హిమాచల్‌లో గడ్డకట్టిన అవినీతి!
సందర్భం
ప్రొఫెసర్,మాడభూషి శ్రీధర్
బియాస్ ప్రమాద ఘటన నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించాకే నీటిని వదిలారనీ, ఇందులో ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం.
కేదార్‌నాథ్ విషాద ఘటన జరిగిన దాదాపు ఏడాది తరువాత హిమాలయాలలో మళ్లీ మృత్యువు తాండవమాడింది. హైదరాబాద్‌కు చెందిన 24 మంది విద్యార్థులను, ఒక టూర్ ఆపరేటర్‌ను బలి తీసుకుంది. ఇది విధి వైపరీత్యం కాదు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం. నేరస్థాయి దాటిన ఘోర దుర్మార్గం.
హిమాచల్‌ప్రదేశ్ కులు ప్రాంతపు మండీ జిల్లాలో బియాస్ నదిపైన ఆనకట్ట దాని పక్కనే 126 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే లార్జీ జలవిద్యుత్ కేంద్రం ఉంది. భావి ఇంజనీర్లను బలిపెట్టిన వారు ఎవరంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యామ్ ఇంజనీర్లు. జూన్ 8 తెల్లవారుజామున ఒంటిగంట నుంచి సాయంత్రం 7.30 నిమిషాల వరకు మొత్తం 29 సార్లు విడివిడిగా 2,820 క్యూమెక్‌ల నీరును వదిలారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు 1,950 క్యూమెక్‌ల నీటిని వదిలారు. ఆ తరువాత మళ్లీ 7 గంటలకు 450 క్యూమెక్‌ల నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహమే డ్యామ్ నుంచి 15 కిలోమీటర్ల దూరాన్ని శరవేగంగా దాటి దాదాపు పది నిమిషాల్లో తాలోట్ గ్రామాన్ని చేరి 25 మంది ప్రాణం తీసింది. అసలు అంత నీటిని ఆ సమయంలో ఎందుకు వదిలారు? ఎవరు వదిలారు? ఇది కేవలం నిర్లక్ష్యంతో జరిగిన దారుణమా లేక ఇంకేదైనా ప్రమాదకర నేపథ్యం ఉందా? అనేది లోతైన దర్యాప్తు జరిపితే తప్ప తెలియదు. ఒక అంతర్గత దర్యాప్తు జరిపి అన్ని లాంఛనాలు పాటించిన తరువాతనే నీటిని వదిలారనీ, జలవిద్యుత్ విభాగ ఇంజనీర్ల తప్పేమీ లేదంటూ ఒక నివేదికను హడావుడిగా నీటిని విడుదల చేసినట్టే విడుదల చేయడం ఇంకా దారుణం.
జవాబు లేని ప్రశ్నలు
అంత భారీగా నీటిని ఆ సమయంలో ఎందుకు వదలాల్సి వచ్చిందనేది ఆ సందర్భానికి అడగవలసిన ఒక ప్రశ్న. అయితే ఈ ప్రమాదానికి ప్రత్యక్షంగా సంబంధం లేని పరోక్షమైన ప్రశ్నలు మరికొన్ని ఉన్నాయి. నీళ్లు సరిగ్గా ప్రవహించని నదికి దగ్గరగా రోడ్డు ఎందుకు నిర్మించారు? అంతగా రాకపోకలకు ఉపయోగపడని ప్రాంతంలో ఈ రోడ్డు వల్ల ఎవరికి ప్రయోజనం? జలవిద్యుత్ ఉత్పాదనకు నీరు నిలువ చేసుకుంటారు. సాధారణంగా వరదలు ఎక్కువగా వచ్చి జలాశయం నిండిపోయి ఆనకట్ట తెగిపోయే ప్రమాదం ఉందనుకుంటే నీరు వదులుతారు. కాని జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకునేలా కావాలని భారీ ఎత్తున నీటిని వదిలారు. ఇది దారుణమైన నేపథ్యం. ఒకవేళ వదలడం తప్పనిసరి అయితే రాత్రి వేళల్లో మాత్రమే నీరు వదులుతారు. ఎప్పుడు వదిలినా నదివెంట డ్యాం ఇంజనీర్లు, సిబ్బంది తిరుగుతూ నీటిప్రవాహం పెరుగుతుందని నదిలోకి వెళ్లవద్దని పౌరులను హెచ్చరించాలి. చుట్టుతా హెచ్చరికలు రాసిన బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేయాలి. ఇవేవీ చేయకుండా నీళ్లు వదిలి జనాన్ని చంపేట్టయితే అక్కడ ఇంజనీర్లెందుకు? నదుల మీద ఆనకట్టలెందుకు? చదువులు పనికి రానివా? లేక చదువుకున్న ఈ ఇంజనీర్లు పనికి రాని పనిచేశారా?
