* సీఐడీ దర్యాప్తులో పెరుగుతున్న దళారుల సంఖ్య
* ఇప్పటివరకు 8 మంది అరెస్టు.. అదుపులో మరో 10 మంది
* అజ్ఞాతంలో ఉన్న 24 మంది కోసం ముమ్మర గాలింపు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో తెరపైకి వస్తున్న బ్రోకర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ స్కాంలో ఇప్పటివరకు 34 మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. బ్రోకర్లను బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే, రాజస్తాన్, షిరిడీ, కటక్, తెలంగాణ, ఏపీలకు చెందినవారిగా గుర్తించారు.
మొత్తం 42 మంది బ్రోకర్లలో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసిన అధికారులు మరో 10 మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇంకో 24 మంది బ్రోకర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గుర్తించారు. వారిలో 8 మంది విదేశాలకు పారిపోయినట్లు సీఐడీకి ఆధారాలు లభించాయి. వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ఇక్బాల్ అలియాస్ ఖలీల్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు...ఈ స్కాంలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న సునీల్‌సింగ్, ముకుల్‌జైన్, మయాంక్‌శర్మ ఆచూకీ ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి.
తెరపైకి కటక్...
ఎంసెట్-2కు ముందు 48 గంటల కోచింగ్ కోసం ఎంపిక చేసిన విద్యార్థులకు ఒడిశాలోని కటక్ కేంద్రంగా కూడా బ్రోకర్లు ప్రత్యేక శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ తాజా దర్యాప్తులో వెలుగు చూసింది. ఇప్పటివరకు బెంగళూరు, ముంబై, పుణే, కోల్‌కతా, ఢిల్లీ కేంద్రాలుగా శిక్షణ ఇచ్చినట్లు వెలుగులోకిరాగా తాజాగా కటక్ పేరు తెరపైకి వచ్చింది.
పరీక్షకు రెండు రోజుల ముందు విద్యార్థులను విమానంలో కటక్ తరలించి ప్రత్యేక శిక్షణ ఇప్పించిన బ్రోకర్లు వారిని పరీక్షకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ చేర్చినట్లు సీఐడీ తేల్చింది. బ్రోకర్లందరూ పక్కా ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ నుంచి ఉదయం, రాత్రి వేళల్లో విమాన రాకపోకలకు అనువుగా ఉన్న నగరాలను విద్యార్థుల శిక్షణ కోసం ఎంపిక చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వెలుగులోకి కొత్త పేర్లు..
బ్రోకర్ల జాబితాలో తాజాగా ఏపీలోని నరసరావుపేటకు చెందిన నరేంద్ర కుమార్ చౌదరి పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతను అజ్ఞాతంలో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అలాగే బెంగళూరుకు చెందిన రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన మరో ఐదుగురు బ్రోకర్లను గుర్తించారు. షిరిడీలో తలదాచుకున్న మరో నలుగురు బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. బ్రోకర్ల జాబితాలో వున్న తెలంగాణ, ఏపీకి చెందిన 12 మందిని పట్టుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతోంది.
నేడు ఎంసెట్-3 కమిటీ భేటీ
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 11న నిర్వహించనున్న ఎంసెట్-3 నిర్వహణపై చర్చించేందుకు పరీక్ష కమిటీ శనివారం సమావేశం కానుంది. ఫలితాల వెల్లడి, ర్యాంకుల విడుదలకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేసింది.
‘ఎంసెట్-2’లో 42 మంది బ్రోకర్లు!
Published Sat, Aug 6 2016 2:31 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM
Advertisement
Advertisement