వాణిజ్య కనెక్షన్లపైజలఖడ్గం
- జలమండలి చార్జీల కొరడా
- 25 వేల కనెక్షన్లపై భారం
- నెలకు రూ.20 కోట్లు.. ఏడాదికి రూ.240 కోట్ల మేర బాదుడు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలి మళ్లీ వాణిజ్య, పారిశ్రామిక వర్గాలపై నీటిచార్జీల భారం మోపింది. వంద శాతం మేర పెంపుతో హడలెత్తిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 8 లక్షల నల్లా కనెక్షన్లుండగా 25 వేల కుళాయి కనెక్షన్లపై తాజాగా భారం పడనుంది. మొత్తంగా నీటి ఛార్జీల పెంపుతో జలమండలి నెలకు రూ.20 కోట్లు, ఏడాదికి రూ.240 కోట్ల మేర వినియోగదారుల జేబుకు చిల్లు పెట్టనుంది. మార్చి 1 నుంచి తాజా చార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన చార్జీల్లో 35 శాతం మురుగు శిస్తు కలిపే ఉంటుంది. కాగా, 2011లో నీటిచార్జీలు పెంచిన జలమండలి తాజాగా మరోసారి జలఖడ్గం ఝళిపించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గృహవినియోగ కనెక్షన్లను పెంపు నుంచి మినహాయించడం గుడ్డిలో మెల్ల. రూ.29 కోట్ల నెలవారీ లోటు పూడ్చుకునేందుకు చార్జీల పెంపు అనివార్యమైందని జలమండలి వర్గాలు తెలిపాయి.
కుళాయి కనెక్షన్ ఇక సులభం
గృహవినియోగ నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి జలమండలి ఊరటనిచ్చింది. సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టిషన్ డీడ్, సెటిల్‌మెంట్ డీడ్, సైట్ పట్టా లేని వినియోగదారులు కూడా సులభంగా కుళాయికి దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. సంబంధిత పత్రాలు లేని వారు ఇకపై దరఖాస్తుతోపాటు రూ.100 నాన్‌జ్యుడిషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ , విద్యుత్ బిల్లు జతచేస్తే సరిపోతుంది.
అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ గడువు మార్చి 31
గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు ఉన్న అక్రమ కుళాయిలను క్రమబద్దీకరించుకునేందుకు జలమండలి మార్చి 31 వరకు గడువునిచ్చింది. గడువులోగా రూ.300 సర్వీసు చార్జి, రూ.200 కనెక్షన్ చార్జి, 3 నెలల సాధారణ బిల్లు చెల్లించి వినియోగదారులు వీటిని క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. 20 ఎంఎం ఆపై పరిమాణం కుళాయి గల వారు వీటితో పాటు ఏడాది సాధారణ నీటిబిల్లు చెల్లించాలి.