
రోడ్డు మీద దీక్షలు చేస్తే చూస్తూ ఉండాలా?
* చనిపోతామని దరఖాస్తు పెడితే అనుమతి ఇస్తామా?
* నువ్వు అనుమతిస్తావా అంటూ మీడియా ప్రతినిధిపై రుసరుస
* సమస్యలుంటే ఢిల్లీలో చెప్పుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: దీక్షలు ఎక్కడపడితే అక్కడ రోడ్డు మీద చేస్తారా? ట్రాఫిక్ జామ్ చేస్తే చూస్తూ ఉండాలా? ఎవరైనా చనిపోతామని (నిరవధిక దీక్ష) దరఖాస్తు చేస్తే అనుమతి ఎలా ఇస్తారు? మీరూ అలాంటివాటికి మద్దతు చెప్పడం నేరం కాదా అంటూ ఏపీ సీఎం చంద్రబాబు మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో దీక్ష చేస్తానంటే అనుమతి ఇస్తావా, దానికి చట్టం అనుమతిస్తుందా? అంటూ మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంపై అడిగిన ప్రశ్నకు చంద్రబాబు విసుక్కున్నారు.
ఏపీ ప్రభుత్వం సంకల్ప దీక్ష చేసింది కదా అని ప్రశ్నించగా.. నిబంధనల ప్రకారం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సంకల్పం తీసుకున్నామని బదులిచ్చారు. వర్సిటీలో జరిగిన దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వీసీని దబాయిస్తారా, బలవంతంగా ప్రకటనలు ఇప్పిస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలొస్తాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి, డబ్బు ఇవ్వకుంటే ఏం చేస్తారని విపక్షాన్ని ప్రశ్నించారు. అఖిలపక్షం ఏర్పాటులో ప్రభుత్వం విఫలమవుతోందని విపక్షం చేస్తున్న విమర్శలకు బాబు బదులిస్తూ.. ‘తప్పుడు సమాచారం ఇవ్వడానికి అఖిలపక్షం వేయాలా? వాళ్లు చెప్పింది నేను చేస్తాను.
నష్టపోయేది ఎవ్వరు? ప్రజలు కాదా నష్టపోయేది. ప్రతిపక్షం ఏదీ రాకూడదని ప్రయత్నం చేసినప్పుడు బాధ్యత కలిగిన వ్యక్తిగా అన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలికదా’ అని అన్నారు. వాన్‌పిక్‌ను టేకోవర్ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలోని దుగ్గరాజపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో కొన్ని ప్రభుత్వ, మరికొన్ని ప్రైవేటువి ఉన్నాయన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని, పెట్టుబడులు రావాలంటే ప్రైవేటు పోర్టులు రావాలని చెప్పారు. 16నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చానంటున్న మీరు విపక్షాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించగా, నేనేమీ భయపడడంలేదు, మీరే భయపడుతున్నారని బదులిచ్చారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి ఏజెంట్‌లా పనిచేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు చేసిన విమర్శలపై అడిగిన ప్రశ్నకు బాబు బదులిస్తూ ఆ వ్యాఖ్యలకు, టీడీపీకి, ఏపీ ప్రభుత్వానికి సంబంధంలేదని చెప్పారు.
2028 నాటికి ఏపీ నంబర్ 1
ఏపీ ప్రస్తుతం 31వ స్థానంలో ఉందని, 2022 నాటికి తొలి మూడు స్థానాల్లోకి, 2028 నాటికి మొదటి స్థానంలోకి తీసుకెళ్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి సెక్షను-8, షెడ్యూల్ 9, 10 అంశాలపై చర్చించామన్నారు. ఆర్థికమంత్రి జైట్లీని కలసి నీతి ఆయోగ్ మార్గదర్శ ప్రణాళిక విషయమై చర్చించానన్నారు. కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, నిర్మలా సీతారామన్‌లను కలిసి పామాయిల్, పొగాకు రైతులకు కనీస మద్దతు ధర పెంచాలని కోరామన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజును కలిసి రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఆధునీకరణ అంశాలపై చర్చించామన్నారు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిసి గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం, పట్టిసీమ పథకాలను వివరించినట్టు బాబు చెప్పారు.