చౌటుప్పల్/పెద్దఅంబర్‌పేట:బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్తున్న ముగ్గురు అన్నదమ్ములను రోడ్డు ప్రమాదం బలిగొంది. స్కూటర్‌పై వెళ్తున్న వారిని మృత్యుశకటంలా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన 65వ నంబర్ జాతీయ రహదారిపై నల్లగొండజిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని దండుమైలారం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు...రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన పిట్టల మథార్-పెంటమ్మ దంపతులకు దశరథ(50), యాదగిరి(46), చంద్రయ్య(43), సహదేవ్, రవి కుమారులు.
మథార్ అన్న చిత్తారికి సంతానం కలగకపోవడంతో, యాదగిరిని చిన్నప్పటి నుంచే పెంచుకుంటున్నాడు.దశరథ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా..., యాదగిరి స్వగ్రామంలోనే గ్రామసేవకుడిగా, చంద్రయ్య స్థానికంగా ఉన్న టీఎన్‌ఆర్ రెడీమిక్స్ ప్లాంటులో పనిచేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామంలో పాలివారి పెళ్లితో పాటు, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో సహదేవ్ భార్య బంధువుల పెళ్లి ఉంది. పాలివారి పెళ్లికి వీరి భార్యలు, బంధువుల పెళ్లికి భర్తలు వెళ్లాలనుకున్నారు.
దశరథ, యాదగిరి, చంద్రయ్య కలిసి స్కూటర్‌పై ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట శివారులోని దండుమైలారం క్రాస్‌రోడ్డు వద్ద, హైవేను దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు వీరి స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ గాల్లోకి లేచి, 120 అడుగుల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలకు పోలీ సులు చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయించి సాయంత్రం బంధువులకు అప్పగించారు.
బాటసింగారంలో తీవ్రవిషాదం...
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ప్రమాదంలో మృతి చెందడం తో బాటసింగారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పది నిమిషాల ముందు ఇంటి నుంచి వెళ్లిన దశరథ, యాదగిరి, చంద్రయ్య మృత్యువాతపడ్డారని తెలిసి వారి భార్యలు గుండెలు బాదుకుంటూ రోదించారు. ఘటనా స్థలానికి వచ్చి చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలపై పడి వారు రోదించడం చూసి బంధువులు, స్థానికులు కంటనీరు పెట్టారు. మృతదేహాలను చూసేందుకు గ్రామస్తులతో పాటు పక్కగ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కాగా, మృతుడు దశరథకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె, యాదయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, చంద్రయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ హాజరై మృతులకు నివాళులర్పించారు.
అతివేగంతోనే ప్రమాదం...
జాతీయ రహదారిని నాలుగులేన్లుగా విస్తరించాక కార్ల వేగానికి అడ్డు లేకుండా పోయింది. గంటకు 150 కి.మీ.లకు మించి వేగంతో కార్లు పరుగులు పెడుతున్నాయి. దశరథ, యాదగిరి, చంద్రయ్యలను బలిగొన్న ప్రమాదానికి కూడా అతివేగమే కారణం. స్కోడా కారు 150కి మించిన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో, స్కూటర్‌తో పాటు, దానిపై ఉన్న ముగ్గురూ గాల్లోకి లేసి, 120 అడుగుల దూరంలో పడటంతో మృతి చెందారు. స్కూటర్ కూడా నుజ్జునుజ్జై ఏ భాగానికి ఆ భాగం విడిపోయాయి.
కారు ఢీకొని అన్నదమ్ముల మృతి
Published Mon, Apr 27 2015 1:33 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement