హైదరాబాద్: హైకోర్టు విభజన వెంటనే చేయాలంటూ ఇందిరా పార్కు వద్ద బీజేపీ లీగల్ సెల్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంఎల్‌సీ రాంచందర్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులే బంగారు తెలంగాణ నిర్మాణంలో అగ్రభాగాన ఉండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యమంతో సంబంధంలేని వాళ్లు సీఎం కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్నారంటే ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొండితనం, ఆదరబాధర నిర్ణయాల వల్లే ఈ కష్టాలన్నారు. తెలంగాణా రాకూడదన్న వ్యక్తులు సీఎం పంచన చేరి న్యాయవాదులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీధుల్లో ఉద్యమాలు చేయడమంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంత బాధ్యతా రహితంగా ఉందో అర్ధమవుతోందన్నారు. న్యాయవాదుల డిమాండ్స్‌కు తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. జేఏసీ కోరుతున్న 7 డిమాండ్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయో సీఎం చెప్పాలని ప్రశ్నించారు.