'డ్రగ్స్ రాకెట్‌తో మంత్రులకు సంబంధం లేదు'
శంషాబాద్: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్‌తో మంత్రులకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం కాచారంలో హరితహారం కార్యక్రమానికి హాజరైన మంత్రి మహేందర్‌రెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ డ్రగ్స్ కేసులో పారదర్శకంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని.. ఎంతటి వారున్నా చర్యలు తప్పవన్నారు.
అధికార పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే మంత్రుల పేర్లను డ్రగ్స్ రాకెట్ కేసుతో లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, జెడ్పీటీసీ సతీష్, ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీ సరిత, నాయకులు చంద్రారెడ్డి, బిక్షపతి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని విచారిస్తున్నారు. నేడు మూడో రోజు నటుడు సుబ్బరాజు సిట్ విచారణకు హాజరు కానున్నారు.