beas accident
-
రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించండి
-
రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించండి
♦ బియాస్ దుర్ఘటనపై తుదితీర్పు వెలువరించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ♦ హిమాచల్ సర్కారు, విద్యుత్‌బోర్డు, వీఎన్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య ♦ ఎనిమిది వారాల్లో పరిహారం మొత్తాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: 2014 జూన్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ బోర్డు, వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని, ఈ ఘటనకు వీరేబాధ్యులని ఆ రాష్ట్ర హైకోర్టు తుదితీర్పులో స్పష్టంచేసింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ధర్మాసనం ఆదేశించిందన్నారు. 2014 జూన్ 8న లార్జీడ్యామ్ గేట్లను నిర్లక్ష్యంగా తెరవడంతో రాష్ట్రానికి చెందిన 24 మంది వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు గల్లంతయిన విషయం విదితమే. ఈ సంఘటనకుసంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టులో నమోదైన వ్యాజ్యంపై శనివారం తుదితీర్పు వెలువడింది. గతంలో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం శనివారం 40 పేజీల తుదితీర్పును వెలువరించినట్లు ఈ దుర్ఘటనలో గల్లంతయిన విద్యార్థి శ్రీహర్ష తండ్రి, న్యాయవాది కేఆర్‌కేవీ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. పరిహారం మొత్తంలో 60 శాతం హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మరో 30 శాతం వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం, మిగిలిన 10 శాతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. ఎనిమిది వారాల్లోగా పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని స్పష్టంచేశారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పరిహారం చెల్లించే నాటికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల మొత్తానికి 7.5 శాతం వడ్డీ జత కలిపి అందజేయాలని ఆదేశించింది. -
ఉద్వేగ క్షణాలు!
సాక్షి, సిటీబ్యూరో : ఓ వైపు తమ బిడ్డలు కళ్ల ముందు లేరనే ఆవేదన. మరోవైపు తమ పిల్లలతో పాటే చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్న ఆనందం. మృత్యువు పంజా విసరకుండా ఉంటే.. ఈ క్షణం తమ ఇళ్లలోనూ సంతోషంతో సంబరాలు జరుపుకునే వాళ్లం కదా అనే భావన... ఇదీ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి. ఈ సంఘటన చోటుచేసుకొని 14 నెలలు దాటుతోంది. అయినా.. ఆ కుటుంబాలను విషాదఛాయలు వీడలేదు. ఆ విద్యార్థులంతా ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారే. గల్లంతైన వారితో పాటే వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులు ఇటీవల ప్రాంగణ నియామకాల్లో మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. రూ.వేలల్లో వేతనాలతో ఐటీ రంగంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించి... కన్నవారి ఆశలను నెరవేర్చారు. ఇప్పుడు వారిళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఒకే కళాశాలలో చదువుకున్న ఈ విద్యార్థులను తమ మిత్రులు జలరక్కసికి బలయ్యారన్న విషాదం నేటికీ తొలిచివేస్తూనే ఉంది. వారి స్ఫూర్తితోనే ముందుకెళతామని చెబుతున్నారు. మరోవైపు తమ పిల్లలతో పాటుచదువుకున్న వారుమంచి ఉద్యోగాలు సాధించడం పట్ల గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమ బిడ్డలు ఉండి ఉంటే... తమకూ ఆనందాన్ని పంచేవారని కన్నీటిపర్యంతమవుతున్నారు. అంతులేని విషాదం... వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరంలో అడుగిడిన తొలినాళ్లలో..