రాచకొండకు రాచఠీవి | centre agrees to develop rachakonda | Sakshi
Sakshi News home page

రాచకొండకు రాచఠీవి

Published Wed, Dec 3 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

రాచకొండకు రాచఠీవి

రాచకొండకు రాచఠీవి

 పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి కేంద్రం సంసిద్ధత
 రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు పంపిన తెలంగాణ ప్రభుత్వం
 పానుగల్ ఆలయాలు, ఉదయసముద్రంతో కలిపి టూరిజం సర్క్యూట్
 మరుగున పడిన రాచకొండ కోటకు కొత్త వెలుగు

 
 సాక్షి, హైదరాబాద్: అద్భుతమైన కోట.. ఇరవై అడుగుల ఎత్తున్న ప్రాకారాలు.. అంతెత్తున అలరారే దర్వాజాలు.. కాకతీయ శిల్పకళాచాతుర్యం ఉట్టిపడే దేవాలయాలు.. గుట్టల సమూహంలో ప్రకృతి సోయగం.. కనుచూపుమేరలో పరచుకున్న పచ్చదనం.. ఇదంతా రాచకొండ గుట్టల వైభవం. అందమైన గుట్టలు.. వాటిపై గొప్పగా రూపుదిద్దుకున్న కోట.. అసలు ఈ పేరుతో ఓ చారిత్రక అద్భుతం ఉందనే విషయం కూడా చాలామందికి తెలియదు. రాష్ర్ట రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం త్వరలో పర్యాటక శోభ సంతరించుకోబోతోంది. హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సుందర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలో కొత్తగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్‌లో భాగంగా దీనిపై కేంద్ర సర్కారు దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ర్ట ప్రభుత్వం మూడు రోజుల క్రితమే కేంద్రానికి పంపింది. రాచకొండ పరిసరాలను ఫిల్మ్‌సిటీగా అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడటంతో ఆ ప్రాంతానికి మహర్దశ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
 
  టూరిజం సర్క్యూట్‌తో కొత్త వెలుగులు
 
 తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం 8 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రూ. 45 కోట్లతో వరంగల్-కరీంనగర్ మెగా సర్క్యూట్‌తో పాటు నల్గొండ జిల్లాలోని మూడు ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్‌గా ఎంపిక చేశారు. కాకతీయుల కాలంలో పానుగల్‌లో నిర్మితమైన ఛాయ సోమేశ్వర దేవాలయం, పచ్చల సోమేశ్వర దేవాలయాలతోపాటు అక్కడికి చేరువలోని ఉదయసముద్రం రిజర్వాయర్‌లను కలిపి రాచకొండ కోటను ఓ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ. 8 కోట్లు కేటాయించాలని తాజాగా కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లో అధికారులు సూచించారు. కనీసం రూ. 5 కోట్లు మంజూరవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధులతో ఉదయసముద్రం రిజర్వాయర్‌లో బోట్లు ప్రవేశపెట్టాలని, పానుగల్ దేవాలయ సమూహం వద్ద పర్యాటకులకు వసతులు కల్పించాలని యోచిస్తోంది. ఇక ఇప్పటివరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని రాచకొండపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. అక్కడికి పర్యాటకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రోడ్లు వేయడంతో పాటు బస్సులను ఏర్పాటుచేయనున్నారు. పర్యాటకుల బస కోసం భవనాలు, రెస్టారెంట్లు నిర్మించనున్నారు. రక్షిత మంచినీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించనున్నారు. ఖాళీ ప్రాంతాల్లో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతారు. చిన్నపిల్లలను ఆకట్టుకునేలా ఆటవిడుపు కేంద్రాలను కూడా నిర్మిస్తారు. కేంద్ర నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించనుంది. తొలిదశలో ఈ పనులు పూర్తి చేసిన తర్వాత గోల్కొండ తరహాలో సౌండ్ అండ్ లైట్ షోతో పాటు రాచకొండ కోట చరిత్రను తెలిపే విజువల్ ఎఫెక్ట్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు ఇక్కడ ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సాహసాలను ఇష్టపడే వారికి అలాంటి మరిన్ని ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం నుంచి ఆమోదం రాగానే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement