ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. యూటీఎఫ్, ఎస్‌టీయూ ఉపాధ్యాయ సంఘాలు మినహా మిగతా సంఘాలన్నీ జోనల్ వ్యవస్థ రద్దుకే మొగ్గు చూపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు.
కేడర్ పోస్టులు కొనసాగించాలి
అసమానతలకు గురి చేస్తున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలి. కొత్త నియామకాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులే ఉంచాలి. జిల్లా స్థాయి పోస్టులను ఆయా విభాగాలతో సంప్రదించి నిర్ణయించాలి. కొత్త జిల్లాల నేపథ్యంలో ప్రస్తుత జోనల్ స్థాయి అధికారుల సీనియారిటీ దెబ్బ తినకుండా చూడాలని కోరాం. ప్రస్తుత కేడర్ పోస్టులను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశాం.
కొత్త జిల్లాల నేపథ్యంలో పోస్టులు కుదించొద్దని స్పష్టం చేశాం. ఉద్యోగుల పంపకాలు, సమస్యల పరిష్కారానికి కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలను కొద్దిగా మార్చి రాష్ట్రంలోనూ ఒక ఐఏఎస్ నేతృత్వంలో కమిటీ వేయాలని, సీనియారిటీ, మల్టీ జోనల్ సమస్యలను పరిష్కరించాలని సూచించాం. జోనల్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారకుండా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలన్నాం. స్థానికత కోసం ఏపీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించాలన్నారు. కొత్త జిల్లాలొస్తున్నందున హెచ్‌ఆర్‌ఏ అందరికీ సమానంగా ఇవ్వాలని కోరాం.
- దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, మమత (టీఎన్‌జీవో)
సమానావకాశాలు
కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులకు రక్షణ కల్పించాలని కోరాం. ఎవరూ ఆందోళన చెందే పని లేకుండా ఉద్యోగుల సర్వీస్ రూల్స్ అలాగే కొనసాగుతాయి.
- పాతూరి సుధాకర్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ
రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లు
పాలన ఇబ్బందులు రాకుండా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచాలన్నాం. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, గ్రేడ్-2 ఎంఈవో, డైట్ సీనియర్ లెక్చరర్లు, బీఎడ్, డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ పోస్టులను రాష్ట్ర కేడర్‌లో ఉంచాలి. డీఈవోలను అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించాలి.
- పూల రవీందర్, పి.సరోత్తమ్‌రెడ్డి, నరహరి లకా్ష్మరెడ్డి (పీఆర్టీయూ-టీఎస్)
పాలకుల సౌలభ్యం కోసమే
కొత్త జిల్లాల ఏర్పాటు కేవలం పాలకుల సౌలభ్యానికే చేస్తున్నట్టుగా ఉంది. ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేస్తే పాలనసౌలభ్యమెలా అవుతుంది? జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలి. లేదంటే వెనకబడిన జిల్లాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా డీఈవో, ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలి.
- భుజంగరావు, సదానందగౌడ్ (ఎస్టీయూ)
ఆరు జోన్లుండాలి
సామాజికంగా, ఆర్థికంగా ఒకే స్థాయిలో ఉన్న ప్రాంతాలతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. జోనల్ వ్యవస్థను కొనసాగించి వాటి సంఖ్యను ఆరుకు పెంచాలి.
- నర్సిరెడ్డి, చావ రవి (టీఎస్-యూటీఎఫ్)
జోనల్ వ్యవస్థను రద్దు చేయండి
Published Fri, Aug 19 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
Advertisement
Advertisement