రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించండి
♦ బియాస్ దుర్ఘటనపై తుదితీర్పు వెలువరించిన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు
♦ హిమాచల్ సర్కారు, విద్యుత్‌బోర్డు, వీఎన్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య
♦ ఎనిమిది వారాల్లో పరిహారం మొత్తాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: 2014 జూన్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ బోర్డు, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని, ఈ ఘటనకు వీరేబాధ్యులని ఆ రాష్ట్ర హైకోర్టు తుదితీర్పులో స్పష్టంచేసింది. బాధిత విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ధర్మాసనం ఆదేశించిందన్నారు. 2014 జూన్ 8న లార్జీడ్యామ్ గేట్లను నిర్లక్ష్యంగా తెరవడంతో రాష్ట్రానికి చెందిన 24 మంది వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు గల్లంతయిన విషయం విదితమే.
ఈ సంఘటనకుసంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టులో నమోదైన వ్యాజ్యంపై శనివారం తుదితీర్పు వెలువడింది. గతంలో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం శనివారం 40 పేజీల తుదితీర్పును వెలువరించినట్లు ఈ దుర్ఘటనలో గల్లంతయిన విద్యార్థి శ్రీహర్ష తండ్రి, న్యాయవాది కేఆర్‌కేవీ ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. పరిహారం మొత్తంలో 60 శాతం హిమాచల్ ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు, మరో 30 శాతం వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యం, మిగిలిన 10 శాతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. ఎనిమిది వారాల్లోగా పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని స్పష్టంచేశారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి పరిహారం చెల్లించే నాటికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల మొత్తానికి 7.5 శాతం వడ్డీ జత కలిపి అందజేయాలని ఆదేశించింది.