ఉనికి బయట పడనీయరు!
కరుడుగట్టిన ఉగ్రవాదుల నైజమిది
‘ప్రాణాల పైకి’ వచ్చినా పారిపోవడమే
హత్యాయత్నం చేసినా ప్రతీకారం ఉండదు
తాజా ఉదాహరణలుగా ‘సిమి’, అఫ్రిదిలు
కరుడుగట్టిన ఛాందసవాదం.. అర్థంపర్ధం లేని ప్రతీకారేచ్ఛతో అజ్ఞాత జీవితం గడిపే గజ ఉగ్రవాదులు ఏ దశలోనూ తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చివరకు ప్రాణాలపైకి వస్తే... పారిపోవడం లేదా సాధారణ వ్యక్తుల్లా సహాయం అర్థించడానికి ప్రాధాన్యమిస్తారు. తాము చిక్కితే తమ ‘లక్ష్యం’ దెబ్బతింటుందన్న వారి భావనే దీనికి కారణమని నిఘా వర్గాలంటున్నాయి. అయితే పట్టుబడే పరిస్థితులు వస్తే మాత్రం ఆ ఉగ్రవాదుల్లో అంతర్గతంగా ఉన్న మానవమృగాలు జూలు విదులుస్తాయని, అలాంటి పరిస్థితుల్లో పోలీసుల్ని చంపడానికీ వెనుకాడరని వివరిస్తున్నారు. గత నెలలో ఒడిశాలోని రూర్కెలాలో దొరికిన ‘సిమి’ ఉగ్రవాదులు, జనవరిలో బెంగళూరులో పట్టుబడిన ‘ఐఎం’ ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిది వ్యవహారాలే తాజా ఉదాహరణలుగా చెప్తున్నారు.
- సాక్షి, సిటీబ్యూరో
ఐదుగురిదీ ‘ఘన’ చరిత్రే...
నిషిద్ధ సిమికి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు 2013 అక్టోబర్ 25న మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. ఇద్దరు అదే ఏడాది పట్టుబడగా... ఎజాజుద్దీన్, అస్లం, అంజద్, మహబూబ్, జకీర్ మాత్రం అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అప్పటికే వీరిపై దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలు సంబంధించిన కేసులున్నాయి. 2014 ఫిబ్రవరి 1న కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్‌బీఐ నుంచి రూ.46 లక్షలు దొచుకుపోయారు. అదే ఏడాది మేలో ఈ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌కు చేరుకుంది.
40 శాతం కాలినా ఎస్కేప్...
అక్కడి జతాన్ ప్రాంతంలో ఉన్న లీలోదేవీ అనే మహిళ ఇంట్లో ఈ ‘ఉగ్ర’ ముఠా అద్దెకు దిగింది. తాము మొరాదాబాద్‌కు చెందిన వారమని, బిజ్నూర్‌లోని పేపర్ మిల్లులో పని చేస్తున్నామని ఇంటి యజమానులకు చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్రపన్నిన ఈ మాడ్యుల్ ఆ ఇంట్లోనే స్థానికంగా లభించే పదార్థాలను వినియోగించి బాంబులు తయారీ చేపట్టింది. 2014 సెప్టెంబర్ 12 ఉదయం 10.45 గంటలకు మహబూబ్ చేతిలో ఓ బాంబు పేలిపోయింది. దీంతో అతడి శరీరంపై 40 శాతానికి పైగా గాయాలయ్యాయి. అయినప్పటికీ తమ ఉనికి బయటపడకూడదని తక్షణం ఆ ఇల్లు వదిలి ఐదుగురూ బయటకు వచ్చేశారు. మహబూబ్‌కు దుప్పటి కప్పి, స్థానికంగా ఉన్న వైద్యుడి వద్ద చికిత్స చేయించి... అతడితో పరారయ్యారు.
చిక్కుతామనుకుంటే చంపేందుకూ...
ఈ ముఠా ఖాండ్వా జైలుకు వెళ్లడానికి ముందు, జైలు నుంచి తప్పించుకునే క్రమంలోనూ పోలీసుల్ని చంపింది. గతేడాది ఏప్రిల్‌లో ఎజాజుద్దీన్, అస్లం విజయవాడకు వెళ్లే ప్రయత్నాల్లో హైదరాబాద్‌లో బస్సు ఎక్కారు. సూర్యాపేటలో బస్సును తనిఖీ చేసిన పోలీసులు వీరిని అనుమానించి కిందికి దింపడంతో ఓ హోంగార్డు, కానిస్టేబుల్‌ను కాల్చి చంపడంతో పాటు ఇన్‌స్పెక్టర్‌పై హత్యాయత్నం చేశారు. జానకీపురంలోనూ తమను పట్టుకోవడానికి యత్నించిన ఎస్సైను పొట్టనపెట్టుకున్నారు. అదే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరిద్దరూ హతమయ్యారు. ఆపై ఈ ముఠాలోకి సాలఖ్ వచ్చి చేరాడు. రూర్కెలాలోనూ వీరి ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు సాలఖ్ తన తుపాకీతో పోలీసులపై హత్యాయత్నం చేశాడు.
‘భత్కల్’ బ్రదర్స్‌కు సన్నిహితుడు...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న జోహాపురాకు చెందిన ఆలమ్ జెబ్ అఫ్రిది ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ద్వారా ఉగ్రవాదబాటపట్టాడు. హలోల్‌లో జరిగిన ఉగ్రవాద శిక్షణకు హాజరుకావడంతో పాటు మరికొందరినీ ఉగ్రబాట పట్టించాడు. 2008లో జరిగిన అహ్మదాబాద్, సూరత్, జైపూర్ పేలుళ్లలో కీలకపాత్ర పోషించిన ఇతడికి ఐఎం మాస్టర్‌మైండ్స్ రియాజ్, ఇక్బాల్ భత్కల్స్‌లో సన్నిహిత సంబంధాలున్నాయి. నాటి పేలుళ్లలో బాంబులు పెట్టడానికి వినియోగించిన సైకిళ్లను ఆలమే సమకూర్చాడు. దర్యాప్తు సంస్థలు 2009లో ఐఎం మాడ్యుల్‌ను గుర్తించి వరుస అరెస్టులు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆలమ్ అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నాడు.
‘వాంటెడ్’పై హత్యాయత్నం...
అఫ్రిది దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూర్ రోడ్‌లో తలదాచుకుంటున్నాడు. అక్కడి దొడ్డనాగమంగళం ప్రాంతంలో నివసిస్తూ ఏసీ మెకానిక్‌గా రఫీఖ్ అహ్మద్ పేరుతో చెలామణి అవుతున్నాడు. ఇతడిపై ఏడాది క్రితం ‘హత్యాయత్నం’ జరిగింది. ఇది చేయించింది రఫీఖ్ మాజీ యజమాని. తన దగ్గర పని చేసి మానేసిన అఫ్రిది తనకు సంబంధించి రెగ్యులర్ కస్టమర్స్‌ను వేరే ఏసీ మెకానిక్స్ వద్దకు పంపుతున్నాడని కొందరు మునుషుల్ని పెట్టించి మరీ అఫ్రిదిపై దాడి చేయించాడు. చావుదెబ్బలు తిన్నా సరే అఫ్రిది మాత్రం వారిపై తిరగబడలేదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదు. వీటిలో ఏది చేసినా తన ఉనికి బయటపడుతుందనే... అమాయకుడిగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తనపై హత్యాయత్నం చేశారని కేసు నమోదు చేయించాడు.
‘తనదాకా’ వస్తే బరితెగింపే...
పోలీసు, నిఘా వర్గాలకు మోస్ట్ వాంటెడ్‌గా మారిన తర్వాతా అఫ్రిది తన ‘పంథా’ కొనసాగించాడు. ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పని చేశాడు. చెన్నై రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు, బెంగళూరు చర్చ్ స్ట్రీట్ బ్లాస్ట్‌లతో పాటు ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయానికి నిప్పు పెట్టడం, బెదిరింపు లేఖలు పంపడం తదితర చర్యలకూ ఉపక్రమించాడు. జనవరిలో బెంగళూరులోని పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న దొడ్డనాగమంగళం వద్ద తనను పట్టుకోవడానికి ప్రయత్నించి పోలీసు అధికారిపై మాత్రం హత్యాయత్నం చేసి చిక్కాడు. హైదరాబాద్‌లో చిక్కిన ‘జునూద్’ మాడ్యుల్‌తోనూ ఇతడికి సంబంధాలున్నాయి.