సామర్థ్యస్థాయిలో కోత ఎందుకు?
126 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగల లార్జీ ప్లాంట్ తన సామర్థ్యస్థాయిని మరీ 36 మెగావాట్లకు ఎందుకు తగ్గించుకోవలసి వచ్చింది? అందువల్ల ఇంత నీటిని విడుదల చేయవలసి వస్తుందని, అది వృథాచేయడమేనని తెలియదా? లేదా అందుకే నీటిని వదిలారా? ఒకవేళ విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం తగ్గించుకునేంత ఎక్కువ ప్రవాహం ఉంటే కొన్ని ప్రైవేటు విద్యుత్ పవర్ ప్లాంట్లు తమ సామర్థ్యాన్ని మించి 10 నుంచి 15 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఎందుకు ఉత్పత్తి చేసుకోనిచ్చారు? వారెందుకు జలాలను వాడుకోవాలి? ప్రభుత్వ విద్యుత్‌కేంద్రం జలాన్ని ఎందుకు వదలాలి. జనాన్ని ఎందుకు చంపాలి? కర్చమ్ వాంగ్టూ విద్యుత్ కేంద్రం 100 మెగావాట్లు, ఎన్‌జేపీసీ 1500 మెగావాట్లు, అలెయిస్ డుహాంగన్ కేంద్రం 192 మెగావాట్లను మించి జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేందుకు అనుమతించారు. కేవలం ప్రభుత్వరంగ లార్జీ డ్యామ్ వద్ద విద్యుత్ కేంద్రానికి మాత్రం 126 మెగావాట్ల సామర్థ్యం ఉన్నా భారీ ఎత్తున ఉత్పత్తి 36 మెగావాట్లకు తగ్గించడం జరిగింది. అందువల్లనే భారీ ఎత్తున నీటిని డ్యాం నుంచి నదిలోకి వదలవలసి వచ్చింది. ఇదంతా ఎవరి ప్రయోజనం కోసం? నదులలో ప్రవాహం విపరీతంగా పెరిగితే, విద్యుచ్ఛక్తి వినియోగం డిమాండ్ లేకపోతే, అన్ని ప్రాజెక్టులూ సమానంగా సామర్థ్యం తగ్గించుకుని ఒక నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి శాస్త్రీయమైన పద్ధతులు అనుసరించడం న్యాయం. కాని దానికి భిన్నంగా జరుగుతోంది.
ఇసుక మాఫియా పాత్ర
నదులను దోచుకునే ఇసుక మాఫియా కూడా ఈ ప్రమాదం వెనుక ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుకను తవ్వుకుని అమ్ముకునే వారికి అనుకూలంగా ఉండడం కోసం, వారికి అవసరమైన ఇసుక నిల్వలను నదీ పరీవాహక ప్రాంతంలో మేటలు వేసేలా రాత్రి వేళల్లో కాకుండా పగటివేళ నీటిని వదులుతున్నారని, అందువల్ల జలాశయంలో ఇసుక నదిలోకి చేరి కాంట్రాక్లర్లకు ఎక్కువ నిల్వలు దొరుకుతాయని, చీకటి పడకుండానే లారీలలో ఇసుక నింపుకుని ప్రయాణం చేయడానికే ఈ పని చేస్తున్నారని వార్తలొచ్చాయి. నదుల వెంట రోడ్లు అవసరం లేకపోయినా అవి ఏ గ్రామాలనూ కలపకపోయినా మాఫియా లారీలు తిరగడానికే రోడ్డును నిర్మించారనే ఆరోపణలూ ఉన్నాయి.
అనుమానాస్పద దర్యాప్తు
జూన్ 17 నాటికే ఒక దర్యాప్తు తూతూ మంత్రంగా ముగించి లార్జీ డ్యాం ఇంజనీర్లు ఏ తప్పూ చేయలేదని ఒక నివేదికను విడుదల చేయించుకున్నారు. ఈ తొందరపాటు దర్యాప్తు చర్య మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ దర్యాప్తు నివేదికలో ప్రభుత్వం ఇంజనీర్లకు క్లీన్‌చిట్ ఇచ్చి కాపాడేందుకు చేసే ప్రయత్నాలను హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం శాంతాకుమార్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇది విషాదం కాదనీ, ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణాలు తీశారని ఆయన ఘాటుగా విమర్శించారు. హెచ్చరికలు చేయకుండా, వేళా పాళా లేకుండా నీటిని విడుదల చేయడం నేరపూరిత నిర్లక్ష్యం కాక మరొకటి అయ్యే అవకాశమే లేదు. కేవలం మౌఖిక ఆదేశాల ద్వారా నీటిని విడుదల చేయించారని తాత్కాలిక నివేదిక వివరిస్తున్నది.
ఇది కాకుండా దీని వెనుక మరిన్ని ఘోరాలు ఉన్నాయి. ఈ నివేదికలో ప్రైవేటు పవర్ ప్లాంట్లను ఎక్కువ సామర్థ్యంతో పనిచేయనిచ్చి, కేవలం లార్జీ డ్యాం దగ్గరి విద్యుత్ కేంద్రం సామర్థ్యాన్ని 90 మెగావాట్లు తగ్గించి 26కే పరిమితం చేయడం వెనుక ఏ కుట్రలు ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానం లేదు. దీనికి సమాధానం లభిస్తే ఇంజనీర్లు నిర్లక్ష్య నేరస్తులే కాదు, ఘోరమైన హంతకులనీ తేల్చాల్సి వస్తుంది. అప్పుడు నిర్లక్ష్యం ద్వారా ప్రాణాలు తీసారనే నేరానికి (సెక్షన్ 304ఎ) రెండేళ్ల జైలు శిక్ష వీరికి ఏమాత్రం సరిపోదు. కొందరికి లాభం చేకూర్చడం కోసం ప్రభుత్వానికి నష్టం చేసిన నేరంతో పాటు ఆ అవినీతి ద్వారా 25 మంది ప్రాణాలు తీసిన ఈ హంతకులను ఎంత కఠినంగా శిక్షిస్తారో అందుకు ఏంచేయాలో ప్రభువులు, ప్రతిపక్షం, పత్రికలు జనం నిగ్గదీయాలి. ఒక్కొక్క ప్రాణ హరణానికి కారణాలయిన ఈ జలవిద్యుత్ కేంద్రం ఇంజనీర్లను శిక్షించడమే కాకుండా, ఆ పవర్ ప్లాంట్ కంపెనీ లేదా ప్రభుత్వం అసువులు కోల్పోయిన వారి కుటుంబాలకు భారీ నష్టపరిహారం చెల్లించాలి. ఇసుక మాఫియా పాత్ర రుజువైతే వారికి సహకరించిన గూడుపుఠాణీ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)