విద్యార్థి మృతిపై భిన్న కథనాలు...
మూర్ఛతో మృతి చెందాంటున్న పాఠశాల హెచ్‌ఎం
స్నేహితుల దాడిలో చనిపోయాడంటున్న తోటి విద్యార్థులు
పోలీసుల విచారణ
గోల్కొండ: షేక్‌పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నందకుమార్ అలియాస్ నందు అనే విద్యార్థి మృతి చర్చనీయాంశమైంది. అతడి మృతిపై పరస్పర విరుద్ధ కథనాలు వినిపిస్తున్నాయి. మూర్ఛ వచ్చి చనిపోయాడని పాఠశాల వారు, తోటి విద్యార్థులు కొట్టడంతో చనిపోయాడని కొందరు విద్యార్థులంటున్నారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడం కూడా అనుమానానికి దారి తీస్తోంది. గురువారం 3.30కి 10వ తరగతి విద్యార్థి నందు మూర్ఛ వచ్చి పడిపోయాడని పాఠశాల సిబ్బంది అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి తండ్రి కిషన్ కుప్పకూలి పడి ఉన్న తన కుమారుడిని ఆటోలో గచ్చిబౌలీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఐతే నందు అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. రాత్రి 11 గంటలకు మృతదేహాన్ని స్వగ్రామమైన నారాయణఖేడ్‌కు తరలిస్తుండగా కొందరు విద్యార్థులు వచ్చి కిషన్‌ను కలిశారు. పాఠశాలలో స్నేహితులు కొట్టడంతోనే నందు చనిపోయాడని చెప్పారు. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ ఏసీపీ గౌస్ మొహినుద్దీన్, గోల్కొండ ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా.. నందకుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియాకు తరలించారు.
పోలీసుల అదుపులో ఓ విద్యార్థి ?
నందకుమార్ మృతిపై పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌తో పాటు ఇతర ఉపాధ్యాయలు, మృతుడి తల్లిదండ్రులను ప్రశ్నించారు. నందు అనారోగ్యంతో చనిపోయాడా? తోటి విద్యార్థులు కొట్టడం వల్ల మృతి చెందాడా? అనే కోణంలో విచారిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు మాత్రం నందును స్నేహితులు కొడుతుండగా చూశామని పోలీసులకు తెలిపారు. మరోవైపు తన కొడుకుకు మోర్ఛ వ్యాధి లేదని మృతుడి తండ్రి కిషన్ పోలీసులకు తెలిపాడు. నందును విద్యార్థులు కొట్టిన విషయాన్ని, అతను స్పృహతప్పి పడిపోయిన విషయాన్ని ఘటన జరిగిన రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంతేకాకుండా తన ఫోన్‌ను కూడా ఆయన స్విచ్ఛాప్ చేసుకున్నాడు. నందుతో గొడవపడిన 15 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా.. నందకుమార్ మృతిపై స్థానికులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కలువగా అతడు దురుసుగా మాట్లాడాడని, ‘ నందుకు టైం వచ్చింది.. చచ్చాడు.. చంపింది వీడే’ అని ఓ విద్యార్థిని చూపించాడని షేక్‌పేట్ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ చెప్పారు.