నేడు సిటీకి రాహుల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారంనగరానికి వస్తున్నారు.
ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు భారీ ఎత్తున సన్నాహాలు చేశారు.
సిటీబ్యూరో: నగర కాంగ్రెస్ పార్టీలో రాహుల్ జోష్ కనిపిస్తోంది. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీకి ఎయిర్ పోర్టు నుంచినగర శివార్ల వరకు అడుగడుగునా స్వాగతం పలికేందుకు నగర నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఎయిర్ పోర్టు నుంచి ప్రారంభయ్యే ర్యాలీ మాసబ్‌ట్యాంక్, పంజగుట్ట, బేగంపేట, బోయిన్‌పల్లి, సుచిత్ర మీదుగా మేడ్చల్ వరకు సాగనుంది. రెండు వేల ద్విచక్ర వాహనాలు, భారీ జనంతో రైతు భరోసా యాత్రకు మద్దతు తెలిపేందుకు సన్నాహాలు చేశారు.
నేతల్లో కదలిక
శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న నగర కాంగ్రెస్ నేతలందరూ రాహుల్ పర్యటనతో క్రియాశీలకం అవుతున్నారు. ముఖ్య నాయకులు సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, శ్రీధర్ తదితరులు వివిధ ప్రాంతాల్లో రాహుల్‌కు భారీ స్వాగతం పలికే ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ నియోజకవర్గ నాయకులు బండారి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... రైతుల్లో భోరోసా నింపేందుకు వస్తున్న రాహుల్‌గాంధీకి భారీ స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.