సభ వాయిదా వేస్తూ... పారిపోతున్నారు
హైదరాబాద్: రైతు రుణమాఫీని ఒకేదఫాలో మాఫీ చేయాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వంపై పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... అసెంబ్లీలో ఎన్నిరోజులైనా ప్రజాసమస్యలు చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని... కానీ రైతు రుణమాఫీ అంశంపై సభను వాయిదా వేస్తూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు.
ఒకేదఫాలో రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు రాజీలేకుండా పోరాడుతున్నాయని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ఎలాంటి మార్గాన్నైనా అనుసరిస్తామన్నారు. అవసరమైతే రైతు రుణమాఫీ అంశంపై కేసీఆర్ సర్కార్పై అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందో తమ పార్టీ ఎమ్మెల్యేలు యోచిస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు.