
మంచి కోర్సులున్నాయ్...రండి!
బీజేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల ప్రచారం
హిమాయత్ నగర్: నారాయణగూడలోని బాబూ జగ్జీవన్ రామ్ (బీజేఆర్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు అక్కడి అధ్యాపకులు ప్రచారబాట పట్టారు. ప్రైవేటుకు దీటుగా సౌకర్యాలు...అందుబాటులో ఉన్నా... విద్యార్థులు ఈ కళాశాల వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఇంటింటా తిరుగుతూ కళాశాల ప్రాముఖ్యం, ఫలితాల సరళి, సౌకర్యాల వంటివివరాలను ప్రజలకు వివరిస్తూ.. విద్యార్థులను ఆకట్టుకునేందుకు అధ్యాపకులు యత్నిస్తున్నారు. గతంలో ఖైరతాబాద్‌లోని చింతలబస్తీ, నాంపల్లిలోని బజార్‌ఘాట్ వద్ద ఈ కళాశాల అద్దె భవనాల్లో నడి చింది. 2015 అక్టోబర్ లో రూ.1.40 కోట్లతో నారాయణగూడ విఠల్‌వాడిలో శాశ్వత భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. కళాశాలలో జిమ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్, లైబ్రరీలో ఈ-కార్నర్ వ్యవస్థ ద్వారా సుమారు 5 లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించే సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యాపకులు... ‘మా కళాశాలలో మీ పిల్లలను చేర్పించండి. అత్యుత్తమ బోధన అందిస్తాం. కార్పొరేట్ విద్యా సంస్థలలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.’ అంటూ ప్రచారం సాగిస్తున్నారు.
అందుబాటులో ఉన్న కోర్సులివే...
బీఏ (హెచ్‌ఈపీ, హెచ్‌పీపీ, మాస్ కమ్యూనికేషన్), బీకాం (ఇంగ్లిష్ మీడియంలో జనరల్, కంప్యూటర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్), బీఎస్సీ (బీజెడ్‌సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎస్‌సీఎస్) కోర్సులను కళాశాల ఆఫర్ చేస్తోంది. మొత్తం 450 సీట్లు ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఆటోమోటివ్ సర్వీసింగ్, బేసిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెబ్ డిజైనింగ్, అకౌంటింగ్ ప్యాకేజ్ (టాలీ), టాక్సేషన్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, బ్యూటీషియన్, గార్డెనర్, డెయిరీ ఫార్మింగ్‌తో పాటు మల్టీమీడియా, ఫొటోషాప్, నెయిల్ ఆర్ట్ పెయింటింగ్, వాటర్ అన లైసిస్ తదితర సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. పోటీ పరీక్షలైన గ్రూప్స్‌కు కోచింగ్ అందిస్తున్నారు.
ప్రత్యేక కోర్సులు
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ‘స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్’ కింద ‘గార్డెనర్, బ్యుటీషియన్, అకౌంట్స్ అండ్ టాలీ, వెబ్ డిజైనింగ్’ లాంటి కోర్సులను నేర్పిస్తున్నాం. వీటిలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ‘ఇంటర్మీడియట్ బోర్డు’ సర్టిఫికెట్లను అందిస్తుంది. - డాక్టర్ కె.పద్మావతి, బీజేఆర్ కళాశాల ప్రిన్సిపల్
పెట్రోల్ తీసిన హోంగార్డుపై చర్యలు
బహదూర్‌పురా: బహదూర్‌పురా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న ఖదీర్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ వాహనంలోనుంచి ఖదీర్ పెట్రోల్ తీసిన వీడియో బయటికి రావడంతో చర్యల్లో భాగంగా అటాచ్ చేశామన్నారు. దీనిపై హోంగార్డు ఖదీర్‌ను వివరణ కోరగా వాహనం నుంచి పెట్రోల్ లీకవడంతో రిపేర్ చేసేందుకు పెట్రోల్‌ను బయటికి తీశానని పేర్కొన్నారు. పెట్రోల్ లీకవుతున్న సమస్యను వీడియో తీస్తున్న వ్యక్తికి చెప్పేందుకు భయపడి ఒక్కసారిగా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లానని పేర్కొన్నారు.