సాక్షి, హైదరాబాద్: ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణ కమిటీల్లో ప్రజా ప్రతినిధుల స్థానాన్ని తొలగించి ఆ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేలా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఆసుపత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణ మార్గదర్శకాలను మారుస్తూ ప్రభుత్వం గతేడాదిజారీ చేసిన జీవో నెం.48ని సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం గురువారం తుది తీర్పునిచ్చింది. వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉండటంతో కమిటీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని, ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను మార్చామన్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. రాజకీయ కారణాలతోనే అభివృద్ధి కమిటీల నుంచి ఎమ్మెల్యేలను ప్రభుత్వం తొలగించిందన్న పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది.