నీటి పిడుగు
- నీటి చార్జీల పెంపు
- ఆదివారం నుంచే అమల్లోకి
- త్వరలో పెంచనున్న పారిశుద్ధ్య సేవల చార్జి
సాక్షి,బెంగళూరు : నగరవాసులపై నీటి పిడుగు పడింది. గృహ, గృహేతర అన్న తేడా లేకుండా అన్ని రంగాలకు సంబంధించి నీటి చార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నీటి ధరలు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నాయి. నీటి వినియోగ చార్జీలే కాకుండా కనిష్ట నీటివాడకం చార్జీతో పాటు పారిశుద్ధ్య సేవలను చార్జిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నీటి వాడకానికి సంబంధించి కనిష్ట చార్జీని రూ.48 నుంచి రూ.57లకు పెంచింది. అదేవిధంగా పారిశుద్ధ్య సేవల చార్జిని కూడా రూ.83 నుంచి రూ.100లకు పెంచుతూ జలమండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనుంది.
గృహ అవసరాల కోసం...
మొదటి స్లాబ్‌లో ప్రతి వెయ్యి లీటర్ల నీటి వినియోగానికి ఇకపై రూ.7 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ధర లీటరుకు రూ.6.
రెండవ స్లాబ్‌లో 8 వేల లీటర్ల నుంచి 25 వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల ఇక పై రూ.9 బదులు రూ.11 చెల్లించాల్సి ఉంటుంది.
మూడవ స్లాబ్‌లో 25వేల లీటర్ల నుంచి 50 వేల లీటర్ల నీటిని వాడకంపై ప్రతి వెయ్యి లీటర్ల ధర రూ.15 నుంచి రూ.26కు పెరిగింది.
నాల్గవ స్లాబ్‌కు సంబంధించి 50 వేల లీటర్ల నీటి నుంచి అటు పై నీటి వాడకానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు ఇక పై రూ.45 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటి వరకూ 50 వేల నుంచి 75 వేల లీటర్ల నీటి వినియోగం స్లాబుకు సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు రూ.30, అదేవిధంగా 75వేల లీటర్ల నుంచి అటు పై వినియోగించుకునే ప్రతి వెయ్యి లీటర్లకు రూ.36లు చెల్లించాల్సి ఉండేది. అయితే ఈ ఇకపై ఈ విభజన ఉండదు.
గృహేతర అవసరాల కోసం...
మొదటిస్లాబ్‌లో పదివేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్లకు ఇక పై రూ.36 బదులు రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది.
రెండవస్లాబ్‌లో పదివేల లీటర్ల నుంచి ఇరవై వేల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటరుకు రూ.57 చెల్లించాలి. ఇప్పటి వరకూ ఈ చార్జి రూ.39
మూడవస్లాబ్‌లో 20 వేల నుంచి 40వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల రూ.44 బదులు రూ.65 చెల్లించాలి.
నాల్గవస్లాబ్‌లో 40వేల నుంచి 60వేల లీటర్ల నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల నీటికి రూ.76 చెల్లించాలి. ప్రస్తుతం ఇది రూ.51గా ఉంది.
ఐదవస్లాబ్‌లో 60 వేల నుంచి ఆ పై నీటి వినియోగానికి సంబంధించి ప్రతి వెయ్యి లీటర్ల నీటికి రూ. 57 బదులు రూ.87 చెల్లించాలి.
అదేవిధంగా పరిశ్రమలు తదితర సంస్థల నీటి కనిష్ట వినియోగ చార్జిని కూడా రూ.60 నుంచి రూ.90లకు పెంచింది. పెంచిన నీటివినియోగ చార్జీలు, సేవలశుల్కం తదితరాల వల్ల జలమండలి ఆదాయం నెలకు రూ.50.23 కోట్ల నుంచి రూ.73.73 కోట్లకు పెరగబోతోందని అధికారుల అంచన. జలమండలి చివరిగా 2005లో నీటి వినియోగ చార్జీలను సవరిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.