
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: బూర నర్సయ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. సీల్డు కవర్లతో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. తమ ఎంపీలకు పార్లమెంటులో మంచి గుర్తింపు ఉందని, చవకబారు రాజకీయాలు చేయరని చెప్పారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, గవర్నర్ కూడా తమ పాలనకు కితాబిస్తున్నారని చెప్పారు.
అవినీతి–కాంగ్రెస్ అవిభక్త కవలలని.. తమ ఆవేదనను ప్రజల ఆవేదనగా కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజల భిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారు కానీ సోనియా భిక్షతో కాదన్నారు. కేసీఆర్ ది రావుల పాలన అనడం సరికాదని, ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపినపుడు రావు పదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కులం పేరిట విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఏ దళిత ,బీసీ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులను ఆ వర్గాల కోసం చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనని, 2019లో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.