పంజగుట్ట : పెట్టిన పెట్టుబడికి కేవలం నలభైరోజుల్లోనే రెట్టింపు డబ్బు ఇస్తానని నమ్మబలికి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన పంజగుట్టకు చెందిన రజనీరెడ్డి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. పోలీసుల కథనం ప్రకారం... రజనీరెడ్డి మాటలు నమ్మి నగరానికి చెందిన పలువురు కూలీలు, చిన్నా చితక పనులు చేసుకునే సుమారు 700 మంది అప్పులు చేసి మరీ ఆమె వద్ద లక్షల్లో పెట్టుబడి పెట్టారు. ఆమె వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పుకుంటుండంతో పలువురు రజనీరెడ్డిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. బాధితులు తమకు తక్షణం డబ్బు చెల్లించాలని రజనీరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. తరచూ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఈనేపథ్యంలో రజనీరెడ్డి ఆదివారం నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరింది. గమనించిన కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రవీందర్ రెడ్డి, రజనీరెడ్డి దంపతులు గత కొంత కాలంగా నివాసముంటున్నారు. రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకున్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. కాగా రజనీరెడ్డి అపార్ట్‌మెంట్ సమీపంలోని మహిళలు పరిచయం చేసుకొని తమకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే.. పెట్టిన పెట్టుబడికి 45 రోజుల్లో రెట్టింపు ఇస్తానని మాయ మాటలు చెప్పింది. ఇది నమ్మిన కొంత మంది మహిళలు మొదట రూ. 5, రూ. 10 వేలు పెట్టుబడులు పెట్టారు. వీరికి రెట్టింపు చెల్లించడంతో నిజమేనని నమ్మినవారు తిరిగి మరికొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అలాగే వారి బంధువులు, తెలిసిన వారితో కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు.
ఇటీవల తమకు రావాల్సిన డబ్బు చెల్లించాలంటూ కొంత మంది రజనీరెడ్డి వద్దకు వెళ్లగా.. ‘డబ్బులు లేవు.. ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చింది. మోసపోయామని గుర్తించిన బాధితుల్లో కొంత మంది నెల రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు పరిశీలించిన పంజాగుట్ట పోలీసులు భారీ మొత్తంలో మోసం జరిగిందని కేసును సిసిఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. అప్పటి నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు స్థానిక కార్పొరేటర్ మహేష్ యాదవ్ సహాయంతో సోమవారం రజనీరెడ్డి నివాసం ముందు బైఠాయించారు.
రజనీరెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. సుమారు 300 మంది బాధితులు రజనీరెడ్డి ఇంట్లోకి చొరబడి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని కొంత మంది మధ్యవర్తులే డబ్బులు కాజేశారని రజనీరెడ్డి ఆరోపించగా వారెవరో చెప్పాలంటూ బాధితులు నిలదీశారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
కోట్లు కాజేసిన రజనీరెడ్డి ఆత్మహత్యాయత్నం
Published Tue, Apr 8 2014 10:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement
Advertisement