దత్తాత్రేయను తొలగించడంపై బీసీ సంక్షేమ సంఘం మండిపాటు
సాక్షి, హైదరాబాద్: బీసీ సామాజిక వర్గానికి చెందిన దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించడంపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు బీసీ మంత్రి తొలగింపుతో పాటు రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.
కేంద్రం బీసీలకు వ్యతిరేకిగా మారుతోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించడం, కొత్త మంత్రివర్గంలో రాష్ట్రానికి అవకాశం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 7న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు పాల్గొనాలని, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలన్నారు. సమావేశంలో బీసీ సంఘం ప్రతినిధులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.