
ఉగ్రవాది భత్కల్‌ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
కోర్టు హాల్ నుంచి పేపర్ విసరడంతో కలకలం..
నాగోలు: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఐఎస్‌ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు మరికొంత మంది నిందితులను కేసు విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య వీరిని కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ సమయంలో భత్కల్ కోర్టు హాల్ కిటికీలోంచి బయటికి తాను రాసిన పేపర్‌ను విసిరాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడే ఉన్న పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ కాగితాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం భత్కల్‌తో పాటు మిగతా నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఎన్‌ఐఏ అధికారులు కావాలనే తనను వేధిస్తున్నారని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టులో భత్కల్ పిటిషన్ వేసినట్లు తెలిసింది. కాగా, పేపర్ విషయంపై ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాము ఎలాంటి పేపర్‌ను స్వాధీనం చేసుకోలేదన్నారు.