
అమ్మాయి కోసం విద్యార్థుల గొడవ
హైదరాబాద్: అమ్మాయి కోసం విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... తార్నాకకు చెందిన అనురాగ్ అనే విద్యార్థి బంజారాహిల్స్ రోడ్ నెం. 11 లోని అమిటి ఎంబీఏ కళాశాలలో బీబీఏ చదువుతున్నాడు. ఇదే కళాశాల లో చదువుతున్న విద్యార్థినిని ప్రతి రోజూ మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మన్సూర్‌అలీఖాన్ అనే యువకుడు తన బైక్‌పై తీసుకుపోతున్నాడు. అయితే తమ కాలేజీకి చెందిన విద్యార్థినిని అలా తీసుకెళ్లడం పద్ధతి కాదంటూ అనురాగ్ రెండు రోజుల క్రితం మన్సూర్ అలీఖాన్‌ను హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం అనురాగ్ స్నేహితులు యువతిని తీసుకుపోవడానికి వచ్చిన మన్సూర్‌అలీఖాన్‌పై దాడి చేశారు. ఇందుకు ప్రతీకారంగా మన్సూర్ తన స్నేహితులు 20 మందిని తీసుకొని బుధవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకున్నాడు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పథకం వేసుకొని, ఒకరిని ఒకరు వెంబడించుకుంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 8 వద్దకు చేరుకున్నారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.