♦ రూ. 3 కోట్లతో ఉడాయించిన హెచ్‌ఏఎల్ కార్మికుడు
♦ కోర్టును ఆశ్రయించిన బాధితులు
బాలానగర్ : చిట్టీల పేరుతో హెచ్‌ఏఎల్ కార్మికుడు కుచ్చుటోపీ పెట్టాడు. బాధితులు తెలిపిన వివరాలు.. బాలానగర్‌లోని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో బహదూర్ డిపార్టుమెంట్‌లో పనిచేసే పద్మనాభయ్య 2008 నుంచి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. సుమారు 70 మంది హెచ్‌ఏఎల్ కార్మికులు అతడి వద్ద చిట్టీలు వేస్తున్నారు. మూడు కోట్ల రూపాయల చిట్టీల నిర్వాహణ జరుగుతుంది. 2014 వరకు చిట్టీలు సక్రమంగా నిర్వహించిన పద్మనాభయ్య అనంతరం సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు.
వడ్డీతో చెల్లిస్తానని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన బాధితులు కంపెనీలో ఉన్న యూనియన్‌కు ఫిర్యాదు చేశాడు.
యూనియన్ పద్మనాభయ్య, కార్మికులతో మాట్లాడించి ఆరు నెలల్లో మొత్తం డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆరు నెలలు గడిచినప్పటికీ పద్మనాభయ్య బాధితులకు డబ్బులు ఇవ్వలేదు. వారు పద్మనాభయ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గత నెల 11వ తేదీన కుటుంబ సభ్యులతో వెళ్లిపోయాడు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించగా ఇది సివిల్‌కు సంబంధించిందని పోలీసులు చెప్పడంతో బాధితుల్లో ఒకరైన జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. అయితే అతడు ఎక్కడున్నది తెలియ రాలేదు.
ఆలస్యంగా వెలుగులోకి మరో ఘటన..
ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హెచ్‌ఏఎల్‌లో పనిచేసే బాలచందర్ అనే వ్యక్తి కూడా చిట్టీల పేరుతో సుమారు 20 కోట్లతో ఉడాయించి వెళ్లిపోయాడు. చిట్టీలతో పాటు ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల నుంచి కోట్లాది రూపాయలను వడ్డీకి తీసుకొని జమచేశాడు. గత సంవత్సరం నుంచి అడిగిన వారికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. కార్మికుల ఒత్తిడి తట్టుకోలేక గత ఆరు నెలల క్రితం బాలచందర్ కుటుంబం వెళ్లిపోయింది. మోసపోయామని తెలుసుకున్న కార్మికులు గత మూడు నెలల క్రితం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు చేతుల్లో మోసపోయిన తమకు న్యాయం చేయాలని హెచ్‌ఏఎల్ బాధిత కార్మికులు కోరుకుంటున్నారు.
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ
Published Sun, Aug 23 2015 4:20 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement