కార్మికుల బాధలు అర్థం చేసుకున్న కేసీఆర్
► జీతాలు తక్కువ ఉన్నందుకే 44 శాతం ఫిట్‌మెంట్
► కేసుల ఎత్తివేత.. సస్పెన్షన్లు రద్దు
► రానున్న నెలరోజుల్లో డిపోల వారీగా సమీక్షలు
► రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
తాండూరు : ఆర్టీసీ కార్మికుల బాధలను అర్థం చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరుకు వచ్చిన మంత్రికి బుధవారం రాత్రి ఆర్టీసీ కార్మికులు మిఠాయి తినిపించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీ నష్టాలను చవిచూసిందన్నారు. రూ.18 వందల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ తెలంగాణ సర్కారు కార్మికుల కోర్కెలన్నీ తీర్చిందన్నారు.
కార్మికులు కోరిన 43 శాతం కన్నా ఒక్క శాతం ఫిట్‌మెంట్ పెంచడంవల్ల సంస్థపై సుమారు రూ.8 వందల కోట్ల భారం పడుతున్నా.. కార్మికుల సంక్షేమానికే సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే ఆర్టీసీ కార్మికుల జీతాలు తక్కువగా ఉన్నందుకే సబ్ కమిటీలో మంత్రులు సూచనల మేరకు సీఎం 43కు బదులు 44 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించారని మహేందర్‌రెడ్డి వివరించారు. వారం రోజుల సమ్మె కాలంలో తెలంగాణలో సుమారు రూ.80 నుంచి రూ.100 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఏడాదికి రూ.400 కోట్ల నష్టాలు ఉన్నాయన్నారు.
ఏడాదికి రూ.9 కోట్ల ఆదాయం వస్తే రూ.10 కోట్ల ఖర్చు ఉంటుందన్నారు. సస్పెండయిన అధికారులు, ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. సమ్మె కా లాన్ని స్పెషల్ లీవ్‌గా పరిగణంలోకి తీసుకుంటామన్నా రు. తెలంగాణలో ఆర్టీసీని లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వచ్చేనెల రోజుల్లో పది జిల్లాల్లో డిపోలవారీగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తాండూరు డిపో మేనేజర్ లక్ష్మీధర్మా, అధికారులు మంత్రిని కలిశారు. కార్మికులు, యూనియన్ నాయకులు మంత్రిని గజమాల, శాలువాతో సన్మానించారు.