
వెంకయ్య గొంతు మూగబోయిందా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సీనియన్ నేత, మాజీమంత్రి శైలజానాథ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పట్లో రాజ్యసభలో హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు గొంతు ఇప్పుడు మూగబోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు అయిదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే.
చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి న్యాయం చేయలేరని మరోసారి రుజువైందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదని ఆయన అన్నారు. బాబుతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మీద ఒత్తిడి తీసుకు రావాలని శైలజానాథ్ సూచించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు.. మోదీ, రాజ్నాథ్, అమిత్ షా ఇళ్లముందు ధర్నాలు చేస్తారో...లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీసీసీ రాజకీయ పోరాటం చేస్తోందని, అవసరం అయితే న్యాయపోరాటం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు.