అయోమయం.. ‘ఆయుర్వేదం’ | Confusion on 2017-18 Admissions of Ayurvedic Medical Seat's | Sakshi
Sakshi News home page

అయోమయం.. ‘ఆయుర్వేదం’

Published Wed, Sep 6 2017 3:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

అయోమయం.. ‘ఆయుర్వేదం’ - Sakshi

అయోమయం.. ‘ఆయుర్వేదం’

- 2017–18 అడ్మిషన్లపై అస్పష్టత 
ఏఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఎన్‌వైఎస్‌సీ కోర్సులపై నిర్లక్ష్యం
ఇంకా మార్గదర్శకాలు వెల్లడించని ప్రభుత్వం  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య విద్యలో అయోమయం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యకోర్సుల నిర్వహణ అస్త వ్యస్థంగా మారింది. సాధారణ వైద్య సీట్ల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లు భర్తీ అయ్యాయి. ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ మార్గదర్శకాలను పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కాళోజీ ఆరోగ్య, విజ్ఞాన విశ్వ విద్యాలయం జూలై 7న అడ్మిషన్ల ప్రక్రియను మొదలుపెట్టింది.

అన్ని సీట్ల భర్తీ కోసం మూడుసార్లు కౌన్సెలింగ్‌ నిర్వహించింది. అయితే సంప్రదాయ వైద్య విధానమైన ఆయుష్‌ కోర్సుల విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడంలేదు. ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, నేచురోపతి–యోగిక్‌ సీట్ల భర్తీకి అనుసరిం చే మార్గదర్శకాలను సైతం ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఈ సీట్ల భర్తీ ఎన్నిరోజులకు మొదలవుతుందనేది తెలియడంలేదు. కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వెలువడక పోవడంతో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆందోళనపడుతున్నారు. 
 
మొదలేకాని అడ్మిషన్ల ప్రక్రియ: రాష్ట్రంలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్‌ కోర్సులను నిర్వహించే కాలేజీలు 9 ఉన్నాయి. వీటిల్లో 655 సీట్లున్నాయి. నేచురోపతి–యోగిక్‌ కోర్సును అందించే కాలేజీ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉంది. ఈ కాలేజీలోని 30 సీట్లలో రెండు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) ర్యాంకుల మెరిట్‌ ఆధారంగా ఆయుష్‌ కోర్సులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఈ కోర్సుల ప్రవేశాల ప్రక్రియను  మొదలుపెట్టలేదు.

ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, న్యాచురోపతి–యోగిక్‌ కోర్సులలో వార్షిక ఫీజు గత ఏడాది ఏ కేటగిరికి రూ.21 వేలు, బీ కేటగిరికి రూ.50 వేలు, సీ కేటగిరికి రూ.1.25 లక్షలు ఉంది. ఫీజులు, అడ్మిషన్ల ప్రక్రియలో అనుసరించే విధానాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ కోర్సుల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయుష్‌ కోర్సుల అడ్మిషన్లపై వెంటనే విధివిధానాలను ప్రకటించాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. 
 
బీఏఎంఎస్, బీహెచ్‌ఎంస్, బీఎన్‌వైఎస్‌సీ కోర్సుల సీట్లు...
డాక్టర్‌ బి.ఆర్‌.కె.ఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ (హైదరాబాద్‌) 50
ఏ.ఎల్‌.ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ (వరంగల్‌) 50
జె.ఎస్‌.పీ.ఎస్‌ ప్రభుత్వ హోమియోపతిక్‌ (హైదరాబాద్‌) 100
జిమ్స్‌ హోమియోపతిక్‌ (శంషాబాద్‌) 100
ఎం.ఎన్‌.ఆర్‌ హోమియోపతిక్‌ (సంగారెడ్డి) 100
దేవ్స్‌ హోమియోపతిక్‌ (కీసర) 50
నిజామియా తిబ్బియా/యునానీ (చార్మినార్‌) 75
అల్‌ అరిఫ్‌ యునానీ (హైదరాబాద్‌) 100
గాంధీ నాచురోపతిక్‌–యోగిక్‌ 30

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement