'వెంకయ్య మాటలు శ్రీరంగనీతులు కాకూడదు'
హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పార్టీ ఫిరాయింపులపై చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శనివారం హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీరంగనీతులు కాకూడదన్నారు.
ఫిరాయింపులు అనైతికమని చెప్పిన వెంకయ్యనాయుడు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వెంటనే సమీక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలోని మార్పులు తీసుకువచ్చేందుకు పార్లమెంట్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని ఆయన గుర్తు చేశారు. తక్షణమే ఫిరాయింపు చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్..డి పార్టీ మారినా ఇప్పటికి ఆయన సభ్యత్వం కొనసాగుతోందన్నారు. ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని ప్రభుత్వానికి భూమన సూచించారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించాలని గతంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించిన సంగతి ఈ సందర్భంగా భూమన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం పాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి ఎన్ చినరాజప్ప వ్యవహార శైలిపై భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన హోంగార్డుకు ఎక్కువ కానిస్టేబుల్కు తక్కువ అని ఎద్దేవా చేశారు. హోంమంత్రి పదవిని దిగజార్చారంటూ చంద్రబాబుపై భూమన నిప్పులు చెరిగారు. ఉభయ గోదావరి జిల్లాల్లో యుద్ధ వాతావరణం నెలకొందని అన్నారు.
కాగా ఒక పార్టీపై గెలిచి మరో పార్టీ మారేవారు...పార్టీ మారిన రోజే వారిపై అనర్హత వేటు పడేలా చట్టం ఉండాలని వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.