వీకెండ్ వెరైటీగా గడిపేందుకు ఆసక్తి | City residents interest to spend weekend varietly | Sakshi
Sakshi News home page

వీకెండ్ వెరైటీగా గడిపేందుకు ఆసక్తి

Published Sun, Sep 29 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM

City residents interest to spend weekend varietly

నగరవాసుల అభి‘రుచి’ మారుతోంది.. వీకెండ్ భిన్నంగా గడపాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వెరైటీ రుచులతో పాటు డ్యాన్స్... మ్యూజిక్... మేజిక్కుల మేలుకలయికతో మురిసి మెరవాలన్నది సిటీజనుల లే‘టేస్ట్’ జీవనశైలి. వారంలోని ఐదురోజుల ఒత్తిడి వీకెండ్‌లో చిత్తయ్యేలా ఎంజాయ్ చేయాలని తపిస్తున్నారు. వీరికి తగ్గట్టే ఆహారంతో పాటు వడ్డించే వారి ఆహార్యమూ అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాయి నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు. ‘మా ఆతిథ్యంలో కిక్కు ఉంది... దానికో లెక్క ఉంది..’ అంటూ కొత్త థీమ్‌లతో ఆకట్టుకుంటున్నాయి.
 
చేస్తున్నాయి పలు హోటళ్లు. ఈ క్రమంలో కొన్ని హోటళ్ల సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి తమ రూపురేఖలను మార్చుకుంటూ కొత్తదనంతో వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బార్బిక్యూ నేషన్ గతంలో సముద్రపు దొంగల థీమ్‌తో ప్రత్యేకంగా ఆహారోత్సవం ఏర్పాటు చేసింది. ఇందులో బాగంగా అక్కడి సిబ్బంది అచ్చంగా సముద్రపు దొంగలు ఎలా ఉంటారో అలా తయారై ఆహూతులకు వడ్డించారు. అంతేకాకుండా సముద్రపు ఉత్పత్తులను అలాగే పెట్టి అందులో వండిన పదార్థాలతో అతిథులకు అందించి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక కిచెన్ కార్నివాల్ పేరుతో సైతం ఇలానే రైలుబండిలో లభించే ఆహార పదార్థాలను హోటల్‌కు వచ్చిన వారికి అందించారు. ఛాయ్.. బేల్‌పురి, సమోసా, కిళ్లీ.. ఇలా ప్రతి వాటిని అందించే ప్రయత్నం చేశారు.

మాబ్‌లతో మెరిసి.. కలిసి..

మరికొన్ని రెస్టారెంట్లు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ అతిథులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం ప్రత్యేకమైన రుచులు అందించడమే కాకుండా సంగీత, నృత్యాలతో అలరిస్తున్నాయి. అతిథుల మధ్య మెరుపులా సిబ్బంది ప్రత్యక్షమై నృత్యాలు చేస్తూ ఆరగింపులో కొత్త కిక్కు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అతిథులు భోజనం చేస్తుండగా మంద్రంగా వచ్చే సంగీతం రెట్టింపవుతుంది. ఉత్సాహం ఉరకలెత్తించేలా అక్కడ జోష్ పెంచుతున్నారు. ఫ్లాష్‌మాబ్‌తో మెరిసిపోతున్నారు. సమయానికి, ఆహారోత్సవానికి అనుగుణంగా నృత్యాలతో ముందుకు వస్తున్నారు. అక్కడ భోజనం చేసే వారు సైతం అందులో కలిసి ఆడిపాడుతున్నారు. చిన్నపెద్ద అంతా అందులో ఆనందపారవశ్యం పొందుతున్నారు. అంతేకాదు ప్రత్యక్షంగా సైతం పాటలు పాడించే పద్ధతిని ఇప్పుడు చాలా హోటల్స్ అనుకరిస్తున్నాయి. వచ్చినవారికికొసరి కొసరి వడ్డించడమే కాదు.. కావాల్సిన పాటలు సైతం వెంటనే పాడి వినిపించి ఆనందింపజేస్తున్నాయి.

అభిరుచి మారుతోంది
నగర వాసుల అభిరుచి మారుతోంది. ఇందుకనుగుంగానే మేమందించే ఆహారంతోపాటు ప్రత్యేకమైన అంశాలను మా మెనూలో చేర్చుతున్నాం. వినోదాన్ని పంచాలనే నేపథ్యంతో కొత్త కొత్త డ్యాన్స్ థీమ్‌లను ఏర్పాటుచేస్తున్నాం. మంచి స్పందన వస్తుంది.    
- రాజేష్‌కుమార్ భగత్, ఎగ్జిక్యూటివ్ ఛెఫ్, బార్బిక్యూ నేషన్
 
కొత్తదనం చూపిస్తున్నాం
నిత్యం వచ్చేవారు ఒకే విధమైన ఆహారాన్ని కోరుకోరు. కొత్తదనం కోసం చూస్తారు.  తమకు కావాల్సిన వంటకాల కోసం అన్వేషిస్తుంటారు. అందుకే వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలతో కూడిన ఆహారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం.  రోజురోజుకు ఈ ఆహారోత్సవాలకు ప్రాధాన్యం పెరుగుతోంది.
- నితిన్, తాజ్‌కృష్ణ ఎగ్జిక్యూటివ్ చెఫ్
 
లైవ్‌లీగా ఉంటే ఇష్టం

భోజనానికి చాలా చోట్లకు వెళ్తుంటాం. కాని ఎక్కడకు వెళ్లినా మా కళ్ల ముందు తయారు చేసి వంట వండి అందించేవారు చాలా తక్కువ. అంతేకాకుండా మేం భోజనానికి బయటకు వచ్చేది అప్పుడప్పుడే. అలాంటప్పుడు కాస్త విభిన్నంగా ఉండే హోటల్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటాం. తద్వారా మాకు కావల్సిన ఆనందం దక్కుతుంది.    
- భార్గవ్, తిలక్‌నగర్, విద్యార్థి
 
స్పెషల్ థీమ్స్‌తో వినోదం
వారంలో 5 రోజులూ పని ఒత్తిడితో ఉంటాం. వారాంతాల్లోనే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బయటకు వస్తుంటాం. అందువల్ల ఈ సమయంలో మ్యాగ్జిమం ఎంజాయ్ చేయాలి. నగరంలోని పలు హోటల్స్ ఇప్పుడు ప్రత్యేకమైన థీమ్స్‌తో ముందుకు వస్తున్నాయి. వీటివల్ల రిలాక్స్ అవుతాం.    
- దీప్తి, ఉద్యోగిని
 
రుసి ఐడొనిలో చాక్లెట్ జార్
సాక్షి, లైఫ్‌స్టైల్‌ ప్రతినిధి: ఫ్లవర్‌వాజ్ గురించి విన్నాం కానీ... చాక్లెట్ జార్ గురించి విన్నారా? బంజారాహిల్స్ రోడ్‌నెం.10లో ఉన్న రుసిఐడొని రెస్టారెంట్ పరిచయం చేసిన సరికొత్త ‘రుచి’ ఇది. ఫడ్జ్ బ్రౌనీ ఇన్ ఎ జార్ పేరుతో దీన్ని ప్రత్యేకంగా అతిథులకు అందిస్తున్నట్టు రెస్టారెంట్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. చిక్కటి పాలతో తయారు చేసిన ఈ డిజర్ట్‌ను ప్లేట్‌లో సర్వ్‌చేయడం కుదరదు కనుక ఈ తరహాలో సర్వ్ చేస్తున్నట్టు వివరించారు. సీత్రూ గ్లాస్ కారణంగా దీనిలో ఉన్న చాక్లెట్ కేక్, క్రీమ్... వగైరాలు చవులూరించేలా కను‘విందు’ చేస్తాయన్నారు. ఇది 4 లేయర్లు(పొరలు) ఉన్న డిజర్ట్. అడుగు భాగంలో డార్క్ చాక్లెట్ మూజ్, దానిపైన వైట్‌చాక్లెట్, ఫడ్జ్ బ్రౌనీ, మిక్స్‌డ్‌నట్స్, హాట్ ఫడ్జ్ చాక్లెట్ వేసి అందిస్తున్నారు. ఈ సరికొత్త డిజర్ట్ ధర రూ.120గా నిర్ణయించినట్టు ప్రవీణ్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement