speical status
-
‘హోదా’పై అదే పోరు
- రాష్ట్రవ్యాప్తంగా ఉధృతమవుతున్న ఆందోళనలు - కొనసాగుతున్న దీక్షలు, ర్యాలీలు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అలుపెరగని పోరు కొనసాగుతోంది. ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ర్యాలీలు, నిరాహార దీక్షలు, వినూత్న నిరసన కార్యక్రమాలతో ప్రజలు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో మంగళవారం వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహించారు. నెల్లూరు: విడవలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. కావలిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటాచలంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. అనంతపురం: కదిరిలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, సీపీఎం, పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. రాయదుర్గంలో నాలుగో రోజు దీక్షలను మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. గుత్తి, గుంతకల్లులో బైక్ ర్యాలీ చేపట్టారు. తాడిపత్రిలో నాలుగో రోజూ రిలే దీక్షలు కొనసాగాయి. కడప: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బద్వేలు లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ప్రొద్దుటూ రు, రాయచోటి, కడప, రాజంపేటలో రిలే దీక్షలు కొనసాగాయి. కర్నూలు: పాణ్యం, కర్నూలు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా అఖిలప్రియారెడ్డి, ఐజయ్యలు పాల్గొన్ని సంఘీభావం తెలిపారు. తిరుపతి: తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంట సర్కిల్, పలమనేరు, నారాయణవనం, ఐరాల, నగరి, పుంగనూరు, కుప్పం, చిత్తూరు, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు, దీక్షలు జరిగాయి. శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద దీక్షా శిబిరాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాధరావు ప్రారంభించారు. పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, టెక్కలి, పలాస, ఎచ్చెర్ల, పాలకొండ, ఇచ్ఛాపురంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. విజయనగరం: తొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. విజయనగరం పట్టణం, సాలూరు, కురుపాం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోటలో కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. బొబ్బిలిలో రిలే దీక్షలను కొనసాగించారు. తూర్పుగోదావరి: రాజమండ్రి కోటగుమ్మం సెంటర్, రామచంద్రాపురం రిలే దీక్షలు కొనసాగాయి. ఏలేశ్వరం, ప్రత్తిపాడుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తునిలో జరిగిన రిలే దీక్షల్లో కోటనందూరు మండల కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం, అమలాపురం హైస్కూల్ సెంటర్లో దీక్షలను వైఎస్సార్సీపీ నేతలు ప్రారంభించారు. ఏజెన్సీ, జగ్గంపేట, రాజానగరం, కరప మండలం, పిఠాపురం, అనపర్తి, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి: జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. తణుకు, ఆచంట తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విశాఖ: పాడేరు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మాడుగులలో రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. విశాఖలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. తగరపువలసలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని తెలిపారు. చోడవరం, పాయకరావుపేటలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ: కంకిపాడు ప్రధాన సెంటరులో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో జరిగిన ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకుడు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఒంగోలు: గిద్దలూరు, చీరాల, టంగుటూరు, సంతనూతల పాడు, గిద్దలూరు, దర్శి, చీరాల, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల్లో ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగాయి. గుంటూరు: బాపట్ల, సత్తెనపల్లి, వినుకొండ, తెనాలి నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీల్లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
జననేత దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరూవాడా ఏకమై ఉద్యమబాట పట్టాయి. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ దీక్షకు సంఘీభావంగా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని ప్రజలు నినదిస్తున్నారు. హోదా సాధనకు కట్టుబడి రాష్ట్రాభివృద్ధికోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు నల్లపాడు బాట పట్టారు. రెండోరోజైన గురువారం ఉదయంనుంచే దీక్షా శిబిరంవద్ద జనం పోటెత్తారు. బుధవారం రాత్రి శిబిరంలోనే పడుకున్న జగన్ ఉదయాన్నే తన స్థానంలో యథావిధిగా కూర్చున్నారు. అప్పటినుంచి వచ్చిన వారందరితో చేయి కలుపుతూ, అభివాదం చేస్తూ, పలకరిస్తూ గడిపారు. తమకోసం, తమ భవిష్యత్తుకోసం ప్రత్యేకహోదా కావాలని కృషిచేస్తున్న జగన్‌కు పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ ఉద్యోగాలకోసం తపిస్తున్న జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీయువకులు ఎగబడ్డారు. ఆ సెల్ఫీలను అక్కడికక్కడే సోషల్ నెట్వర్క్ సైట్లలో అప్లోడ్ చేశారు. ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించారు. మద్దతు తెలిపిన నేతలు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో దీక్షా ప్రాంగణానికి వచ్చి జగన్మోహన్రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షకోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అభినందించారు. హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలా ఉధృతం చేయాలని గద్దె పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఢిల్లీలో ఆశాభావం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం కోసం రైతులు, ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నట్లు వివరించారు. వాటన్నింటినీ విన్న జగన్ ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను వివరించి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఉద్యోగులు కూడా తాము పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరుకు చెందిన న్యాయవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పారిశ్రామికవేత్తల సంఘీభావం ప్రత్యేక హోదాకోసం జగన్ నిరవధిక దీక్షపై పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకహోదా అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ జేఏ చౌదరి చెప్పారు. గతంలో ఐటీ రంగానికి పదేళ్లపాటు పన్ను రాయితీలు కల్పించడంవల్లే ఆ రంగం వేగంగా విస్తరించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెడతారని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరి ఆందోళన వ్యక్తంచేశారు. హోదాతోనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమని విశాఖ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్కుమార్ తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని ఫ్యాప్సియో రాష్ట్ర అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని రాయలసీమ గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ఉపాధ్యక్షుడు పి.సతీష్‌కుమార్ ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ నాయకులు పలువురు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, దీనికోసం జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఖరిపై గురించి చేసిన ఉపన్యాసాలతో ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్ష జరుగుతున్న నల్లపాడు ప్రాంగణం హోరెత్తింది. దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం అరండల్‌పేట (గుంటూరు): ప్రత్యేక హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత, విద్యార్థులు, మహిళలు, ఉత్సాహం చూపుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, మహిళలు జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలి వచ్చారు. వీరు జగన్‌కు సంఘీభావం తెలపడంతోపాటు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జగన్ సెల్ఫీలు దిగేందుకు వారికి అవకాశం కల్పించారు. చాలా మంది యువకులు వారు దిగిన సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడు చేశారు. దీంతో వారి స్నేహితులు, బంధువులు, లైక్‌లు కొట్టడంతోపాటు, జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేయడం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు. ఈతరం నేతకు ఇంటర్నెట్లో నీరాజనం సాక్షి, హైదరాబాద్: ఈతరం విద్యార్థుల కోసం, ఈతరం యువత కోసం పోరాడుతున్న ఈతరం నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఇంటర్నెట్లో యువతరం నీరాజనాలు పడుతోంది. ప్రత్యేకహోదా అంశంపై యువతీయువకులు జగన్ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దీక్షా శిబిరంవద్ద కలసిన యువతీయువకులు తీసుకున్న సెల్ఫీలు, మరోవైపు జగన్‌కు మద్దతుగా ప్రపంచం నలువైపుల నుంచి తెలుగు వాళ్లు పంపుతున్న సెల్ఫీ వీడియోలతో తెలుగు వాళ్ల ఫేస్బుక్ పేజీలు నిండిపోయాయి. జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా రెండోరోజూ ఇంటర్నెట్లో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ దీక్షతో ఇంటర్నెట్లో ‘ప్రత్యేకహోదా’ అంశంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా దక్కితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి, అవకాశాలు విస్తృతమయ్యే విధానం గురించి నెటిజన్లు పోస్టుల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్న యువత జగన్‌కు మద్దతు పలకడం తమ బాధ్యతగా తీసుకున్నారు. ఎన్ఆర్ఐల నుంచి వెల్లువెత్తిన మద్దతు ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. సెల్ఫీ వీడియోల ద్వారా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారిలో ప్రవాసులే ఎక్కువమంది ఉన్నారు. తొలిరోజు మొదలైన ఈ ట్రెండ్ రెండో రోజుకు మరింత విస్తృతమైంది. ఒకవైపు జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఉద్యమిస్తుంటే.. ఆయనపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులపై నెటిజన్లు మండి పడుతున్నారు. వ్యంగ్యాస్త్రాలతో తెలుగుదేశం నేతలను ఎద్దేవా చేస్తున్నారు. ఆ చిన్నారి పేరు విజయమ్మ.. గుంటూరు రూరల్: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారంనాడు ఊహించని అభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. పొత్తిళ్లలో ఓ పసిబిడ్డను తీసుకువచ్చిన తల్లిదండ్రులు పేరుపెట్టాల్సిందిగా జగన్‌ను అభ్యర్థించారు. తమ బిడ్డను జగన్ చేతుల్లో ఉంచారు. గుండెల నిండా పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, విజయమ్మగారన్నా మీరన్నా మాకు ఎంతో అభిమానమని వారు జగన్‌కు వివరించారు. తమ బిడ్డకు విజయమ్మ పేరు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. నెలరోజుల వయసు ఉన్న ఆ పాపకు విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. ఆ జంట గుంటూరు రూరల్ మండలంలోని స్వర్ణభారతి నగర్ కాలనీకి చెందిన షేక్ నాగుల్, మస్తాన్‌బీ. తమ కాలనీ వాసులతో కలసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అభిమానిస్తున్న, ఆరాధిస్తున్న ఆ జంటకు జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. 24 గంటలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుండటంతో రెండో రోజు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు. ఉదయం 10.30 గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షర్మిల పరీక్షలు చేయగా రాత్రి 8.30 గంటలకు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు చేశారు. ఉదయం బీపీ 120/80 ఉండగా రాత్రి 130/90 ఉంది. ఉదయం షుగర్ 91 ఉండగా రాత్రి 85 ఉంది. బీపీ, షుగర్లు సాధారణంగా ఉన్నట్లు పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు. -
రోడ్డు మీద దీక్షలు చేస్తే చూస్తూ ఉండాలా?
* చనిపోతామని దరఖాస్తు పెడితే అనుమతి ఇస్తామా? * నువ్వు అనుమతిస్తావా అంటూ మీడియా ప్రతినిధిపై రుసరుస * సమస్యలుంటే ఢిల్లీలో చెప్పుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: దీక్షలు ఎక్కడపడితే అక్కడ రోడ్డు మీద చేస్తారా? ట్రాఫిక్ జామ్ చేస్తే చూస్తూ ఉండాలా? ఎవరైనా చనిపోతామని (నిరవధిక దీక్ష) దరఖాస్తు చేస్తే అనుమతి ఎలా ఇస్తారు? మీరూ అలాంటివాటికి మద్దతు చెప్పడం నేరం కాదా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో దీక్ష చేస్తానంటే అనుమతి ఇస్తావా, దానికి చట్టం అనుమతిస్తుందా? అంటూ మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు విసుక్కున్నారు. ఏపీ ప్రభుత్వం సంకల్ప దీక్ష చేసింది కదా అని ప్రశ్నించగా.. నిబంధనల ప్రకారం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సంకల్పం తీసుకున్నామని బదులిచ్చారు. వర్సిటీలో జరిగిన దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వీసీని దబాయిస్తారా, బలవంతంగా ప్రకటనలు ఇప్పిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలొస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి, డబ్బు ఇవ్వకుంటే ఏం చేస్తారని విపక్షాన్ని ప్రశ్నించారు. అఖిలపక్షం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమవుతోందని విపక్షం చేస్తున్న విమర్శలకు బాబు బదులిస్తూ.. ‘తప్పుడు సమాచారం ఇవ్వడానికి అఖిలపక్షం వేయాలా? వాళ్లు చెప్పింది నేను చేస్తాను. నష్టపోయేది ఎవ్వరు? ప్రజలు కాదా నష్టపోయేది. ప్రతిపక్షం ఏదీ రాకూడదని ప్రయత్నం చేసినప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా అన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలికదా’ అని అన్నారు. వాన్‌పిక్‌ను టేకోవర్ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలోని దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో కొన్ని ప్రభుత్వ, మరికొన్ని ప్రైవేటువి ఉన్నాయన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని, పెట్టుబడులు రావాలంటే ప్రైవేటు పోర్టులు రావాలని చెప్పారు. 16నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చానంటున్న మీరు విపక్షాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించగా, నేనేమీ భయపడడంలేదు, మీరే భయపడుతున్నారని బదులిచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్లా పనిచేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన విమర్శలపై అడిగిన ప్రశ్నకు బాబు బదులిస్తూ ఆ వ్యాఖ్యలకు, టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పారు. 2028 నాటికి ఏపీ నంబర్ 1 ఏపీ ప్రస్తుతం 31వ స్థానంలో ఉందని, 2022 నాటికి తొలి మూడు స్థానాల్లోకి, 2028 నాటికి మొదటి స్థానంలోకి తీసుకెళ్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి సెక్షను-8, షెడ్యూల్ 9, 10 అంశాలపై చర్చించామన్నారు. ఆర్థికమంత్రి జైట్లీని కలసి నీతి ఆయోగ్ మార్గదర్శ ప్రణాళిక విషయమై చర్చించానన్నారు. కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, నిర్మలా సీతారామన్‌లను కలిసి పామాయిల్, పొగాకు రైతులకు కనీస మద్దతు ధర పెంచాలని కోరామన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజును కలిసి రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఆధునీకరణ అంశాలపై చర్చించామన్నారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం, పట్టిసీమ పథకాలను వివరించినట్టు బాబు చెప్పారు. -
'ప్రత్యేక హోదాపై చంద్రబాబు పోరాడాలి'
పార్వతీపురం (విజయనగరం జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోరాడాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీమంత్రి విజయరామరాజు చెప్పారు. సోమవారం ఇక్కడికొచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు మెతకవైఖరి అవలంభిస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందన్నారు. అందుకే చంద్రబాబు మౌనం వీడి కేంద్రంతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
వెంకయ్య గొంతు మూగబోయిందా?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ సీనియన్ నేత, మాజీమంత్రి శైలజానాథ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పట్లో రాజ్యసభలో హామీ ఇచ్చిన వెంకయ్య నాయుడు గొంతు ఇప్పుడు మూగబోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అయిదు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభ సాక్షిగా చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి న్యాయం చేయలేరని మరోసారి రుజువైందని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెస్తే ప్రత్యేక హోదా సాధ్యమయ్యేదని ఆయన అన్నారు. బాబుతో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మీద ఒత్తిడి తీసుకు రావాలని శైలజానాథ్ సూచించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు.. మోదీ, రాజ్‌నాథ్, అమిత్ షా ఇళ్లముందు ధర్నాలు చేస్తారో...లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీసీసీ రాజకీయ పోరాటం చేస్తోందని, అవసరం అయితే న్యాయపోరాటం చేస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. -
‘హోదా’పై అప్పుడు నోరెత్తలేదేం?
టీడీపీ నేతలపై బీజేపీ విమర్శలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ ఎదుగుదల అవకాశాలను చూసి ఓర్వలేని వారే ప్రత్యేక హోదా అంశాన్ని అడ్డం పెట్టుకొని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల, కార్యదర్శి వేణుగోపాల్‌లు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ టీడీపీ ఎంపీ ఆ రోజు చర్చలో పోలవరానికి వ్యతిరేకంగా మాట్లాడినా సీఎం రమేష్, సుజనాచౌదరిలు కనీసం తప్పుపట్టలేదని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉందన్నారు. -
'పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తాం'
-
'పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తాం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో ప్రారంభమైంది. సమావేశానికి ముందు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించడానికి కేంద్రంపై పోరాటం చేస్తామని రఘవీరా రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపడతామన్నారు. సమావేశానికి కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి, ఎంపీ జేడీ శీలం, కేవీపీ, సి. రామచంద్రయ్య, కొప్పుల రాజు హాజరయ్యారు. కాగా సమావేశానికి బొత్స సత్యనారాయణ, చిరంజీవి గైర్హాజరయ్యారు. -
‘ప్రత్యేక హోదా’ కోరుతూ నేడు కాంగ్రెస్ ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి వెంటనే ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, మాజీ ఎంపీలు సోమవారం ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అంతకుముందు ఉదయం 9.30 గంటలకు ఏపీ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం కానుంది. దిగ్విజయ్‌సింగ్, జైరాంరమేశ్, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ జేడీ శీలం, కేవీపీ, సి.రామచంద్రయ్యలు సమావేశానికి హాజరుకానున్నారు.