బైక్ లాంగ్వేజ్
రోడ్డుమీద వెళ్తుంటే... ఎదురుగా ఉన్న బైక్ వెనకాల కొటేషన్ కంట్లో పడగానే... అయితే నవ్వు... లేదంటే ఆలోచన. కొటేషన్ కాస్త తేడాగా కనిపిస్తే... ఆ బైక్‌పై కుర్రాడిని కాస్త కోపంగా చూడ్డం... వీడు.. వీడి పైత్యం అన్నట్టు. నిజమే...‘ఇట్స్ మై డాడ్ రోడ్’ అనే కొటేషన్ చూస్తే ఎవరికైనా కోపం రాకుండా ఉంటుందా! ‘మామ్ టోల్డ్ టు డ్రైవ్ స్లో. బట్ మై గర్ల్‌ఫ్రెండ్ ఆస్క్ టు డ్రైవ్ ఫాస్ట్!’ ఇలా రాసుకున్న కుర్రాడ్ని చూసి అయ్యోపాపం పిల్లాడికి ఎంత కష్టం వచ్చిందన్నట్టు పెడతాం మొహం. ‘ఇఫ్ యు ఫాలో మి ఇట్స్ హెవెన్. ఇఫ్ యు ఓవర్‌టేక్ మి దెన్ ఇట్స్ హెల్’... చదవగానే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. అంటే వీడి వెనకాలే తోకలా వెళ్లాలన్నమాట. ఏ... అతన్ని దాటి ముందుకెళితే నరకానికెళ్లిపోతామా..! కచ్చితంగా అతని వెనకున్నవారు కాస్త స్పీడుపెంచి వాడ్ని అద్దంలో నుంచి కొద్దిగా వెటకారంగా చూస్తూ ఓవర్‌టేక్ చేస్తారు. ఇంతకీ.. ఏమిటీ కొటేషన్లు, ఎందుకీ కవిత్వాలు అంటే... కుర్రకారు తమ కలాన్ని ఝులిపించడానికి బైక్‌లను వేదికలుగా మలుచుకునే పనిలో పడ్డారు. దాంతో రోడ్లపై కళ్లకు కమ్మని కవిత్వాలు, కవ్వించే కొత్త వాక్యాలు కనిపిస్తున్నాయి.
మామ్ గిఫ్ట్...
బైక్ నంబర్ ప్లేట్ కింద కనిపించే వాటిల్లో అధిక కొటేషన్లు... మామ్ గిఫ్ట్ లేదంటే డాడ్ గిఫ్ట్. ఇంకా అంటే ‘ఐ లవ్ ఇండియా’. కుర్రాళ్లు కొత్త ట్రెండ్‌లకు వెల్‌కమ్ చెబుతూ... కొటేషన్లు రాసుకుని స్టిక్కర్ షాపుల వుుందు క్యూ కడుతున్నారు.
‘ముఖ్యంగా కాలేజీ అబ్బాయిలు... బైక్ కొటేషన్లపై ఎక్కవ ఆసక్తి చూపిస్తున్నారు. కొందరయితే నెలకోసారి కొటేషన్లను మార్చేస్తున్నారు. అదేంటంటే...ఫ్రెండ్‌కి నచ్చలేదు, గర్ల్‌ఫ్రెండ్‌కి నచ్చలేదు అంటున్నారు. కొందరు ప్రత్యేకంగా దేశభక్తికి సంబంధించిన కొటేషన్లు, దైవభక్తికి సంబంధించిన కొటేషన్లు తీసుకొస్తారు’ అంటూ తన షాపు దగ్గరకొచ్చే అబ్బాయిల విషయాలు చెప్పారు బాలనగర్‌లోని న్యూస్టయిల్ స్టిక్కర్ షాపు యజమాని అఖిల్.
అదో... సరదా
మంచి వాక్యాలయితే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. కొంచెం ఇబ్బందికరంగా ఉండే కొటేషన్ల గురించి అబ్బాయిలను అడిగితే... అలాంటివి చదివి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటారు. ‘హెల్ ఈజ్ ఫుల్... సో ఐయామ్ బ్యాక్’ ఎంత స్పెషల్‌గా ఉందండీ అంటాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే రాహుల్. అదేం బాగుందిరా... నేను చెబుతాను విను... ‘యువర్ విలేజ్ కాల్డ్, దేర్ ఇడియట్ ఈజ్ మిస్సింగ్’ అంటాడు కార్తిక్. ఇలా కుర్రాళ్ల కవిత్వంపై ఇంటర్నెట్ ప్రభావం కూడా బాగానే ఉంటోంది. ‘బంపర్ స్టిక్కర్స్’ అనే సైట్‌లో బైక్‌లపై ఎలాంటి స్లోగన్స్ రాసుకోవాలో, కార్లపై ఎలాంటివి అతికించుకోవాలో వివరంగా ఉంటుంది.
సిటీ ప్లస్ ఫొటోలు: జి.రాజేష్