జననేత దీక్షకు వెల్లువెత్తిన మద్దతు | More response to Ys jagan mohan reddy's deeksha | Sakshi
Sakshi News home page

జననేత దీక్షకు వెల్లువెత్తిన మద్దతు

Published Fri, Oct 9 2015 2:51 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

More response to Ys jagan mohan reddy's deeksha

సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. రాష్ర్టవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఊరూవాడా ఏకమై ఉద్యమబాట పట్టాయి. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అంటూ దీక్షకు సంఘీభావంగా ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్‌తోనే ప్రత్యేకహోదా సాధ్యమని ప్రజలు నినదిస్తున్నారు. హోదా సాధనకు కట్టుబడి రాష్ట్రాభివృద్ధికోసం ప్రాణాన్ని పణంగా పెట్టి దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలూ ఉద్యమిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు నల్లపాడు బాట పట్టారు. రెండోరోజైన గురువారం ఉదయంనుంచే దీక్షా శిబిరంవద్ద జనం పోటెత్తారు.
 
 బుధవారం రాత్రి శిబిరంలోనే పడుకున్న జగన్ ఉదయాన్నే తన స్థానంలో యథావిధిగా కూర్చున్నారు. అప్పటినుంచి వచ్చిన వారందరితో చేయి కలుపుతూ, అభివాదం చేస్తూ, పలకరిస్తూ గడిపారు. తమకోసం, తమ భవిష్యత్తుకోసం ప్రత్యేకహోదా కావాలని కృషిచేస్తున్న జగన్‌కు పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి సంఘీభావం తెలిపారు. తమ ఉద్యోగాలకోసం తపిస్తున్న జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు యువతీయువకులు ఎగబడ్డారు. ఆ సెల్ఫీలను అక్కడికక్కడే సోషల్ నెట్‌వర్క్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రముఖులు పార్టీలకు అతీతంగా సంఘీభావం ప్రకటించారు.
 
మద్దతు తెలిపిన నేతలు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ భారీ మోటార్ సైకిళ్ల ర్యాలీతో దీక్షా ప్రాంగణానికి వచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఐదుకోట్ల ప్రజల ఆకాంక్షకోసం దీక్ష చేస్తున్న జగన్‌ను అభినందించారు. హోదాపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. లోక్‌సత్తా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలా ఉధృతం చేయాలని గద్దె పిలుపునిచ్చారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఢిల్లీలో ఆశాభావం వ్యక్తంచేశారు.
  రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు కొందరు తాము పడుతున్న ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిణామాలు, ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం కోసం రైతులు, ఇతర వర్గాలను ఇబ్బంది పెడుతున్నట్లు వివరించారు. వాటన్నింటినీ విన్న జగన్ ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను వివరించి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నగర పాలక సంస్థ ఉద్యోగులు కూడా తాము పడుతున్న ఇబ్బందులను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. గుంటూరుకు చెందిన న్యాయవాదులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
 
 పారిశ్రామికవేత్తల సంఘీభావం

 ప్రత్యేక హోదాకోసం జగన్ నిరవధిక దీక్షపై పలువురు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేకహోదా అత్యంత ఆవశ్యకమని వారు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదావల్ల రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుందని ఫిక్కీ ఏపీ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ జేఏ చౌదరి చెప్పారు. గతంలో ఐటీ రంగానికి పదేళ్లపాటు పన్ను రాయితీలు కల్పించడంవల్లే ఆ రంగం వేగంగా విస్తరించిందని గుర్తుచేశారు. ప్రత్యేకహోదా వస్తే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాయి కాబట్టి ప్రపంచంలోని పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెడతారని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. హోదాపై స్పష్టత ఇవ్వకపోవడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ సురేష్ చిట్టూరి ఆందోళన వ్యక్తంచేశారు.

హోదాతోనే ఐటీ రంగంలో అభివృద్ధి సాధ్యమని విశాఖ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్ తెలిపారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న రాయలసీమలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందని ఫ్యాప్సియో రాష్ట్ర అధ్యక్షుడు జి.రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రత్యేకహోదా కోసం జగన్ చేస్తున్న దీక్ష సఫలం కావాలని రాయలసీమ గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య ఉపాధ్యక్షుడు పి.సతీష్‌కుమార్ ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనాలు, దీనికోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటం, ప్రభుత్వ వైఖరిపై గురించి చేసిన ఉపన్యాసాలతో ఉదయం నుంచి రాత్రి వరకూ దీక్ష జరుగుతున్న నల్లపాడు ప్రాంగణం హోరెత్తింది. దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
 
 సెల్ఫీలు దిగేందుకు యువత ఉత్సాహం
 అరండల్‌పేట (గుంటూరు): ప్రత్యేక హోదా సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు యువత, విద్యార్థులు, మహిళలు, ఉత్సాహం చూపుతున్నారు. గురువారం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, మహిళలు జగన్ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తరలి వచ్చారు. వీరు జగన్‌కు సంఘీభావం తెలపడంతోపాటు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. వీరి ఉత్సాహాన్ని గమనించిన జగన్ సెల్ఫీలు దిగేందుకు వారికి అవకాశం కల్పించారు. చాలా మంది యువకులు వారు దిగిన సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడు చేశారు. దీంతో వారి స్నేహితులు, బంధువులు, లైక్‌లు కొట్టడంతోపాటు, జగన్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేయడం అభినందనీయమని కామెంట్లు పెడుతున్నారు.
 
 ఈతరం నేతకు ఇంటర్నెట్‌లో నీరాజనం
 సాక్షి, హైదరాబాద్: ఈతరం విద్యార్థుల కోసం, ఈతరం యువత కోసం పోరాడుతున్న ఈతరం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇంటర్నెట్‌లో యువతరం నీరాజనాలు పడుతోంది. ప్రత్యేకహోదా అంశంపై యువతీయువకులు జగన్ పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దీక్షా శిబిరంవద్ద కలసిన యువతీయువకులు తీసుకున్న సెల్ఫీలు, మరోవైపు జగన్‌కు మద్దతుగా ప్రపంచం నలువైపుల నుంచి తెలుగు వాళ్లు పంపుతున్న సెల్ఫీ వీడియోలతో తెలుగు వాళ్ల ఫేస్‌బుక్ పేజీలు నిండిపోయాయి. జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా రెండోరోజూ ఇంటర్నెట్‌లో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ దీక్షతో ఇంటర్నెట్‌లో ‘ప్రత్యేకహోదా’ అంశంపై కూడా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రత్యేకహోదా దక్కితే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి, అవకాశాలు విస్తృతమయ్యే విధానం గురించి నెటిజన్లు పోస్టుల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగావకాశాల కోసం వేచి ఉన్న యువత జగన్‌కు మద్దతు పలకడం తమ బాధ్యతగా తీసుకున్నారు.  

 ఎన్‌ఆర్‌ఐల నుంచి వెల్లువెత్తిన మద్దతు
 ఇంటర్నెట్ మాధ్యమంగా ప్రవాసాంధ్రులు జగన్‌మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. సెల్ఫీ వీడియోల ద్వారా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారిలో ప్రవాసులే ఎక్కువమంది ఉన్నారు. తొలిరోజు మొదలైన ఈ ట్రెండ్ రెండో రోజుకు మరింత విస్తృతమైంది.  ఒకవైపు జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఉద్యమిస్తుంటే.. ఆయనపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులపై నెటిజన్లు మండి పడుతున్నారు. వ్యంగ్యాస్త్రాలతో తెలుగుదేశం నేతలను ఎద్దేవా చేస్తున్నారు.  
 
 ఆ చిన్నారి పేరు విజయమ్మ..
 గుంటూరు రూరల్: ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారంనాడు ఊహించని అభిమానం ఉక్కిరిబిక్కిరి చేసింది. పొత్తిళ్లలో ఓ పసిబిడ్డను తీసుకువచ్చిన తల్లిదండ్రులు పేరుపెట్టాల్సిందిగా జగన్‌ను అభ్యర్థించారు. తమ బిడ్డను జగన్ చేతుల్లో ఉంచారు. గుండెల నిండా పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నారని, విజయమ్మగారన్నా మీరన్నా మాకు ఎంతో అభిమానమని వారు జగన్‌కు వివరించారు. తమ బిడ్డకు విజయమ్మ పేరు పెట్టాల్సిందిగా అభ్యర్థించారు. నెలరోజుల వయసు ఉన్న ఆ పాపకు విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. ఆ జంట గుంటూరు రూరల్ మండలంలోని స్వర్ణభారతి నగర్ కాలనీకి చెందిన షేక్ నాగుల్, మస్తాన్‌బీ. తమ కాలనీ వాసులతో కలసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తమను అభిమానిస్తున్న, ఆరాధిస్తున్న ఆ జంటకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
 
 వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు
 ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి రెండో రోజుకు చేరుకుంది. 24 గంటలుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుండటంతో రెండో రోజు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు.  ఉదయం 10.30 గంటలకు జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ షేక్ షర్మిల పరీక్షలు చేయగా రాత్రి 8.30 గంటలకు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీకృష్ణ వైద్య పరీక్షలు చేశారు. ఉదయం బీపీ 120/80 ఉండగా రాత్రి 130/90 ఉంది. ఉదయం షుగర్ 91 ఉండగా రాత్రి 85 ఉంది. బీపీ, షుగర్‌లు సాధారణంగా ఉన్నట్లు పరీక్షలు చేసిన వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement