బంగారు తెలంగాణ కోసం సీఎం కృషి
♦ రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు
♦ రోడ్ల అభివృద్ధికి రూ.1700 కోట్లు
♦ గచ్చిబౌలి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ
♦ జెండాను ఎగురవేసిన మంత్రి మహేందర్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో : బంగారు తెలంగాణ తీర్చిదిద్దే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు.. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు నడిపించే దిశగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి 1700 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతుందని తెలిపారు. పలు పథకాలకు కేటాయించిన నిధులు, వాటి ద్వారా జరగే లబ్ధిని వివరించారు.
ఆకట్టుకున్న శకటాలు..
10 కోట్ల 56 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును స్వయం సహాయక సంగాలకు మంత్రి మహేందర్‌రెడ్డి అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు అందజేశారు. ప్రభుత్వ విభాగాల స్టాళ్లను సందర్శించారు. డీఆర్‌డీఏ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, సర్వశిక్ష అభియాన్, అగ్నిమాపక, 108, 104 శకటాల ప్రదర్శనను కూడా మంత్రి తిలకించారు.
అలాగే జిల్లాలో విశిష్ట సేవలందించిన 207 మంది అధికారులు, ఉద్యోగులకు మహేందర్‌రెడ్డి ప్రశంస పత్రాలను అందజేశారు. బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ అండర్-19 బీచ్ వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన కిశోర్‌రెడ్డిని సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సైనీ తదితరులు పాల్గొన్నారు.