అంటే జూన్ 8, 2014న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్రేషన్ ఇంజినీరింగ్ చదువుతున్న 48 మంది విద్యార్థులు స్టడీటూర్‌కు హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. అక్కడి బియాస్ నదిపై నిర్మించిన లార్జీడ్యామ్ను పరిశీలించేందుకు వెళ్లారు. విద్యార్థులు నీళ్లలో దిగిన సమయంలో లార్జీ డ్యామ్ అధికారులు ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లను ఒక్కసారిగా ఎత్తి వేయడంతో ప్రవాహం పెరిగింది. 24 మంది గల్లంతయ్యారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగువారందరినీ కలచివేసింది. 14 నెలలు గడిచినా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంకా తేరుకోలేదు. తోటి విద్యార్థులందరికీ ఉద్యోగాలు గల్లంతైన వారితో పాటు చదువుకున్న మిగతా 24 మంది విద్యార్థులు ప్రస్తుతం అదే కళాశాలలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీలు వీఎన్‌ఆర్‌వీజేఐటీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో వారంతా అత్యున్నత ఉద్యోగాలు సాధించారు. తాము ఉద్యోగాలు సాధించామనే ఆనందం కంటే...మిత్రులు తమతో లేకపోవడమే ఎక్కువ బాధ కలిగిస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ నివేదిక ఏమైందో? బియాస్ దుర్ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నియమించిన శైలజా రామయ్యర్ కమిటీ నేటికీ ఎలాంటి నివేదిక సమర్పించకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులను మరింత బాధ పెడుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేసేందుకు కమిటీ కట్టుదిట్టమైన సిఫారసులు చేస్తుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా... లార్జీ డ్యామ్ గేట్లను నిర్లక్ష్యంగా ఎత్తారన్న అంశంపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సంబంధించిన తుది తీర్పు ఈనెల 8న వచ్చే అవకాశం ఉన్నట్లు గల్లంతయిన విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. దురదృష్టం వెంటాడింది బియాస్ దుర్ఘటనలో కుమారుడిని కోల్పోవడం మా దురదృష్టం. విష్ణువర్థన్ ఉండి ఉంటే ఇప్పుడుమా ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేది. మావాడు చిన్నప్పటి నుంచి చదువులో అత్యున్నత ప్రతిభ కనబరిచేవాడు. ఉన్నత చదువులు చదివి మా ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చుతాడనుకున్నాం. వాడు దూరమవడం మమ్మల్ని తీరని విషాదంలో ముంచింది. -వెంకటేశ్వర్ రెడ్డి, గల్లంతైన విద్యార్థి విష్ణువర్థన్‌రెడ్డి తండ్రి, బోధన్ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగేవాడు నా కుమారుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి పెద్ద కంపెనీ స్థాపించి... పారిశ్రామిక వేత్తగా ఎదగాలనుకున్నాడు. కనీసం వందమందికైనా ఉద్యోగాలు కల్పించాలనుకున్నాడు. మా ఆశలు తీరకముందే వాడు మాకు దూరం కావడంతో కోలుకోలేకపోతున్నాం. -రాబిన్‌బోస్, దేవాశిష్ తండ్రి మాకు అదృష్టం లేదు శ్రీహర్ష మంచి ఉద్యోగం సాధించి మా ఇంట్లో ఆనందం నింపుతాడనుకున్నాం. కానీ మాకా అదృష్టం లేదు. శ్రీహర్ష మిత్రులు మంచి ఉద్యోగాలు సాధించడం సంతృప్తినిచ్చింది. గత స్మృతులను గుర్తు చేసుకుంటూ భారంగా కాలం వెళ్లదీస్తున్నాం. -కేఆర్‌కేవీ ప్రసాద్, శ్రీహర్ష తండ్రి -
సరైన న్యాయం జరగాలి
- నిర్లక్ష్యంతోనే బియాస్ దుర్ఘటన - అవగాహన వాక్‌లో మృతుల తల్లిదండ్రులు - బియాస్ ఘటనకు ఏడాది పూర్తి ఖైరతాబాద్: బాధితులకు సత్వర న్యాయం జరిగినప్పుడే మాలాంటి కడుపుకోత మరే కుటుంబానికి రాకుండా ఉంటుందనే ఆశతోనే మౌన పాదయాత్ర నిర్వహించినట్లు బియాస్ దుర్ఘటనలో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు తెలిపారు. బియాస్ దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సోమవారం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద నోటికి నల్ల వస్త్రం కట్టుకొని పాదయాత్ర నిర్వహించారు. కొవ్వొత్తులు వెలిగించి మృతిచెందిన విద్యార్థులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు తమ పిల్లలను తలచుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఇది ముమ్మాటికి క్రిమినల్ నెగ్లిజెన్సీ వల్ల జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏటా విద్యార్థులను టూర్‌కు తీసుకెళుతున్న ప్రతి కళాశాల, విద్యాసంస్థలను ప్రభుత్వం గుర్తించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిలో అవగాహన కల్పించాలన్నారు. వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ పేరుతో హిమాచల్‌ప్రదేశ్ వెళ్లి గత సంవత్సరం జూన్ 8న సాయంత్రం 6.30 గంటలకు బియాస్‌నదిలోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.. పీపుల్స్‌ప్లాజాలో సెలైంట్ వాక్‌లో పాల్గొనేందుకు విచ్చేసిన తల్లిదండ్రులు తమ తమ పిల్లలను ఫొటోలో చూసి ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కళాశాల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయి తమకు తీరని బాధను మిగిల్చారని కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వాక్ ప్రారంభానికి ముందు కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బరువెక్కిన హృదయాలతో నిండిపోయింది. భద్రత చర్యలు పాటించలేదు కళాశాల నిర్లక్ష్యంతోనే మా అబ్బాయిని కోల్పోయాం. ఫీజులు వసూలు చేయడంలో ఉన్న నిబద్ధత పిల్లల భద్రత విషయంలో పాటించలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నా కళాశాల యాజమాన్యం తమకేమి పట్టనట్లు ఉంది. - బి.రిత్విక్ బంధువు పట్టించుకోవడం లేదు సత్వర న్యాయం జరగడం లేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయినప్పుడు మాత్రమే మరుగున పడిన సంఘటనలు తెరమీదకు వస్తాయి. ఆ తరువాత అటు ప్రభుత్వం, ఇటు కళాశాలలు పట్టించుకోవు. మాకు న్యాయం చేసే వారే కరువయ్యారు. - ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి క్రిమినల్ నెగ్లిజెన్సీ.. క్రిమినల్ నెగ్లిజెన్సీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చట్టాల్లో మార్పులు రావాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే తీర్పువెలువడినప్పుడే మనిషి మనుగడ ప్రశాంతంగా సాగుతుంది. - కె.ప్రసాద్ ఐక్యత కోసమే వాక్ భావిభారత పౌరుల సంక్షేమాన్ని మరిచి చేతులారా చంపేశారు. ఇది యాక్సిడెంట్ కాదు, కళాశాల నిర్లక్ష్యం. ఈ వాక్‌తో రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ప్రజల్లో ఐకమత్యం తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవాలి. - గోపీకృష్ణ -
బంగరు భవితను మింగేసిన బియాస్
ఆ ఘటనకు ఆర్నెళ్లు.... బియాస్ దుర్ఘటనకు ఆరునెలలు బాధిత కుటుంబాలను ఆదుకున్న తెలంగాణ, హిమాచల్ సర్కార్లు ఎక్స్‌గ్రేషియాకు హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం ఘటనతో సంబంధం లేదంటున్న యాజమాన్యం నేడు హిమాచల్ కోర్టు తుది తీర్పు సిమ్లాకు బాధిత కుటుంబాలు అదో పీడకల.. 24 మంది భావి ఇంజినీర్లను పొట్టన పెట్టుకున్న బియాస్ దుర్ఘటన. తలుచుకుంటేనే నగరవాసుల గుండెలు బరువెక్కుతాయి... కన్నవాళ్లకు పుట్టెడు శోకం మిగిల్చి కోరలు సాచిన బియాస్ నది ప్రవాహంలో కొట్టుకుపోయిన భావిభారత ఇంజినీర్ల కుటుంబాలకు నేటికీ సాంత్వన కలగలేదు.. ఈ ఘటనతో తమకు సంబంధం లేదంటోంది కళాశాల యాజమాన్యం. తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ అధ్యయనం సాగుతూనే ఉంది.. ఇది జరిగి అప్పుడే ఆరు నెలలు గడచిపోయాయి.. