Interstate Agreement
-
ఏపీ–తెలంగాణ బస్సు రూట్లు ఖరారు
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిప్పనుంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 534 బస్సులు నడపనుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్లో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో 264 బస్సుల్ని నడపగా.. ఇప్పుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,49,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలోమీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. కాగా, ఖరారైన బస్సు రూట్లను టీఎస్ఆర్టీసీకి ఏపీఎస్ఆర్టీసీ పంపించింది. టీఎస్ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఏపీఎస్ ఆర్టీసీ 452 బస్సులు తెలంగాణకు నడుపుతుండగా.. ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 హైదరాబాద్‌కు, 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నారు. వీటి ద్వారా ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకు రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్ రూట్ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం వస్తోంది. -
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఇరు రాష్ట్రాల అధికారులు సంతకాలు చేశారు. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కి.మీ మేర బస్సు సర్వీసులను నడపనుంది. తెలంగాణలో ఏపీఎస్ఆర్టీసీ 1,60,999 కి.మీ నడపనుంది. కాగా.. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ బస్సులను తిప్పనుంది. ఇక ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణకు 638 బస్సులు నడపనుంది. విజయవాడ రూట్లో 273 తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కర్నూలు- హైదరాబాద్ రూట్లలో 213 బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. తక్షణమే ఈ ఒప్పందం అమలులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడవనున్నాయి. ఎంవోయూలోని ముఖ్యాంశాలు ♦మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్లు అవగాహన ఒప్పందంపై సంతకం. ♦అవగాహన ఒప్పందం ప్రకారం, టీఎస్ఆర్టీసీ 826 బస్సులతో ఏపీలో 1,61,258 కిలోమీటర్లు, ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణలో 638 బస్సులతో 1,60,999 కిమీ దూరం బస్సులు నడవనున్నాయి. ♦విజయవాడ మార్గంలో, టీఎస్ఆర్టీసీ 273 బస్సులతో 52,944 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 192 బస్సులతో 52,524 కిలోమీటర్లు నడుస్తాయి. ♦కర్నూలు- హైదరాబాద్ మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఎపిలో 213 బస్సులతో 43,456 కిలోమీటర్లు నడుస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 146 బస్సులతో 43,202 కిలోమీటర్లు నడుస్తుంది. ♦వడపల్లి మీదుగా పిడుగురాల్ల/ గుంటూరు మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 57 బస్సులతో 19,044 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 88 బస్సులతో 20,238 కిలోమీటర్లు నడుస్తుంది. ♦మాచర్ల మార్గంలో, టీఎస్ఆర్టీసీ ఏపీలో 66 బస్సులతో 14, 158 కిలోమీటర్లు నడపనున్నది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 61 బస్సులతో 16,060 కిలోమీటర్లు నడపనున్నది. ♦నూజివీడు తిరువూర్, భద్రాచలం- విజయవాడ మార్గంలో టీఎస్ ఆర్టీసీ అదే కిలోమీటర్లు నడిపేందుకు సిద్ధం. అంటే తెలంగాణ, ఏపీలో 48 బస్సులతో 12,453, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 65 బస్సులతో 14,026 కిలోమీటర్లు నడుస్తాయి. ♦ఖమ్మం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం మార్గంలో తెలంగాణ.. ఏపీలో 35 బస్సులతో 9, 140 కిలోమీటర్లు, ఏపీ తెలంగాణలో 58 బస్సులతో 11,541 కిలోమీటర్లు తిప్పనున్నారు. ♦హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 19,004 కిలోమీటర్ల కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ నుంచి ఈ మార్గంలో బస్సులు నడపదు. ♦సత్తుపల్లి- ఏలూరు (2 మార్గాలు), భద్రాచలం మరియు మిగిలిన మార్గాల్లో కల్లూగుడెం, సత్తుపల్లి, విజయవాడ మార్గం మరియు ఇతర మార్గాల ద్వారా టీఎస్ ఆర్టీసీ ఏపీలో 62 బస్సులతో 8,159 కిలోమీటర్లు, ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో 28 బస్సులతో 3,408 కిలోమీటర్లు బస్సులు నడపనున్నాయి. -
ఏపీ నుంచి తెలంగాణకు 322 ఆర్టీసీ బస్సుల తగ్గింపు!
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ డిమాండ్ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను తగ్గించనుంది. లాక్డౌన్ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు రోజుకు 1,009 బస్సుల్ని ఏపీఎస్ఆర్టీసీ నడిపింది. ఇకపై 687 బస్సులను మాత్రమే తిప్పనుంది. తెలంగాణ భూభాగంలో ఇంతకుముందు వరకు 2.65 లక్షల కి.మీ.లలో బస్సులను తిప్పగా ఇక నుంచి 1.61 లక్షల కి.మీ.కే పరిమితం కానుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు త్వరలో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. తెలంగాణ ఏడాది కాలానికి ఒప్పందం కుదుర్చుకుందామని ప్రతిపాదించగా ఏపీ మాత్రం వచ్చే ఏడాది మార్చి వరకే సిద్ధమంది. ఒప్పందంపై చర్చలకు ఈ దఫా టీఎస్ఆర్టీసీ అధికారుల్ని విజయవాడకు రావాల్సిందిగా ఏపీఎస్ఆర్టీసీ ఆహ్వానించింది. ఈ అంశంపై సోమ లేదా మంగళవారాల్లో స్పష్టత రానుంది. తెలంగాణ డిమాండ్ మేరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని, కి.మీ.లను తగ్గించి ప్రతిపాదనలు రూపొందించింది. కృష్ణా జిల్లా నుంచి అధికంగా బస్సుల తగ్గింపు టీఎస్ఆర్టీసీ అధికారులు మొదట్నుంచీ హైదరాబాద్–విజయవాడ రూట్లోనే బస్సులు పెంచుకుంటామని చెబుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీని తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచే 85 బస్సుల్ని తగ్గించింది. విజయవాడ రూట్లోనే టీఎస్ఆర్టీసీ సర్వీసులు పెంచుకోనుంది. టీఎస్ఆర్టీసీకి హైదరాబాద్–బెంగళూరు లాభదాయకమైన రూట్. రోజూ 70 సర్వీసుల వరకు బెంగళూరుకు తిప్పుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి బస్సుల్ని తిప్పడం లేదు. ఎందుకంటే బెంగళూరుకు వెళ్లాలంటే ఏపీ నుంచే వెళ్లాలి. దీంతో ఇప్పుడు బస్టాండ్లలోకి రాకుండా బెంగళూరుకు బస్సుల్ని తిప్పుకుంటామని టీఎస్ఆర్టీసీ కోరుతోంది. దీనిపై ఏపీఎస్ఆర్టీసీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. -
ఛనాఖా-కొరటపై ఒప్పందానికి సిద్ధం
సంతకాలు చేసేందుకు మహారాష్ట్ర అంగీకారం నేడు హెలికాప్టర్లో మేడిగడ్డ ప్రాంతం సందర్శనకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది పెన్‌గంగపై రాష్ట్రం నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీపై అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు మహారాష్ట్ర సమ్మతించింది. వచ్చే నెల 15 తర్వాత జరిగే సమావేశంలో బ్యారేజీ నిర్మాణ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా ఒప్పందంపై వారం రోజుల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామంది. మంగళవారం ప్రాణహిత-చేవెళ్ల అంతర్రాష్ట్ర సమన్వయ కమిటీ హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయింది. రాష్ట్రం తరఫున నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, వెంకటేశ్వర్రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే... మహారాష్ట్ర తరఫున చీఫ్ ఇంజనీర్లు ఆర్ఎం చౌహాన్, హెచ్ఏ దంగారే, ఎస్ఈలు కట్పిల్ వార్, టీఎం షేక్, కుల్దీప్ హాజరయ్యారు. అంతర్రాష్ట్ర బోర్డు కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీఈ హరిరామ్‌లు మేడిగడ్డవద్ద 103 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అభ్యంతరాలు, కేంద్ర జల సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకుని.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. 103 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మేడిగడ్డ బ్యారేజీకి, తుమ్మిడిహెట్టి వద్ద తక్కువ ముంపు ఉండేలా బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని కోరారు. వీటికి సంబంధించిన సాంకేతిక అంశాలను చర్చించి స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసం పంపాలని జోషి విజ్ఞప్తి చేశారు. దీనిపై మహారాష్ట్ర సీఈ చౌహాన్ స్పందిస్తూ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సాంకేతిక వివరాలు, ముంపును అధ్యయనం చేయాల్సుందన్నారు. ఆ తర్వాతే అభిప్రాయాన్ని చెబుతామన్నారు. నేడు పరిశీలన... మేడిగడ్డ వద్ద బ్యారేజీ ప్రతిపాదించిన ప్రాం తాన్ని తాము పరిశీలిస్తామని మహా రాష్ట్ర అధికారులు కోరారు. సమ్మతించిన తెలంగాణ అధికారులు బుధవారం వారికి ఆ ప్రాంతాన్ని చూపా లని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ఇరు రాష్ట్రాలకు చెందిన 10 మంది అధికారులు రెండు హెలికాప్టర్లలో మేడిగడ్డకు వెళ్లి ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా జనవరి ఒకటిలోగా మేడిగడ్డకు సంబంధించిన సాంకేతిక, ముంపు వివరాలను మహా రాష్ట్రకు సమర్పించాలని ఎస్కే జోషి వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. జనవరి 15 తర్వాత స్టాం డింగ్ కమిటీలో వీటిపై చర్చించి ఒక అంగీకారానికి రావాలని భావిస్తున్నారు. అనంతరం మంత్రి మహారాష్ట్ర ప్రతినిధులను హరీశ్‌రావు కలసి... మహారాష్ట్ర అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఘర్షణ వైఖరి విడనాడి పరస్పరం సహకరించుకుంటే ఇరు రాష్ట్రాలకు ప్రయోజన కరమన్నారు.