మున్నాభాయ్‌లెందరు? | cid enquiry going on eamcet leakage in telangana | Sakshi
Sakshi News home page

మున్నాభాయ్‌లెందరు?

Published Mon, Aug 1 2016 2:12 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

మున్నాభాయ్‌లెందరు? - Sakshi

మున్నాభాయ్‌లెందరు?

ఎంసెట్ ర్యాంకులను జల్లెడ పడుతున్న సీఐడీ
విద్యార్థులు ‘శిక్షణ’ పొందిన కేంద్రాల్లోని
సీసీ ఫుటేజీల స్వాధీనం
నౌషాద్ అలీ, గుడ్డూ ఆచూకీకి
దుబాయ్ పోలీసులతో సంప్రదింపులు
 
హైదరాబాద్:
ఎంసెట్-2 లీకేజీతో మొత్తంగా ఎంత మంది విద్యార్థులు లబ్ధి పొందారన్న అంశంపై సీఐడీ దృష్టి సారిస్తోంది. ఎంసెట్-1, ఎంసెట్-2లో ఐదు వేల ర్యాంకుల వరకు జల్లెడ పడుతోంది. ఈ మేరకు జేఎన్‌టీయూ నుంచి ర్యాంకర్ల వివరాలను తీసుకుంది. రెండు సెట్లలో వచ్చిన ర్యాంకులను పోల్చి చూస్తోంది. ఒకదానికొకటి పొంతన లేనంతగా ర్యాంకులు ఎవరెవరికి వచ్చాయనే విషయాన్ని ఆరా తీస్తోంది. ఐదు ప్రత్యేక బృందాలు ఇదే పనిలో నిమగ్నమయ్యాయి. మరోవైపు లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు ఐదు నగరాల్లో ‘ప్రత్యేక శిక్షణ’ పొందినట్లు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. మరిన్ని ఆధారాల కోసం బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుంది. ఎంసెట్-1, ఎంసెట్-2లలో ర్యాంకుల్లో వ్యత్యాసం వచ్చిన వారు ఈ సీసీ పుటేజీలో ఉన్నారా అన్న కోణంలో ఆరా తీయనుంది. ఫుటేజీలు, విమాన టికెట్లు, ర్యాంకుల్లో వ్యత్యాసం వంటివి కోర్టులో కేసుకు బలమైన ఆధారాలుగా మార్చుకోవచ్చని సీఐడీ భావిస్తోంది.
 
దళారులపై వల
ఎంసెట్-2లో దళారులు ఎందరున్నారన్న అంశంపై సీఐడీ దృష్టి సారిస్తోంది. ఇప్పటి వరకు బ్రోకర్లుగా గుర్తించిన రాజగోపాల్‌రెడ్డి, షేక్ రమేశ్‌లను అరెస్టు చేయగా మరో బ్రోకర్ రామకృష్ణను అదుపులోకి తీసుకుంది. అలాగే సబ్ బ్రోకర్లుగా పనిచేసిన 8 మందిని అదుపులోకి తీసుకొని నలుగుర్ని అరెస్టు చేసింది. వీరి కింద కొన్ని కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు చెందిన వారు, వాటి పీఆర్వోలు మైక్రో బ్రోకర్లుగా పనిచేసినట్లు సీఐడీ గుర్తించినట్లు సమాచారం. వారందరిని అదుపులోకి తీసుకోవాలని యోచిస్తోంది.

దుబాయ్ పోలీసుల సహకారం
కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న షేక్ నౌషాద్ అలీ, గుడ్డూ దుబాయ్‌కి పారిపోయినట్లు గుర్తించిన సీఐడీ.. వారిని పట్టుకునేందుకు అక్కడి పోలీసుల సహకారం తీసుకోనుంది. ఈ మేరకు ఒక ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లింది. ఈ లోపు నిందితులు దుబాయ్ నుంచి కూడా పారిపోయేందుకు ఆస్కారం ఉంటుందని సీఐడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓపక్క అధికారిక ఫార్మాలిటీస్‌కు సన్నాహాలు చేస్తూనే... మరోపక్క దుబాయ్‌కి వచ్చిన తమ బృందానికి సహకరించాల్సిందిగా అక్కడి అధికారులను కోరింది. రాష్ట్ర ఉన్నతాధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement