ఆన్‌లైన్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
- నిర్వహణకు ఉన్నత విద్యా మండలి ఆలోచనలు
- త్వరలో డిప్యూటీ సీఎం కడియంతో చర్చించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీఈసెట్, పీఈసెట్ వంటి పరీక్షల నిర్వహణను ఇప్పటివరకు ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది. వివిధ వర్సిటీలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించి ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సులు, ఎంబీఏ, ఎంసీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, పీజీ ఇంజనీరింగ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపడుతోంది. అయితే ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించడం ద్వారా పేపరు లీకేజీ వంటి సమస్యలను అధిగమించవచ్చన్న ఆలోచనలు చేస్తోంది.
ఎంసెట్-2 పేపర్ లీకేజీ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తే పకడ్బందీగా ఉంటుందని భావిస్తోంది. కానీ ఇందుకు పెద్దమొత్తంలో చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి సెట్‌కు క్వశ్చన్ బ్యాంకు రూపొందించడంతోపాటు ప్రశ్నపత్రాల విధానంపైనా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై త్వరలోనే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించేందుకు విద్యా మండలి సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్ కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశంపై దృష్టి సారించాలని ఇదివరకే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.