మోసం చేసిన ఫ్యాకల్టీలపై కేసులు!
400 మందిపై చర్యలకు సిద్ధమైన జేఎన్‌టీయూ
సాక్షి, హైదరాబాద్: జవ హర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొందరు అధ్యాపకులు ఒకే కళాశాలలో కాకుండా వేర్వేరు కాలేజీల్లో పని చేస్తున్నట్లు చూపించి మోసం చేయడంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు యూనివర్సిటీ సిద్ధమైంది. నిబంధనల ప్రకారం ఒక అధ్యాపకుడు ఒకే కాలేజీలో పని చేయాల్సి ఉండగా.. నాలుగైదు కాలేజీల్లో పని చేస్తున్నట్లు చూపించారు.
జేఎన్‌టీయూ చేపట్టిన తనిఖీల్లో వీరంతా దొరికిపోయారు. దీంతో ఆ బోధన సిబ్బందిని అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ప్రస్తుతం బ్లాక్ లిస్టులో పెట్టిన 903 మందిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సంఖ్య 903 ఉండదని, ఒక్కొక్కరు రెండు మూడు చోట్ల ఉన్నారు కాబట్టి మొత్తంగా 400 మంది వరకు ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. వారి జాబితాను పోలీసులకు జేఎన్‌టీయూ అధికారులు అందజేయనున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారిపై చర్యలు ప్రారంభం కానున్నాయి.