ఆదిలాబాద్ పంపిస్తా!
►పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు
►ఇంజనీరింగ్ పనులపై కలెక్టర్ అసహనం
►తీసుకున్న జీతానికి న్యాయం చేయాలని
►అధికారులకు తీవ్ర హెచ్చరిక
‘నిధులున్నా పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యం ఎందుకు?. మీ పనితీరు మార్చుకోండి. లేకుంటే ఆదిలాబాద్‌కు పంపిస్తా’ అంటూ కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల సమీక్షలో ఆమె అధికారుల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘తీసుకున్న జీతానికి న్యాయం చేయరా..’ అంటూ నిలదీశారు. ఇష్టం లేకుంటే బదిలీ చేయించుకొని వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: ‘ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. పనులు చేపట్టేందుకు నిర్లక్ష్యమెందుకు..? కాలపరిమితి అంటూ లేదా..? ప్రతి పనికి ఏదో ఒక సాకు. అలసత్వం ప్రదర్శిస్తే ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తా’ అని జిల్లా కలెక్టర్ యోగితా రాణా ఇంజనీర్లను హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సర్వశిక్షాభియాన్ ఇంజనీరింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ‘పనితీరు మార్చుకోలేకపోతే బదిలీ చేసుకొని వెళ్లిపోండి..లేక నిర్లక్ష్యం వీడి పనిచేయండి. నెలసరి తీసుకున్న జీతానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? పని విషయంలో వెనక్కి తగేది లేదు. పనితీరు మారాల్సిందే’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
కనీసం లక్ష నుంచి రెండు లక్షల వ్యయంతో చేపట్టే చిన్న చిన్న పనులను కూడా టెండర్ల సాకుతో పూర్తిచేయకపోవడం ఇంజనీర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సివిల్ పనులు నిర్ణీత గడువులోగా పాలసీ ప్రకారం పూర్తి చేయాలని, ప్రతి పనికి టెండర్ల ఖరారు...పరిపాలన మంజూరు వంటి కారణాలతో కాలయాపన చేస్తే ఇకపై సహించేది లేదని ఖరాకండిగా చెప్పారు. ఇకపై ఆయా పనులకు అగ్రిమెంట్ చేసుకునే ముందు వాటిని ఎంత వ్యవధిలో పూర్తి చేస్తారో ఖచ్చితంగా పేర్కొని పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు టెండర్లు ఆహ్వనించని పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు.
144 అదనపు గదుల పనులు సెప్టెంబర్ 10లోగా పూర్తిచేయాలని కలెక్టర్ యోగితా సూచించారు. పూర్తయిన పనికి ఫొటోగ్రాప్స్ పొందుపర్చాలని, కోర్టు కేసులు కారణంగా ఏవైనా పనులు ఆగిన పక్షంలో వాటి వివరాలను సంబంధిత తహసీల్దార్లకు అందజేయాలని ఆదేశించారు. విద్యా శాఖకు సంబంధించిన పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనానికి సూచించారు ఈ సమావేశంలో డీఈవో , ఎస్‌ఎస్‌ఏ ఈఈ సాంబయ్య, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.