డబ్బు తీసుకుని.. దాడి చేశారు!
నాంపల్లి : ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన వివాదాలతో కోన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన కుటుంబంపై దాడి చేయడమే కాక, చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితుడు రాజిరెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
రాజిరెడ్డి, ప్రవీణ్‌కుమార్ స్నేహితులు. రాజిరెడ్డి మూసాపేటలో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ప్రవీణ్.. రాజిరెడ్డికి కోన శ్రీనివాసరావు అనే వ్యక్తిని పరిచయం చేశాడు. అతడికి ఢిల్లీ, ముంబైల్లో పెద్ద కంపెనీలు ఉన్నాయని రాజిరెడ్డిని ప్రవీణ్ నమ్మించాడు. శ్రీనివాసరావు కంపెనీల్లో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే రూ.2 కోట్లు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో రాజిరెడ్డి శ్రీనివాసరావుకు రూ.39 లక్షలు ఇచ్చాడు.
డబ్బు తీసుకుని 8 నెలలైనా వారినుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని రాజిరెడ్డి కోరాడు. దీంతో శ్రీనివాసరావు తన అనుచరులతో దాడి చేశాడని, తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని రాజిరెడ్డి చెబుతున్నాడు. దాడిలో రాజిరెడ్డి దంపతులు గాయపడ్డారు. కోన శ్రీనివాసరావు, అతడి అనుచరుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని రాజిరెడ్డి దంపతులు నగర పోలీసు కమిషనర్‌తో పాటు, హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.