
వద్దన్నా అంటగట్టారు.. ఆగం చేశారు
టీడీపీతో పొత్తే గుదిబండగా మారిందంటున్న బీజేపీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలి తాలు బీజేపీని షాక్‌కు గురిచేశాయి. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉందని, పొత్తు వల్ల పరస్పర లాభం ఉంటుందని చేసిన వాదనలన్నీ గాలి మాటలేనని తేలిపోవడంతో ఆ పార్టీ పునరాలోచనలో పడింది. టీడీపీతో పొత్తువల్ల నష్టమే ఉంటుందని వాదించిన నేతల అభిప్రాయాలకు ఈ ఎన్నికలతో బలం చేకూరింది. టీడీపీతో పొత్తు వద్దన్నా కొందరు ‘పెద్ద’ నేతల ఒత్తిడితో భరించాల్సి వచ్చిందని, ఇప్పుడు ఆగమైపోతున్నామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. పొత్తు లేకుంటే కనీసం కార్యకర్తలకు టికెట్లు ఇవ్వడం ద్వారా చాలా డివి జన్లలో పార్టీ పునాదులైనా మిగిలేవంటున్నారు.
ఇటు పొత్తు పెట్టుకుని పార్టీని లేకుండా చేసుకుని, అటు పొత్తున్నా ఓడిపోయి... ఎటూకాని పరిస్థితి వచ్చిందంటున్నారు. పొత్తుల వల్ల పోటీ చేసే సీట్లపై స్పష్టత లేకపోవడం, ఆఖరు నిమిషం వరకు టికెట్ల కేటాయింపులు చేయకపోవడం, రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లోపం వంటివాటితో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ చావుదెబ్బ తినాల్సి వచ్చిందని నేతలు చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉన్నా గ్రేటర్ హైదరాబాద్‌లో ముఖం చూపించుకోలేని విధంగా నాలుగు సీట్లకే పరిమితం కావడం సిగ్గుపడాల్సిన విషయమని ఆ పార్టీనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటిదాకా టీడీపీతో పొత్తుకోసం జిల్లాల్లో పార్టీని బలిపెట్టారని.. ఇప్పటికైనా టీడీపీతో పొత్తును వదులుకోవాల్సిందేని జిల్లాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలంగా ఉందని, నాయకత్వ పదవులు కూడా హైదరాబాద్ నేతకే కట్టబెడుతూ వచ్చారని అంటున్నారు. బీజేపీకి జిల్లాల్లోనే భవిష్యత్తు ఉందని, ఆ దిశగా ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలుండీ...
హైదరాబాద్‌లో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ.. బీజేపీ కేవలం నాలుగు డివిజన్లలోనే విజయం సాధించడంపై పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలంటే కేంద్ర నిధులు తప్పనిసరని... టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపిస్తే ఆ కల నెరవేరుతుందని చేసిన ప్రచారం ఏ మాత్రం ఫలించలేదంటున్నారు. నిజానికి గత గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన బీజేపీ... కాచిగూడ, మెహిదీపట్నం, గౌలిపురా, కుర్మగూడ, గుడిమల్కాపూర్ డివిజన్లలో విజయం సాధించింది. కానీ ఇప్పుడు ఆ స్థానాలు కూడా గ ల్లంతవడం బీజేపీ నేతలను కలవరపెడుతోంది. పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి సతీమణి బి.పద్మ పోటీచేసిన బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో కూడా విజయం సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి గ్రేటర్‌లో బీజేపీకి స్పష్టమైన ఓటు బ్యాంకు ఉన్నా... టీడీపీతో పొత్తు కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే కనీసం రెండంకెల సంఖ్యలోనైనా విజయం సాధించేవారంటున్నారు. అమీర్‌పేట, జూబ్లీహిల్స్ వంటి చోట్ల మిత్రపక్షాల అభ్యర్థులే ఒకరిపై ఒకరు పోటీ పడటంతో ఓట్లు చీలి టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు అవకాశం కల్పించిందని చెబుతున్నారు.