
‘టెట్ వాయిదా ప్రభుత్వ వైఫల్యమే’
సాక్షి, హైదరాబాద్: టెట్, ఎంసెట్ వంటి కీలకమైన పరీక్షల వాయిదాకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యా సంస్థలతో సమన్వయం చేసుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు.
పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లో తనిఖీలు, పరిశీలన చేయడానికి ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యా మండలి ఉన్నా.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. మే 1న టెట్, 2న ఎంసెట్‌ను యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.