ఛనాఖా-కొరటపై ఒప్పందానికి సిద్ధం
సంతకాలు చేసేందుకు మహారాష్ట్ర అంగీకారం
నేడు హెలికాప్టర్‌లో మేడిగడ్డ ప్రాంతం సందర్శనకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది పెన్‌గంగపై రాష్ట్రం నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీపై అంతర్‌రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు మహారాష్ట్ర సమ్మతించింది. వచ్చే నెల 15 తర్వాత జరిగే సమావేశంలో బ్యారేజీ నిర్మాణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా ఒప్పందంపై వారం రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామంది. మంగళవారం ప్రాణహిత-చేవెళ్ల అంతర్‌రాష్ట్ర సమన్వయ కమిటీ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయింది.
రాష్ట్రం తరఫున నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, వెంకటేశ్వర్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే... మహారాష్ట్ర తరఫున చీఫ్ ఇంజనీర్లు ఆర్‌ఎం చౌహాన్, హెచ్‌ఏ దంగారే, ఎస్‌ఈలు కట్‌పిల్ వార్, టీఎం షేక్, కుల్దీప్ హాజరయ్యారు. అంతర్‌రాష్ట్ర బోర్డు కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీఈ హరిరామ్‌లు మేడిగడ్డవద్ద 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.
103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మేడిగడ్డ బ్యారేజీకి, తుమ్మిడిహెట్టి వద్ద తక్కువ ముంపు ఉండేలా బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని కోరారు. వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలను చర్చించి స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం పంపాలని జోషి విజ్ఞప్తి చేశారు. దీనిపై మహారాష్ట్ర సీఈ చౌహాన్ స్పందిస్తూ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సాంకేతిక వివరాలు, ముంపును అధ్యయనం చేయాల్సుందన్నారు. ఆ తర్వాతే అభిప్రాయాన్ని చెబుతామన్నారు.
నేడు పరిశీలన...
మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదించిన ప్రాం తాన్ని తాము పరిశీలిస్తామని మహా రాష్ట్ర అధికారులు కోరారు. సమ్మతించిన తెలంగాణ అధికారులు బుధవారం వారికి ఆ ప్రాంతాన్ని చూపా లని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన 10 మంది అధికారులు రెండు హెలికాప్టర్లలో మేడిగడ్డకు వెళ్లి ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా జనవరి ఒకటిలోగా మేడిగడ్డకు సంబంధించిన సాంకేతిక, ముంపు వివరాలను మహా రాష్ట్రకు సమర్పించాలని ఎస్‌కే జోషి వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. జనవరి 15 తర్వాత స్టాం డింగ్ కమిటీలో వీటిపై చర్చించి ఒక అంగీకారానికి రావాలని భావిస్తున్నారు. అనంతరం మంత్రి మహారాష్ట్ర ప్రతినిధులను హరీశ్‌రావు కలసి... మహారాష్ట్ర అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఘర్షణ వైఖరి విడనాడి పరస్పరం సహకరించుకుంటే ఇరు రాష్ట్రాలకు ప్రయోజన కరమన్నారు.