
దాడి...దోపిడీ
చైన్‌స్నాచర్ల చేతిలో గాయపడుతున్న మహిళలు
{పాణాల మీదకు తెస్తున్న వైనం వరుస చోరీలతో జనం బెంబేలు
సిటీబ్యూరో: జూలై 17... బర్కత్‌పుర వాసి సుమిత్ర కుమారుడు సంజయ్‌తో కలసి ద్విచక్ర వాహనంపై ఉస్మానియా యూనివర్సిటీ రోడ్డు మీదుగా వెళుతున్నారు. టూ వీలర్‌పై వచ్చిన దొంగ ఆమె మెడలోని బంగారు గొలుసు లాగడమే కాదు. ఏకంగా నెట్టేయడంతో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
జూలై 29... హైదరగూడకు చెందిన సుభాషిణి భర్తతో కలిసి అబిడ్స్‌లో సినిమా చూసి అర్ధరాత్రి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును తెంచడమే కాకుండా నెట్టేశారు. కింద పడడంతో ఆమె గాయాలపాలైంది. ప్రస్తుతం ప్రాణాపాయం లేకున్నా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
గురువారం... కుంట్లూరులోని అట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న హయత్‌నగర్ డివిజన్ ప్రగతి నగర్‌కు చెందిన వెంకటలక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా... ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. ఎవరూ లేని ప్రాంతం చూసి ఆమె స్కూటీకి అడ్డంగా బైక్ పెట్టారు. ఆమె వాహనం నిలిపే లోపే మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు.
...ఇటీవల కాలంలో చైన్‌స్నాచింగ్ సంఘటనల తీరు ఆందోళన కలిగిస్తోంది. ద్విచక్ర వాహనాలపై వెళుతున్న మహిళలనే టార్గెట్‌గా చేసుకుని దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఒక ఘటనలో ఏకంగా మహిళ ప్రాణాలే పోయాయి. దొంగ ఇప్పటివరకు దొరకలేదు. రెండో ఘటనలోనూ దొంగ పోలీసులకు చిక్కలేదు. మూడో ఘటనలో ఏకంగా బాధితురాలిని వెంబడించి మరీ దోపిడీకి పాల్పడడం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నెలలో బంగారు ఆభరణాల దొంగతనాలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని విభాగాల అధికారులు చైన్‌స్నాచర్ల కోసం వేట సాగిస్తున్నారు. వారు సీసీలకు చిక్కిన దృశ్యాలను కూడా మీడియాకు విడుదల చేశారు. అయినా నిందితులు చిక్కకపోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. నేరచరిత్ర లేని వ్యక్తులుఇవి చేస్తుండటంతో పట్టుకోవడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.
రోడ్డెక్కాలంటే భయం..
మహిళలు రోడ్డెక్కాలంటే ఒకటికినాలుగు... కాదు కాదు వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కనీసం వంట సామానుల కోసం వీధిలోకి రావాలన్నా భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెలలో పదుల సంఖ్యలో జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటనలు మహిళలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల కాలంలో దోపిడీకి పాల్పడుతున్న అగంతకులు ఆభరణాలు దోచుకునే క్రమంలో దాడికి దిగుతున్నారు. దీంతో మహిళలు గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు మీదకు వస్తోంది.
సంఖ్య తగ్గినా...
పోలీసు రికార్డుల ప్రకారం గతంతో పోల్చితే ఈ ఏడాది చైన్‌స్నాచింగ్ ఘటనలు తగ్గినట్లు తెలుస్తోంది. 2014 జనవరి నుంచి జూలై వరకు 582 కేసులు నమోదవగా... ఈ ఏడాది కేవలం 152 మాత్రమే చోటు చేసుకున్నాయి. నగలు లాక్కెళ్లేటప్పుడు ప్రతిఘటిస్తే ఏకంగా ప్రాణం తీస్తామని నిందితులు పరోక్షంగా భయపెడుతున్నారు. దొంగతనాలకు పాల్పడే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తున్న పోలీసులు.. చైన్‌స్నాచర్లకు ఇది వర్తింపజేయడం లేదు. స్నాచర్లపై మామూలు కేసులు పెట్టడంతో చాలా సులభంగా బెయిల్‌పై విడుదలై... మళ్లీ ఆగడాలకు పాల్పడుతున్నారు. వీరిపై పోలీసుల దృష్టి కూడా అంతంతమాత్రంగా ఉంటోంది. ఏదో కేసులో పట్టుబడితేనే వారి వివరాలు తెలుస్తున్నాయి. ఇటీవల పోలీసులు పట్టుకున్న ఘరానా గొలుసు దొంగ లాంబ... నాలుగు వందలకు పైగా నేరాలకు పాల్పడ్డాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో దొంగ అరవై చోరీలు పూర్తి చేస్తే కానీ పోలీసులు గుర్తు పట్టలేకపోయారు.
భయంతోనేనా?
బంగారం బరువు ఎక్కువ ఉండే గొలుసులనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. తక్కువ రిస్కుతో ఎక్కువ మొత్తం సంపాదించే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ఎక్కడ ప్రతిఘటిస్తారోనన్న భయంతో దాడికి దిగుతున్నారు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తోటి వారు ప్రాధాన్యమిస్తుండటంతో దొంగలు పారిపోవడం మరింత సులువవుతోంది.
విలాసాల కోసం...
వారాంతాల్లో ప్రధాన రహదారుల్లో అర్ధరాత్రి, తెల్లవారుజామున బైక్ రేసింగ్‌లలో పాల్గొనే కుర్రాళ్లు జల్సాల కోసం చోరీల బాట పట్టినట్టు తెలుస్తోంది. విలాసాల కోసం వీళ్లు అప్పుడప్పుడు ఈ పని చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తవారు కావడంతో వీరిని పట్టుకునేందుకు పోలీసులు తంటాలు పడుతున్నారు. రెప్ప పాటులో మహిళల వద్దకు చేరుకోవడం, గొలుసులు లాగేసుకోవడం, నెట్టేయడం చకచకా చేసేసి కనిపించకుండాపోతున్నారు. చిలకలగూడ, మారేడ్‌పల్లి. బేగంపేట, నారాయణగూడ, చిక్కడపల్లి, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, పంజగుట్ట, ఎస్సార్‌నగర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నల్లకుంట ప్రాంతాలు...శివారు ప్రాంతాలు ఎల్బీనగర్, చైతన్యపురి, కర్మన్‌ఘాట్, అల్వాల్, ఏఎస్ రావు నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెయిన్ స్నాచర్లు రెచ్చిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి.
కఠినంగా శిక్షించాలి
చైన్‌స్నాచర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరినీ వదలడం లేదు. గత ఏడాది ఫ్రెండ్స్‌తో కలిసి యూసుఫ్‌గూడలో నడిచి వెళుతుండగా పది తులాల బంగారు గొలుసులను దొంగలు లాక్కెళ్లారు. మెడ మీద చిన్న గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశా. ఇప్పటి వరకు నాలుగు తులాలు తిరిగి అప్పగించారు. ఇంకా ఆరు తులాల గొలుసు దొరకలేదు. చైన్‌స్నాచర్లను కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలి. -శ్రీలక్షి్ష్మ, సినీ నటి