నిందితుడిని చూపిస్తున్న పోలీసులు
నాగోలు: బీటెక్ పూర్తి చేసిన యువకుడు జాబ్ అన్వేషణలో కన్సల్టెన్సీకి డబ్బు చెల్లించలేక అక్రమ మార్గాన్ని ఎంచుకొని కటకటాల పాలయ్యాడు. సోమవారం ఎల్బీనగర్ ఠాణాలో ఎడీసీపీ తఫ్సీర్ ఇగ్బాల్ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన మిర్యాల రవికుమార్ అలియాస్ రవి(22) నల్లగొండలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నంపై నగరానికి వచ్చి నాగోల్‌లోని సాయినగర్‌లో అద్దెకుంటున్నాడు. పలు ప్రాంతాల్లో ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. దీంతో జాబ్ కన్సల్టెన్సీల్లో సంప్రదించగా డబ్బు ఇస్తే జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా వారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఎలాగైన డబ్బు సంపాదించాలని అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈనెల 16న రాత్రి 8 గంటలకు రాక్‌టౌన కాలనీ ప్రధాన రహదారిపై మన్సూరాబాద్ సాయిసప్తగిరి కాలనీకి చెందిన కె.సుజాత తన స్కూటీపై స్నేహితురాలి కోసం వేచి ఉండగా... వెనుక నుంచి వచ్చిన రవి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు తెంచుకొని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల18న రాత్రి చాణక్యపురి కాలనీలో ఇదే తరహా స్నాచింగ్ చేసేందుకు రవి తిరుగుతుండగా... పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అతని దగ్గర ఇంతకు మునుపు చేసిన స్నాచింగ్ గొలుసు దొరికింది. దీంతో అదుపులోకి తీసుకుని అతని నుంచి రెండు తులాల గొలుసును రికవరీ చేశారు. రవి గతంలో చైతన్యపురి పరిధిలోని అల్కాపురి దగ్గర ఓ మహిళ మెడలో గొలుసు స్నాచింగ్ చేయగా అది రోల్డ్ గోల్డ్ అవటంతో బాధితురాలు ఫిర్యాదు చేయలేదని సమాచారం. సమావేశంలో ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, సీఐ కాశిరెడ్డి, డీఐ బి.విఠల్‌రెడ్డి, ఎస్‌ఐ కాశీవిశ్వనాథ్, డీఎస్‌ఐ రవీందర్, వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.