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్టు తెలిసింది.. ఆ టూర్‌తో మాకు సంబంధం లేదు : కాలేజీ అఫిడవిట్ అందరినీ కలచివేసిన బియాస్ దుర్ఘటన విషయంలో వీఎన్ఆర్ వీజేఐటీ కళాశాల యాజమాన్యం పాఠాలు నేర్వలేదు. స్టడీటూర్‌కు బయలుదేరిన విద్యార్థులు తాము చెప్పినా వినకుండా లార్జీడ్యామ్ సందర్శనకు వె ళ్లారని, తమకు ఈ టూర్‌కు సంబంధమే లేదని హిమాచల్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీనికితోడు మరణించిన విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, బ్యాంకు రుణాలకు సంబంధించిన అంశాలను కాలేజీ యాజ మాన్యం పరిష్కరించలేదని లార్జీ డ్యామ్ ఘటనలో మరణించిన బానోతు రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్ ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు విద్యార్థులు ఈ ఏడాది జూన్ మొదటి వారంలో విహార యాత్రకు వెళ్లారు. 8వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్‌నదిపై నున్న లార్జీ డ్యామ్ వరద ప్రవాహంలో కోట్టుకుపోయి 24 మంది విద్యార్థులు (ఒక టూర్ ఆపరేటర్ కూడా) మృత్యువాత పడ్డారు. దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తుందని ప్రకటించారు. ఆరునెలలు గడచినా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం గమనార్హం. మరోవైపు బియాస్ దుర్ఘటన జరిగిన తీరుపై తెలంగాణ సర్కారు ఏర్పాటుచేసిన శైలజా రామయ్యర్ కమిటీ సైతం ఆరునెలలుగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించక పోవడం గమనార్హం. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. హిమాచల్ కోర్టు ఆదేశం మేరకు లార్జీ డ్యామ్ అధికారులు, వీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం వేర్వేరుగా తక్షణ సహాయంగా రూ.2.50 లక్షల చొప్పున బాధితులకు పరిహారంగా అందజేశాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. ఈ దుర్ఘటనపై నమోదైన కేసుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తుదితీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుతోనైనా సాంత్వన చేకూరుతుందని బాధిత కుటుంబాలు ఆశిస్తున్నాయి. అధ్యయనం పూర్తయ్యేనా.. దుర్ఘటనపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ నేతృత్వంలో ఓ కమిటీని ఆరు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కేవలం బియాస్ దుర్ఘటన జరిగిన తీరుకే ఈ అధ్యయనం పరిమితం కావడం గమనార్హం. దుర్ఘటన జరిగి ఆరు నెలలు గడిచినా అధ్యయనం పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది జనవరి 15 వరకు సమయం కావాలని ఆమె ప్రభుత్వాన్ని తాజాగా కోరినట్లు తెలిసింది. హైకోర్టు తీర్పుతో న్యాయం? బియాస్ దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నట్లు తెలిసింది. గతంలోనే లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు సీరియస్ అయిన విషయం విదితమే. తాజా తీర్పుతో బాధిత కుటుంబాలకు ఒకింత సాంత్వన కలుగుతుందని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోన్న కళాశాలల నిర్లక్ష్యంపై చెంపపెట్టు అవుతుందని అందరూ అశిస్తున్నారు. ఈ తీర్పు కోసం బాధిత కుటుంబాల సభ్యులు పలువురు ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లారు. పరిహారం.. పరిహాసం.. బియాస్ దుర్ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఆరునెలలుగా బాధిత కుటుంబాలకు పరిహారం అందకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టెడు దుఖాఃన్ని దిగమింగుకుంటూ కాలం వెల్లదీస్తోన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సర్కారు తరఫున మాత్రం సాయం అందుతుందన్న ఆశ అడియాశే అయింది.కాగా దుర్ఘటన జరిగిన వెంటనే మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రులు, ఉన్నతాధికార బృందం ప్రత్యేక విమానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పంపి హడావుడి సృష్టించి డాబు ప్రదర్శించిన ఏపీ సర్కారు పెద్దలు.. ఆచరణలో చేతులెత్తేసి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
‘బియాస్’లో కొట్టుకుపోయిన బాబు హామీ
పరిహారంపై మాట మార్చారంటూ బాధితుల ఆవేదన సాక్షి, హైదరాబాద్: కన్న బిడ్డలను కోల్పోయి దుఃఖంలో ఉన్న తమతో చంద్రబాబు రాజకీయ ఆటలు ఆడారని ‘బియాస్’ ఘటనలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. హైదరాబాద్‌కు చెందిన విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విహారయాత్రకు వెళ్లి హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 2న జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టూర్ ఆపరేటర్‌తోపాటు 24 మంది విద్యార్థులు మృతి చెందారు. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన రూ.1.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి గురువారం సచివాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు. అనంతరం బాధిత కుటుంబాల సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఇస్తామన్న పరిహారం విషయంలో ఆయన మాట మార్చారని విమర్శించారు. మృతుల కుటుంబాలు ఏ ప్రాంతంవారని ఇప్పటివరకు ఎవరూ తమను అడగలేదని.. ఒక్క చంద్రబాబు మాత్రమే ఇలా అడిగారని రిథిమ తండ్రి శ్రీనివాస్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. చంద్రబాబు పట్టించుకోవడంలేదు ‘‘తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ముందు పరిహారం ప్రకటించింది. 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులం ఏపీ సీఎం చంద్రబాబును సోమవారం పార్టీ కార్యాలయంలో కలి శాం. ఇప్పుడు ఆయన మాకు సంబంధం లేదని చేతులెత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వాళ్లకు ఇచ్చుకోవాలి. ఒక ప్రభుత్వం ఇచ్చింది కదా.. మేం ఇవ్వకూడదు అని చెబుతున్నారు’’ - రాంబాబు తండ్రి శేఖర్‌నాయక్, నల్లగొండ రూల్స్ వర్తిస్తాయా.. అని అన్నరు ‘‘ఒక రాష్ట్రం ఇచ్చింది.. మరో రాష్ట్రం ఇవ్వడానికి రూల్ వర్తిస్తుందో లేదో చూస్తాం అని చంద్రబాబు చెప్పారు. ఆంధ్ర సైడ్ పిల్లలకు కూడా ఇచ్చారా? అని అడిగారు. కేసీఆర్ సార్ అందరికీ ఇచ్చారని చెప్పాం. మేము కూడా ఇవ్వవచ్చునా అని మమ్మల్ని అడిగారు. మాకేం తెలుస్తుంది.’’ - రిథిమ తండ్రి పి.శ్రీనివాస్, చిత్తూరు -
హిమాచల్‌లో గడ్డకట్టిన అవినీతి!
సందర్భం ప్రొఫెసర్,మాడభూషి శ్రీధర్ బియాస్ ప్రమాద ఘటన నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించాకే నీటిని వదిలారనీ, ఇందులో ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం. కేదార్నాథ్ విషాద ఘటన జరిగిన దాదాపు ఏడాది తరువాత హిమాలయాలలో మళ్లీ మృత్యువు తాండవమాడింది. హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులను, ఒక టూర్ ఆపరేటర్‌ను బలి తీసుకుంది. ఇది విధి వైపరీత్యం కాదు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం. నేరస్థాయి దాటిన ఘోర దుర్మార్గం. హిమాచల్‌ప్రదేశ్ కులు ప్రాంతపు మండీ జిల్లాలో బియాస్ నదిపైన ఆనకట్ట దాని పక్కనే 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే లార్జీ జలవిద్యుత్ కేంద్రం ఉంది. భావి ఇంజనీర్లను బలిపెట్టిన వారు ఎవరంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యామ్ ఇంజనీర్లు. జూన్ 8 తెల్లవారుజామున ఒంటిగంట నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మొత్తం 29 సార్లు విడివిడిగా 2,820 క్యూమెక్‌ల నీరును వదిలారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు 1,950 క్యూమెక్‌ల నీటిని వదిలారు. ఆ తరువాత మళ్లీ 7 గంటలకు 450 క్యూమెక్‌ల నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహమే డ్యామ్ నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని శరవేగంగా దాటి దాదాపు పది నిమిషాల్లో తాలోట్ గ్రామాన్ని చేరి 25 మంది ప్రాణం తీసింది. అసలు అంత నీటిని ఆ సమయంలో ఎందుకు వదిలారు? ఎవరు వదిలారు? ఇది కేవలం నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. ఒక అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించిన తరువాతనే నీటిని వదిలారనీ, జలవిద్యుత్ విభాగ ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం. జవాబు లేని ప్రశ్నలు అంత భారీగా నీటిని ఆ సమయంలో ఎందుకు వదలాల్సి వచ్చిందనేది ఆ సందర్భానికి అడగవలసిన ఒక ప్రశ్న. అయితే ఈ ప్రమాదానికి ప్రత్యక్షంగా సంబంధం లేని పరోక్షమైన ప్రశ్నలు మరికొన్ని ఉన్నాయి. నీళ్లు సరిగ్గా ప్రవహించని నదికి దగ్గరగా రోడ్డు ఎందుకు నిర్మించారు? అంతగా రాకపోకలకు ఉపయోగపడని ప్రాంతంలో ఈ రోడ్డు వల్ల ఎవరికి ప్రయోజనం? జలవిద్యుత్ ఉత్పాదనకు నీరు నిలువ చేసుకుంటారు. సాధారణంగా వరదలు ఎక్కువగా వచ్చి జలాశయం నిండిపోయి ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉందనుకుంటే నీరు వదులుతారు. కాని జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకునేలా కావాలని భారీ ఎత్తున నీటిని వదిలారు. ఇది దారుణమైన నేపథ్యం. ఒకవేళ వదలడం తప్పనిసరి అయితే రాత్రి వేళల్లో మాత్రమే నీరు వదులుతారు. ఎప్పుడు వదిలినా నదివెంట డ్యాం ఇంజనీర్లు, సిబ్బంది తిరుగుతూ నీటిప్రవాహం పెరుగుతుందని నదిలోకి వెళ్లవద్దని పౌరులను హెచ్చరించాలి. చుట్టుతా హెచ్చరికలు రాసిన బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేయాలి. ఇవేవీ చేయకుండా నీళ్లు వదిలి జనాన్ని చంపేట్టయితే అక్కడ ఇంజనీర్లెందుకు? నదుల మీద ఆనకట్టలెందుకు? చదువులు పనికి రానివా? లేక చదువుకున్న ఈ ఇంజనీర్లు పనికి రాని పనిచేశారా? సామర్థ్యస్థాయిలో కోత ఎందుకు? 126 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల లార్జీ ప్లాంట్ తన సామర్థ్యస్థాయిని మరీ 36 మెగావాట్లకు ఎందుకు తగ్గించుకోవలసి వచ్చింది? అందువల్ల ఇంత నీటిని విడుదల చేయవలసి వస్తుందని, అది వృథాచేయడమేనని తెలియదా? లేదా అందుకే నీటిని వదిలారా? ఒకవేళ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం తగ్గించుకునేంత ఎక్కువ ప్రవాహం ఉంటే కొన్ని ప్రైవేటు విద్యుత్ పవర్ ప్లాంట్లు తమ సామర్థ్యాన్ని మించి 10 నుంచి 15 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఎందుకు ఉత్పత్తి చేసుకోనిచ్చారు? వారెందుకు జలాలను వాడుకోవాలి? ప్రభుత్వ విద్యుత్కేంద్రం జలాన్ని ఎందుకు వదలాలి. జనాన్ని ఎందుకు చంపాలి? కర్చమ్ వాంగ్టూ విద్యుత్ కేంద్రం 100 మెగావాట్లు, ఎన్జేపీసీ 1500 మెగావాట్లు, అలెయిస్ డుహాంగన్ కేంద్రం 192 మెగావాట్లను మించి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతించారు. కేవలం ప్రభుత్వరంగ లార్జీ డ్యామ్ వద్ద విద్యుత్ కేంద్రానికి మాత్రం 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా భారీ ఎత్తున ఉత్పత్తి 36 మెగావాట్లకు తగ్గించడం జరిగింది. అందువల్లనే భారీ ఎత్తున నీటిని డ్యాం నుంచి నదిలోకి వదలవలసి వచ్చింది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? నదులలో ప్రవాహం విపరీతంగా పెరిగితే, విద్యుచ్ఛక్తి వినియోగం డిమాండ్ లేకపోతే, అన్ని ప్రాజెక్టులూ సమానంగా సామర్థ్యం తగ్గించుకుని ఒక నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి శాస్త్రీయమైన పద్ధతులు అనుసరించడం న్యాయం. కాని దానికి భిన్నంగా జరుగుతోంది. ఇసుక మాఫియా పాత్ర నదులను దోచుకునే ఇసుక మాఫియా కూడా ఈ ప్రమాదం వెనుక ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుకను తవ్వుకుని అమ్ముకునే వారికి అనుకూలంగా ఉండడం కోసం, వారికి అవసరమైన ఇసుక నిల్వలను నదీ పరీవాహక ప్రాంతంలో మేటలు వేసేలా రాత్రి వేళల్లో కాకుండా పగటివేళ నీటిని వదులుతున్నారని, అందువల్ల జలాశయంలో ఇసుక నదిలోకి చేరి కాంట్రాక్లర్లకు ఎక్కువ నిల్వలు దొరుకుతాయని, చీకటి పడకుండానే లారీలలో ఇసుక నింపుకుని ప్రయాణం చేయడానికే ఈ పని చేస్తున్నారని వార్తలొచ్చాయి. నదుల వెంట రోడ్లు అవసరం లేకపోయినా అవి ఏ గ్రామాలనూ కలపకపోయినా మాఫియా లారీలు తిరగడానికే రోడ్డును నిర్మించారనే ఆరోపణలూ ఉన్నాయి. అనుమానాస్పద దర్యాప్తు జూన్ 17 నాటికే ఒక దర్యాప్తు తూతూ మంత్రంగా ముగించి లార్జీ డ్యాం ఇంజనీర్లు ఏ తప్పూ చేయలేదని ఒక నివేదికను విడుదల చేయించుకున్నారు. ఈ తొందరపాటు దర్యాప్తు చర్య మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ దర్యాప్తు నివేదికలో ప్రభుత్వం ఇంజనీర్లకు క్లీన్చిట్ ఇచ్చి కాపాడేందుకు చేసే ప్రయత్నాలను హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం శాంతాకుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇది విషాదం కాదనీ, ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు తీశారని ఆయన ఘాటుగా విమర్శించారు. హెచ్చరికలు చేయకుండా, వేళా పాళా లేకుండా నీటిని విడుదల చేయడం నేరపూరిత నిర్లక్ష్యం కాక మరొకటి అయ్యే అవకాశమే లేదు. కేవలం మౌఖిక ఆదేశాల ద్వారా నీటిని విడుదల చేయించారని తాత్కాలిక నివేదిక వివరిస్తున్నది. ఇది కాకుండా దీని వెనుక మరిన్ని ఘోరాలు ఉన్నాయి. ఈ నివేదికలో ప్రైవేటు పవర్ ప్లాంట్లను ఎక్కువ సామర్థ్యంతో పనిచేయనిచ్చి, కేవలం లార్జీ డ్యాం దగ్గరి విద్యుత్ కేంద్రం సామర్థ్యాన్ని 90 మెగావాట్లు తగ్గించి 26కే పరిమితం చేయడం వెనుక ఏ కుట్రలు ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానం లేదు. దీనికి సమాధానం లభిస్తే ఇంజనీర్లు నిర్లక్ష్య నేరస్తులే కాదు, ఘోరమైన హంతకులనీ తేల్చాల్సి వస్తుంది. అప్పుడు నిర్లక్ష్యం ద్వారా ప్రాణాలు తీసారనే నేరానికి (సెక్షన్ 304ఎ) రెండేళ్ల జైలు శిక్ష వీరికి ఏమాత్రం సరిపోదు. కొందరికి లాభం చేకూర్చడం కోసం ప్రభుత్వానికి నష్టం చేసిన నేరంతో పాటు ఆ అవినీతి ద్వారా 25 మంది ప్రాణాలు తీసిన ఈ హంతకులను ఎంత కఠినంగా శిక్షిస్తారో అందుకు ఏంచేయాలో ప్రభువులు, ప్రతిపక్షం, పత్రికలు జనం నిగ్గదీయాలి. ఒక్కొక్క ప్రాణ హరణానికి కారణాలయిన ఈ జలవిద్యుత్ కేంద్రం ఇంజనీర్లను శిక్షించడమే కాకుండా, ఆ పవర్ ప్లాంట్ కంపెనీ లేదా ప్రభుత్వం అసువులు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ నష్టపరిహారం చెల్లించాలి. ఇసుక మాఫియా పాత్ర రుజువైతే వారికి సహకరించిన గూడుపుఠాణీ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) -
మరో మూడు మృతదేహాలు లభ్యం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం రాత్రి శివప్రకాశ్ వర్మ, గురువారం మధ్యాహ్నం ఆశిష్‌మంథా, అఖిల్‌ల మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మృతదేహాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. శివప్రకాశ్ వర్మది కూకట్పల్లి, ఆశిష్ మంథా సికింద్రాబాద్, అఖిల్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వాసులుగా గుర్తించారు. వీరి మృతదేహాలు శుక్రవారం ఉదయం విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటాయని అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న రవాణామంత్రి మహేందర్‌రెడ్డి, అదనపు డీజీ రాజీవ్ త్రివేదిలు ‘సాక్షి’కి తెలిపారు.