ఆ చెట్లు ఎండిపోయాయ్...
హరితహారంపై మంత్రి మహేందర్‌రెడ్డి స్పందన
సాక్షి, రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం పథకాన్ని వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా దెబ్బతీసినట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రంగారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఉపాధిహామీ పథకం అమలు సమీక్షించారు. ఈ సందర్భంగా కందుకూరు జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి హరితహారం పురోగతిని వివరించాలని కోరారు. నాటిన చెట్లు.. ప్రస్తుతం ఉన్నవెన్ని అని ఆయన ప్రశ్నించగా.. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ‘‘ హరితహారం చెట్లన్నీ ఎండిపోయాయ్.. ఆ విషయం అందరికీ తెలుసు కదా.. వర్షాలు పడితే చెట్టు పెరిగేవి. వచ్చే సీజన్లో వర్షాలు కురిసినప్పుడు వాటి పురోగతిపై పూర్తిస్థాయిలో సమీక్షిద్దాం.’’ అంటూ స్పందించారు. దీంతో సభలో అందరూ ఒక్కసారిగా నవ్వారు.
గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ జోన్ వద్దు..
మైనింగ్‌జోన్ ఏర్పాటుపై పునఃసమీక్ష చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మైనింగ్ శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇప్పటికే వెయ్యి ఎకరాల్లో మైనింగ్ ఏర్పాటు చేశారని, తాజాగా యాచారం, మంచాల మండలాల్లో మైనింగ్‌జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన పేర్కొంటూ, గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆదారపడిన రైతులకు మైనింగ్‌జోన్ గుదిబండగా మారనుందని.. ఈ జోన్ ఏర్పాటును విరమించాల్సిందిగా జెడ్పీ పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే ప్రతిపాదనను యాచారం జెడ్పీటీసీ కర్నాటి రమేష్‌గౌడ్ తదితరులు బలపర్చారు. దీంతో మంత్రి మహేందర్‌రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. శామీర్‌పేట చెరవును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని కొంతకాలంగా వివరిస్తున్నా ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదంటూ జెడ్పీటీసీ బాలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో జెడ్పీ చైర్‌పర్సన్ జోక్యం చేసుకుంటూ మినీట్యాంక్‌బండ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌కాకతీయ లక్ష్యాల్లో జిల్లా పూర్తిగా వెనకబడిందంటూ నీటిపారుదల అధికారులపై సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.