minister mahendar reddy
-
ఆర్టీసీలో నష్టాలు తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీలో నష్టాలు తగ్గుముఖం పట్టాయని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం రూ.371.17 కోట్ల నష్టాలు నమోదు కాగా, ఈ ఏడాది రూ.340.39 కోట్లు నమోదయ్యాయని చెప్పారు. 23 డిపోలు లాభాల బాటలో నడుస్తుండగా, మరో 59 డిపోల్లో నష్టాలు తగ్గాయని అన్నారు. శుక్రవారం ఇక్కడ బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎం.డి.రమణారావు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మలతో కలసి మాట్లాడారు. ఈ ఏడాది రూ.31 కోట్ల వరకు నష్టం తగ్గిందని, ఆర్టీసీకి రోజుకు రూ.96 లక్షల ఆదాయం లభిస్తోందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం రోజుకు రూ.కోటి నష్టం వస్తున్నట్లు పేర్కొన్నారు. దశలవారీగా అన్ని డిపోలను లాభాల బాటలో నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన రూ.1,000 కోట్లలో ఇప్పటి వరకు రూ.600 కోట్లు అందాయన్నారు. బస్‌పాస్‌లు, ఇతర సబ్సిడీల రూపంలో రావలసిన నిధులను త్వరలోనే అందజేసే విధంగా సీఎం కేసీఆర్‌ను కోరనున్నట్లు తెలిపారు. దూరప్రాంతాల బస్సులు లాభాల బాటలోనే నడుస్తుండగా, పల్లెవెలుగు బస్సులు నష్టాలను చవి చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని మరో 900 గ్రామాలకు దశలవారీగా రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఏపీ, తెలంగాణల మధ్య సింగిల్ పర్మిట్ విధానం త్వరలోనే అమల్లోకి వస్తుందన్నారు. ఏడాదిలో 1,000 కొత్త బస్సులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఈ ఏడాది 1,000 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మేడారం జాతర సందర్భంగా 4,200 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు 23 చోట్ల మినీ థియేటర్ల ఏర్పాటుపై వ్యాపారుల నుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. త్వరలోనే ఆర్టీసీ స్థలాల్లో 114 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటా మని అన్నారు. టీఎస్ఆర్టీసీకి రెండు స్కాచ్ అవార్డులు లభించడంపట్ల మంత్రి మహేందర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
'డ్రగ్స్ రాకెట్‌తో మంత్రులకు సంబంధం లేదు'
శంషాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌తో మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం కాచారంలో హరితహారం కార్యక్రమానికి హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ డ్రగ్స్ కేసులో పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని.. ఎంతటి వారున్నా చర్యలు తప్పవన్నారు. అధికార పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే మంత్రుల పేర్లను డ్రగ్స్ రాకెట్ కేసుతో లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, జెడ్పీటీసీ సతీష్, ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ సరిత, నాయకులు చంద్రారెడ్డి, బిక్షపతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని విచారిస్తున్నారు. నేడు మూడో రోజు నటుడు సుబ్బరాజు సిట్ విచారణకు హాజరు కానున్నారు. -
లీజుకు ఆర్టీసీ స్థలాలు
హైదరాబాద్: ఆర్టీసీ సంస్థకు చెందిన ఖాళీగా ఉన్న 69 స్థలాలను ఆయిల్ కంపెనీలకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఆర్టీసీకి చెందిన మరో 150 స్థలాలను గుర్తించి అదనపు ఆదాయం కోసం కృషి చేస్తున్నామన్నారు. -
తెలంగాణలో పనిచేయాలని ఉంది: మహిళా డ్రైవర్
హైదరాబాద్ : దేశంలోని మొదటి మహిళా డ్రైవర్ సరిత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో శుక్రవారం కలిశారు. ఆమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం. ప్రస్తుతం ఆమె ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు. దేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా సరిత విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తానని, తనకు తెలంగాణ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేసే అవకాశం ఇవ్వాలని మంత్రిని కోరింది. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు. సరిత విజ్ఞప్తికి మంత్రి మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. -
వాతావరణ సమతుల్యతకు హరితహారం
రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఘట్కేసర్: వాతావరణ సమతుల్యతకు హరితహారం అవసరమని రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో గురువారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలునాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో 44కోట్ల మొక్కలునాటుతామన్నారు. అడవులు 33 శాతం ఉండవలసి ఉండగా అంతశాతం అడవులు లేవన్నారు.ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా 40వేల మొక్కలు నాటాలన్నారు. అడవులు చాలనన్ని అడువులు ఉన్న జిల్లాలో వానలు బాగ కురిసి చెరువులు నిండుతున్నాయన్నారు.అడవులశాతం తక్కువగా ఉన్న రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో వానలు సరిగా కురవడం లేదన్నారు.హరితహారం కార్యక్రమం మొక్కలు నాటి వాటిని భావితరాలకు అందచేయాలన్నారు.మొక్కలునాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.2లక్షల 75వేల మొక్కలునాటినట్లు చెప్పారు.హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛందసేవాసంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు.దేశంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు.హరితహారం, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేసుధీర్రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్పార్టీవాళ్లు రాజకీయం చేస్తున్నారని చెప్పారు,మల్లన్న సాగర్‌ప్రాజెక్టు ద్వారా శామీర్‌పేట్ చెరువును నీటిని నింపి ఆనీటిని గ్రావిటితో ఏదులాబాద్ చెరువును నింపి మండలవాసులకు నీరు అందిస్తామన్నారు.నీటిని రాకుండా చేస్తున్నవారి ప్రయత్నాలను కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు.తెలంగాణలో పచ్చదనం చేయడానికి హరితహారం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.యువజన సర్వీసుల విభాగం కమిషనర్ మహ్మద్ అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ భూమిలో తగినన్ని అడవులు లేకపోవడం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర పలుచబడుతుందన్నారు.దీంతో సరిగా వానలు కురవక అనేక అనర్ధాలు కలుగుతాయన్నారు.మహసముద్రాలు, పర్వతాలు, అడవులు భూమి వాతవరణాన్ని సమతుల్యత ఉంచడానికి తోడ్పాటునుఅందిస్తాయన్నారు.సమావేశంలో స్టెప్ సీఈఓ సీతారామరావు,జడ్పీటీసీ మందసంజీవరెడ్డి,సింగిల్‌విండో డైరెక్టర్ గొంగళ్లస్వామి,ఎంపీడీఓ శోభ,తహసీల్ధారు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మూసీశంకరన్న,ఎంపీటీసీ మంకంరవి, గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు మేకల లక్ష్మి, లక్ష్మణ్, కొండమ్మ, నాయకులు రాజేందర్, ధరంకార్ సత్యరామ్, బాలేష్,యుగేందర్, హరిశంకర్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మేకల కుమార్,అబ్బోళ్ల ఇందిరా నాగేష్,మెట్టురమేష్,మురళీ, జీబీఎన్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పొటో28ఎండీసీ42 ప్రసంగిస్తున్న మంత్రిమహేందర్రెడ్డి, పొటో28ఎండీసీ42ఎ మొక్కలునాటుతున్న మంత్రిమహేందర్రెడ్డి -
రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చిన్నగోల్కొండ రహదారి పనులను ప్రారంభం శంషాబాద్ రూరల్: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుందని, జిల్లాలో ఆర్అండ్బీ రోడ్ల కోసం రూ.4వేల కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని చిన్నగోల్కొండ రోడ్డు వెడల్పు, రీబీటీ పనులకు ఆయన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల అభివృద్ధి కోసం జిల్లాలో రూ.385 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. జిల్లాలో అడవుల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో సమృద్ధిగా వర్షాలు కురవడంలేదని, హరితహారంతో పచ్చదనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాలు కురిస్తే చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరి సాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయని మంత్రి తెలిపారు. చిన్నగోల్కొండ రోడ్డు కోసం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రూ.4.07 కోట్లు మంజూరు అయినట్లు చెప్పారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులు, స్థానికులకు ఇబ్బందులు తప్పుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బూర్కుంట సతీష్, సర్పంచులు దౌనాకర్‌గౌడ్, సువర్ణ, సిద్దులు, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఇస్తారి, నాయకులు చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఆ చెట్లు ఎండిపోయాయ్...
హరితహారంపై మంత్రి మహేందర్‌రెడ్డి స్పందన సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం పథకాన్ని వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉపాధిహామీ పథకం అమలు సమీక్షించారు. ఈ సందర్భంగా కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి హరితహారం పురోగతిని వివరించాలని కోరారు. నాటిన చెట్లు.. ప్రస్తుతం ఉన్నవెన్ని అని ఆయన ప్రశ్నించగా.. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ‘‘ హరితహారం చెట్లన్నీ ఎండిపోయాయ్.. ఆ విషయం అందరికీ తెలుసు కదా.. వర్షాలు పడితే చెట్టు పెరిగేవి. వచ్చే సీజన్లో వర్షాలు కురిసినప్పుడు వాటి పురోగతిపై పూర్తిస్థాయిలో సమీక్షిద్దాం.’’ అంటూ స్పందించారు. దీంతో సభలో అందరూ ఒక్కసారిగా నవ్వారు. గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ జోన్ వద్దు.. మైనింగ్‌జోన్ ఏర్పాటుపై పునఃసమీక్ష చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మైనింగ్ శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో మైనింగ్ ఏర్పాటు చేశారని, తాజాగా యాచారం, మంచాల మండలాల్లో మైనింగ్‌జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొంటూ, గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆదారపడిన రైతులకు మైనింగ్‌జోన్ గుదిబండగా మారనుందని.. ఈ జోన్ ఏర్పాటును విరమించాల్సిందిగా జెడ్పీ పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాదనను యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్ తదితరులు బలపర్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. శామీర్‌పేట చెరవును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని కొంతకాలంగా వివరిస్తున్నా ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదంటూ జెడ్పీటీసీ బాలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుంటూ మినీట్యాంక్‌బండ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌కాకతీయ లక్ష్యాల్లో జిల్లా పూర్తిగా వెనకబడిందంటూ నీటిపారుదల అధికారులపై సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. -
'ఎస్సై మృతిపై సీఐడీతో విచారణ'
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీతో విచారణ చేయిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి అన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై క్రమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎస్ఐ రమేష్ మృతిపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఆయన మృతి వెనక ఇసుక మాఫియా ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
బంగారు తెలంగాణ కోసం సీఎం కృషి
♦ రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ♦ రోడ్ల అభివృద్ధికి రూ.1700 కోట్లు ♦ గచ్చిబౌలి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ ♦ జెండాను ఎగురవేసిన మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో : బంగారు తెలంగాణ తీర్చిదిద్దే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం ఉదయం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు.. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలతో తెలంగాణను అన్నిరంగాల్లో ముందుకు నడిపించే దిశగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి 1700 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో రెండు లక్షలకుపైగా ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతుందని తెలిపారు. పలు పథకాలకు కేటాయించిన నిధులు, వాటి ద్వారా జరగే లబ్ధిని వివరించారు. ఆకట్టుకున్న శకటాలు.. 10 కోట్ల 56 లక్షల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును స్వయం సహాయక సంగాలకు మంత్రి మహేందర్‌రెడ్డి అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోలు, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ట్రై సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు, వినికిడి యంత్రాలు అందజేశారు. ప్రభుత్వ విభాగాల స్టాళ్లను సందర్శించారు. డీఆర్డీఏ, డ్వామా, ఎస్సీ కార్పొరేషన్, సర్వశిక్ష అభియాన్, అగ్నిమాపక, 108, 104 శకటాల ప్రదర్శనను కూడా మంత్రి తిలకించారు. అలాగే జిల్లాలో విశిష్ట సేవలందించిన 207 మంది అధికారులు, ఉద్యోగులకు మహేందర్‌రెడ్డి ప్రశంస పత్రాలను అందజేశారు. బ్రెజిల్లో జరిగిన అంతర్జాతీయ అండర్-19 బీచ్ వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించిన కిశోర్‌రెడ్డిని సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సైనీ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 12 ఆర్టీఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి మల్కాపురంలో వాహన ఫిట్నెస్ కేంద్రం పనులకు శంకుస్థాపన చౌటుప్పల్ : ప్రజల సౌకర్యార్థం రాష్ర్ట వ్యాప్తంగా నూతనంగా 12 ఆర్టీఏ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని కోదాడలో ఓ కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. రూ.16కోట్ల వ్యయంతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కాలం చెల్లిన వాహనాలను పరీక్షించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న వాహన సామర్థ్య కేంద్రం (వెహికిల్ ఫిట్నెస్ సెంటర్) పనులకు మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలు బుధవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. సిరిసిల్లలో రూ.20కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకనుంచి వాహనాలు ఫిట్‌నెస్‌లో ఉంటేనే రోడ్లపై తిరుగుతాయన్నారు. రెండేళ్లకోసారి ప్రతి వాహనాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో యేటా 8వేల మంది మృత్యువాతపడుతున్నారన్నారు. అందుకు కారణం ఫిట్నెస్ లేని వాహనాలు, అవగాహన లేని డ్రైవింగే కారణమన్నారు. అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్‌సుల్తానియా, జాయింట్ కమీషనర్ పాండురంగానాయక్, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ సోమ అరుణ, ఆర్టీఓ హనుమంతారెడ్డి, ఎంవీఐ, ఏఎంవీఐలు పాల్గొన్నారు. ‘పెంటావాలెంట్’తో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ నల్లగొండ టౌన్ : పెంటావాలెంట్ టీకా వేయిండం వలన చిన్నారులను ఐదు ప్రాణాంతక వ్యాధుల నుం చి కాపాడవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్కుమార్లతో కలిసి చిన్నారులకు పెంటావాలెంట్ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ టీకాతో ఐదు రకాల వ్యాధులైన కంటసర్పి, కోరంతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బీబీ, హెమోఫిలస్ ఇన్ఫూయెంజా వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించుకోవచ్చన్నారు. ప్రతి చిన్నారి తల్లిదండ్రులు టీకాను విధి గా వేయించి వారిని ఆరోగ్యవంతులుగా ఉంచాలని సూచించారు. టీకాలు వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీఐఓ డాక్టర్ ఏబీ నరేంద్ర, డీఎంఓ ఓంప్రకాశ్, డెమో తిరుపతిరెడ్డి, ఇన్ చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఉదయ్‌సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ అమర్, డాక్టర్ మాతృ, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ చందు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, అభిమన్యు, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్
► జీతాలు తక్కువ ఉన్నందుకే 44 శాతం ఫిట్మెంట్ ► కేసుల ఎత్తివేత.. సస్పెన్షన్లు రద్దు ► రానున్న నెలరోజుల్లో డిపోల వారీగా సమీక్షలు ► రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు : ఆర్టీసీ కార్మికుల బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరుకు వచ్చిన మంత్రికి బుధవారం రాత్రి ఆర్టీసీ కార్మికులు మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ నష్టాలను చవిచూసిందన్నారు. రూ.18 వందల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు కార్మికుల కోర్కెలన్నీ తీర్చిందన్నారు. కార్మికులు కోరిన 43 శాతం కన్నా ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచడంవల్ల సంస్థపై సుమారు రూ.8 వందల కోట్ల భారం పడుతున్నా.. కార్మికుల సంక్షేమానికే సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నందుకే సబ్ కమిటీలో మంత్రులు సూచనల మేరకు సీఎం 43కు బదులు 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని మహేందర్‌రెడ్డి వివరించారు. వారం రోజుల సమ్మె కాలంలో తెలంగాణలో సుమారు రూ.80 నుంచి రూ.100 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఏడాదికి రూ.400 కోట్ల నష్టాలు ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.9 కోట్ల ఆదాయం వస్తే రూ.10 కోట్ల ఖర్చు ఉంటుందన్నారు. సస్పెండయిన అధికారులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. సమ్మె కా లాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణంలోకి తీసుకుంటామన్నా రు. తెలంగాణలో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వచ్చేనెల రోజుల్లో పది జిల్లాల్లో డిపోలవారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాండూరు డిపో మేనేజర్ లక్ష్మీధర్మా, అధికారులు మంత్రిని కలిశారు. కార్మికులు, యూనియన్ నాయకులు మంత్రిని గజమాల, శాలువాతో సన్మానించారు. -
సమ్మె విరమించండి
ఆర్టీసీ కార్మికులకు మంత్రి మహేందర్‌రెడ్డి వినతి పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆదిబట్ల : ఆర్టీసీ సమ్మె విషయంలో చర్చలు జరుగుతున్నాయని, కార్మికుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తుర్కగూడ, కప్పాడు గ్రామాలలో శనివారం పలు అభివృధ్ది కార్యక్రమాలను మంత్రి మహేందర్‌రెడ్డి, భూవనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారం భించారు. తుర్కగూడలో రూ.75 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన నూతన డ్వా క్రా భవననాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం కప్పాడు నుంచి ఎలి మినేడు గ్రామానికి వేసిన బీటి రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికుల సమస్య ల పరిష్కారానికి సబ్ కమిటీ నివేదిక రా గానే పరిశీలిస్తామన్నారు. కొత్త రాష్ట్రం లో దాదాపు రూ.150 కోట్లతో కొత్తగా బస్సులు కనుగోలు చేశామన్నారు. సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డును రూ.కోటి 50 లక్షలతో, తుర్కగూడలో రూ.75 లక్షల వ్యయంతో, కప్పాడులో రూ.80 లక్షలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ అశోక్‌గౌడ్, జెడ్పీటీసీ అయిలయ్య, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ అనిల్‌కుమార్, తుర్కగూడ, కప్పాడు గ్రామాల సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, కరుణభారత్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి, రాందాస్‌పల్లి, ఆదిబట్ల, కొంగరకలాన్, ఎలిమినేడు సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, రాజు, శేఖర్, యాదమ్మ, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, లచ్చిరెడ్డి, జయేందర్‌రెడ్డి, కిరణ్ పాల్గొన్నారు. బయటపడ్డ విభేదాలు.. తుర్కగూడ గ్రామంలో డ్వాక్రా భవనం ప్రారంభోత్సావానికి వచ్చిన మంత్రి మహేందర్‌రెడ్డి ఎదురుగానే తుర్కగూడ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యు డు నిరంజన్‌రెడ్డి మధ్య వాగ్వాదం చో టుచేసుకుంది. గ్రామంలో టీఆర్ఎస్ జెండాను తమకు చెప్పకుండా ఎలా ఎ గురవేస్తారని ఎంపీటీసీ సభ్యుడు నిరంజన్‌రెడ్డిని సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి నిలదీ శారు. పార్టీ జెండాను గతంలోనే ఎగురవేశామని, గ్రూపు రాజకీయాలతో కార్యకర్తల సమన్వయాన్ని దెబ్బతీయడం సరికాదని సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి అన్నా రు. టీఆర్ఎస్ నాయకులు ఇద్దరికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
శిలాఫలకం చోరీ, మంత్రి పర్యటన రద్దు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటన బుధవారం రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే మంబాపూర్లో శంకుస్థాపన శిలాఫలకం చోరీ కావటంతో ఏకంగా మంత్రి కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది. పెద్దేముల్ మండలం మంబాపూర్లో పీహెచ్సీ భవన స్థల వివాదమే ఇందుకు కారణమని సమాచారం. ఈ ఘటనపై ఉప సర్పంచ్ ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గంగాధర్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం
హైదరాబాద్ : హైదరాబాద్ బోయిన్పల్లి వద్ద అర్థరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన డ్రైవర్ గంగాధర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవార ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి, సంఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. డ్రైవర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే బోయినపల్లి వద్ద డీసీఎం వ్యాన్ - ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దాంతో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి కిందకి దిగిపోగా, బస్సు క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ గంగాధర్ సజీవ దహనమైయ్యాడు. మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు అగ్నిపమాక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో చెలరేగిన మంటలను అర్పివేశారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.