా ఎత్తారన్న అంశంపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన తుది తీర్పు ఈనెల 8న వచ్చే అవకాశం ఉన్నట్లు గల్లంతయిన విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు.
 
 దురదృష్టం వెంటాడింది
 బియాస్ దుర్ఘటనలో కుమారుడిని కోల్పోవడం మా దురదృష్టం. విష్ణువర్థన్ ఉండి ఉంటే ఇప్పుడుమా ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేది. మావాడు చిన్నప్పటి నుంచి చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిచేవాడు. ఉన్నత చదువులు చదివి మా ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుతాడనుకున్నాం. వాడు దూరమవడం మమ్మల్ని తీరని విషాదంలో ముంచింది.
 -వెంకటేశ్వర్ రెడ్డి, గల్లంతైన విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డి తండ్రి, బోధన్
 
 పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగేవాడు
 నా కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి పెద్ద కంపెనీ స్థాపించి... పారిశ్రామిక వేత్తగా ఎదగాలనుకున్నాడు. కనీసం వందమందికైనా ఉద్యోగాలు కల్పించాలనుకున్నాడు. మా ఆశలు తీరకముందే వాడు మాకు దూరం కావడంతో కోలుకోలేకపోతున్నాం.
 -రాబిన్‌బోస్, దేవాశిష్ తండ్రి
 
 మాకు అదృష్టం లేదు
 శ్రీహర్ష మంచి ఉద్యోగం సాధించి మా ఇంట్లో ఆనందం నింపుతాడనుకున్నాం. కానీ మాకా అదృష్టం లేదు. శ్రీహర్ష మిత్రులు మంచి ఉద్యోగాలు సాధించడం సంతృప్తినిచ్చింది. గత స్మృతులను గుర్తు చేసుకుంటూ భారంగా కాలం వెళ్లదీస్తున్నాం.
      -కేఆర్‌కేవీ ప్రసాద్, శ్రీహర్ష తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement