బండెనక బండి కట్టి... | bonalu festivals | Sakshi
Sakshi News home page

బండెనక బండి కట్టి...

Published Mon, Jul 14 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

బండెనక బండి కట్టి...

బండెనక బండి కట్టి...

- కోలాహలంగా ఫలహార బండ్ల ఊరేగింపు
- భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
- వీఐపీలకే ప్రాధాన్యం
- సామాన్య భక్తులకు అవస్థలు

రాంగోపాల్‌పేట్:  లష్కర్ బోనాలకు మరింత సందడిని తెచ్చే ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆదివారం తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు కోలాహలం కనిపించింది. టకారాబస్తీ నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఓల్డ్‌బోయిగూడ నుంచి మాజీ కార్పొరేటర్ అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్, పాన్‌బజార్ నుంచి శీలం ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాసీగూడ, కుమ్మరిగూడ, శివాజీనగర్, నాలాబజార్, బండిమెట్, రెజిమెంటల్ బజార్, బన్సీలాల్‌పేట్ తదితర ప్రాంతాల భక్తులు పోటీలు పడి ఫలహార బండ్ల ఊరేగింపు నిర్వహించారు.
 
నాయకుల రాకతో భక్తులకు అసౌకర్యం
ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో ఎప్పటిలాగే రాజకీయ నాయకుల అత్యుత్సాహం భక్తులకు ఇబ్బందులు కలిగించింది. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. వీరి వెంట యాభై నుంచి వంద మంది వరకు చోటా మోటా నాయకులు ఆలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇబ్బందులు తలెత్తాయి. వారిని నిలువరించేందుకు పోలీసులు తంటాలు పడ్డారు. వలంటీర్లు, కొందరు నేతలు, పోలీసు అధికారులు తమ బంధుగణాన్ని, తెలిసిన వారిని నేరుగా అమ్మవారి దర్శనానికి తీసుకుని వెళ్లడం క్యూలైన్లలో ఉన్న వారి సహనానికి పరీక్ష పెట్టింది. బోనాలతో వచ్చే వారికి 20 నిమిషాల్లో దర్శనం చేయిస్తామని అధికారులు చెప్పినా.. దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పట్టింది. కొంతమంది రాజకీయ నాయకులు వచ్చిన సమయంలో భక్తులు ఆగ్రహంతో వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
పాడిపంటలతో సుఖ శాంతులతో ఉండాలని
దేశవ్యాప్తంగా వర్షాలు లేక రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిపించి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ పాడిపంటలతో సుఖశాంతులతో ఉం డాలని అమ్మవారికి పూజలు చేశా.     -  మంత్రి ఈటెల
 
వర్షాలు కురవాలని బోనం
గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అమ్మవారిని మొక్కుకున్నా. ఇప్పుడు రాష్ట్రంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు మా నాన్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నా.         
     - కవిత,నిజామాబాద్ ఎంపీ
 
దేశంలోనే ప్రత్యేకత
తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకునే బోనాల జాతర, బతుకమ్మ ఉత్సవాలు దేశంలోనే ప్రత్యేకత సంతరించుకున్నాయి. వర్షాలు కురిసి, గ్రామాలు సస్యశ్యామలం కావాలని మొక్కుకున్నా.                       
        - కిషన్‌రెడ్డి
 
టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి గీతా రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్యలు మాట్లాడుతూ వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మొక్కకున్నట్లు చెప్పారు. అమ్మవారి జాతరలో పాల్గొనే భక్తుల కోసం గత 25 రోజుల నుంచి కష్టపడి అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
 
సైడ్‌లైట్స్
 * వీఐపీల కోసం కేటాయించిన క్యూలైన్లలో అధిక   సంఖ్యలో సాధారణ భక్తులు కనిపించారు.  
* పోలీసులే మీడియాకు పాసులు జారీ చేసినప్పటికీ.. కొన్ని చోట్ల అవి పనిచేయలేదు. కొందరు ఆలయ సిబ్బంది వాటిని చూపినా లోనికి అనుమతించలేదు. తమకు తెలిసిన వారినిమాత్రం ఎలాంటి పాసులు లేకున్నా లోనికి పంపించారు.
* భక్తులు పోటెత్తడంతో గుడి లోపల, క్యూలైన్లలో పలువురు స్పృహ తప్పి పడిపోయారు. వీరిని వలంటీర్లు వైద్య శిబిరానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు.
* పోలీసులు డీజేలను అధికారికంగా అనుమతించకపోయినా అనధికారికంగా ఫలహార బండ్లకు వీటిని వినియోగించారు. డీజేల హోరు..యువత కేరింతలు, డ్యాన్సులు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
* వేకువజామున 3.40 ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, కుమారుడు పురువారెడ్డితో కలిసి రాగా, మరో పది నిమిషాలకు ప్రస్తుత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా వచ్చారు. మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకోవడాన్ని భక్తులు ఆసక్తిగా గమనించారు.

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నాయిని


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement